ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
అంగదుఁడు నరాంతకుఁ జంపుట
“యోరి! నరాంతక! యుగ్రతఁగపుల
నీరసంబునఁబేర్చి యేల చంపెదవు?
ఇంత సేసినను నీ విట బంటవైతె?
యంతశూరుఁడ వైన ననిఁదాఁకు నన్ను.”
నన విని నవ్వి నరాంతకుం: “డోరి!
వనచర! నీ వెంతవాఁడవు నాకు?
నఖిలదిక్పాలుర నదటడంచితిని;
నిఖిలదేవతల మన్నింప కేఁచితిని;
నట్టినాతోడ నీవా! యెది1349రెదవు?
పట్టి చట్టలు 1350చీరి పాఱవైచెదను.1351
ననుఁజూతుగా!”కన్న నగుచు నంగదుఁడు:
“దనుజ! దశగ్రీవుదర్పంబు మాన్చి
పూని యా ఖరసూతిఁబొరి మాల్చి పిదప
నే నేఁగునపుడు నీ వెఱుఁగవే నన్ను?”
ననుడు దానవుఁడు కాలాహిచందమున
మునుకొని యూర్పులు మ్రోయంగ వచ్చి
ఘనతరవిస్ఫులింగంబులు సెదర
ననయంబుఁదనశక్తి నంగదు వైచె.
గరుడనివక్త్రంబు గదిసినంతటనె
పరిసినకాలసర్పంబును బోలె
నది వజ్రనిభమైన యతని వక్షంబుఁ
గదిసిన యంతనే ఖండంబు లయ్యె.
వజ్రాయుధంబున వరశైల మడుచు
వజ్రిచందంబున వాలి నందనుఁడు
నఱచేత వాని హయంబుమస్తకము
పఱియలువాఱ నిర్భరవృత్తి నేసెఁ.
జెచ్చెర వ్రేయంగఁజేడ్పడి నోరు
విచ్చుచు నాలుక వెడలఁబెట్టుచును
వెరవఱి కాళ్లును వెసఁదన్నుకొనుచు
ధరమీఁదఁబడి చచ్చెఁదత్తురంగంబు.
నటు తురంగము వడ్డ నన్నరాంతకుఁడు
చటులకోపానలజ్వలితా1352క్షుఁడగుచుఁ
“గెడయు.”మంచును బిడికిట మస్తకంబుఁ
బొడిచి యంగదుమూర్ఛఁబొందించు టయును
నంతనె తెలిసి:“నరాంతక! నీకు
నింతశక్తియుఁగలదే!”యని పేర్చి
పెరిగి1353యుఁబిడుగైన పిడికిట వాని
వరశైలనిభమైన వక్షంబు వొడిచెఁ.
బొడిచిన నెత్తురు పొరిఁబొరిఁదొరుగఁ
బొడిపొడియై ధరఁబునుకలు సెదరఁ
గడుఘోరమైన సంగరభూమిలోనఁ
బడి నరాంతకుఁడంతఁబ్రాణముల్‌ విడిచె.
నార్చిరి దేవత లామింట నుండి;
యార్చిరి వానరు లవనీతలమున.
దనుజాధినాథుని తనయునిపాటుఁ
గని మహోదరుఁడుగ్రకరిఁబురికొల్పె.[వా.రా. సర్గ 70]

  1. ↑రింపఁ-బ
  2. ↑వాపి
  3. ↑నరయంగముకుపచ్చ లారవు నేఁడు - బిరుదుపిచ్చుకలతోఁ బెనఁగఁ జూచెదవు - ననుఁ జూతు…
  4. ↑స్యుఁ
  5. ↑నపిడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )