| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నతని వీడ్కొని సువేలాచలంబెక్కి చతురుఁడై పదములు సమముగా1485మెట్టి లలితశేషాభవాలము మీఁది కెత్తి నెలకొని భుజములు నిక్కించి పొంగి రామునిఁదలఁచుచు రయమున నెగయ నా మహనీయాద్రి యవనిలోఁగ్రుంగె; దెసలు గంపించె; దిర్దిర ధాత్రి దిరిగె; నసమానమైనట్టి యా రభసమున. నతఁడటు లెగసి యయ్యాకాశవీథి నతిభీషణంబైన యంబుధి దాటి హరిచక్రమును బోలె నరుగుచు నడుమఁ దరమిడి పెక్కుచోద్యములు సూచుచును సాంద్రఫేనామృతజలనిధి దాటి చంద్రశైల ద్రోణశైలమధ్యమునఁ దిరమైన యా యోషధీశైల మెక్కి యరయుచు వచ్చుచో నా యోషధులును గామరూపులు గాన కపిశేఖరునకు నేమియుఁబొడగాననీవయ్యెఁ దమ్ము. ననిలతనూభవుఁడవి గానకుండి తనలోన1486నందంద దలపోసి చూచి యతి వినయంబున నప్పర్వతంబు నతులగుణోదాత్తుఁడై వేఁడఁ దొడఁగెఁ: “బ్రాలేయగిరియును బర్జన్యగిరియుఁ గైలాసగిరియును గైకొన కేను గ్రన్నన వచ్చితిఁ, గార్యాతురుండ, నిన్ను నుద్దేశించి నిఖిలాద్రినాథ! నీయందు నిర్జరుల్ నెఱి దాఁచియున్న యా యౌషధము లెవ్వి, యవి నాకుఁజూపు. మా రాఘవునకుఁగార్యము వుట్టియున్న; దే రూపముననైన నిచ్చుట లెస్స.” యనిన నగ్గిరి యట్టహాసంబు సేసి యనిలనందనుతోడ ననియె గర్వించి: “పెలుచ నీ విటు వచ్చి పెక్కు లాడెదవు; తలఁకక యీ యౌషధములు నన్నడుగ నీ వెంతవాఁడవు? నిన్నుఁదెమ్మనఁగ 1487నే విధంబున రాముఁడెంతటివాఁడు? చేకొని సురలు దాఁచిన యౌషధములు నీకు నిచ్చుటకంటె నేరమి గలదె?” యని గర్వమాడిన ననిలనందనుఁడు కినుకతోఁబలికె నగ్గిరితోడఁబేర్చి: “యే నిన్ను వలెనని యిటు వేఁడుకొనిన దాని విచారింపఁదగదొకో నీకు? నగలించి నా భుజాయతశక్తి నిన్ను నగమ. మూలోన్మూలనంబుగాఁబెఱికి యిదె కొనిపోయెద; నెఱుఁగని రాము హృదయంబులో నప్పుడెఱిఁగెదుగాక!” యని విభీషణంబుగా హనుమంతుఁడద్రి ననువారఁగాఁబట్టి యగలించి పేర్చి పెఱికి గంధర్వుల 1488బెదరంగఁద్రోలి గుఱుతిడ రాకుండఁగొనిరాఁగఁదొడఁగె ననిలనందనుఁడు సహస్రధారలను ఘనముగా వెలుఁగు చక్రముతోడి విష్ణు కరణి నేతేర రాక్షసవీరముక్త శరహతి నొచ్చి మూర్ఛల నున్నకపులు వరమహౌషధవాత వశతచేఁదెలిసి కరము సంప్రీతితోఁగడఁగి యార్చుచును ననిమొనఁబడిన దైత్యావళిఁగిట్టి వనధిలోపలఁబాఱవైచిరి చెలఁగి. హనుమంతుఁడును సువేలాద్రి వేకడచి చనుదెంచి యా కపిసైన్యంబునడుమ మహనీయమైనట్టి మందులకొండ మిహిరప్రతాపుఁడై మెల్లన డించి తపనవంశజులకుఁ దపనసుతాది కపిముఖ్యులకును 1489నొక్కటఁబ్రయోగింప ధీయుక్తి నట మూర్ఛదెలిసిరి వారు నా యౌషధముల మహత్త్వంబు వలన. ననిలోనఁదునుకలైనట్టి దేహములు ఘనమైన సంధాన కరణిచేఁగదిసె. శరపుంజ మురుశస్త్రచయము విశల్య కరణిచే నపుడూడి 1490గంటులు పూడె. సౌవర్ణకరణిచే సకలాంగకములు సౌవర్ణకాంతి నుజ్జ్వలములై మించెఁ. గలయంగ సంజీవకరణిచేఁబ్రాణ ములు వచ్చి చెలఁగుచు మునుపటికంటెఁ గడు నొప్పి రెంతయుఁగపివీరులెల్లఁ గడఁకతో నిద్ర మేల్కనిన చందమున. నప్పుడు కపివీరు లనిలనందనుని నొప్పార నగ్గించి రుత్సాహ మొదవ. ననిమొనఁ జచ్చినయసురులఁగపులు వనధి నంతకుమున్నె వైచుటఁజేసి కదనంబులోని రాక్షసుఁడొక్కఁడైన బ్రదుకుట1491లేదయ్యెఁబరమౌషధముల. నంత సుగ్రీవాదులైనవానరులు సంతసంబున సూర్యచంద్రులభంగిఁ గరమొప్పురామలక్ష్మణులకు మ్రొక్కి యరుదార నుతియించి రనిలనందనుని. నుప్పొంగి యాంజనేయుండును భక్తి నప్పుడు మ్రొక్కిన నాదరించుచును నినకులాధీశ్వరుఁ డిట్లని పలికె: “మనకు వాసవునాజ్ఞ మన్నింపవలయు; నీ యోషధీశైల మెప్పటిచోట వాయుతనూభవ! వైచి ర.”మ్మనుడు మారుతాత్మజుఁడసమానవేగమున నా రాఘవుఁడు మెచ్చ నగ్గిరీంద్రంబు నెనయ నెప్పటిచోట నిరవొంద నునిచి చనుదెంచె రయమున సంగరస్థలికి. నంత సూర్యోదయంబయ్యె; రాఘవుని చింతతోడనెకూడఁజీకటివాసె. నప్పుడు సుగ్రీవుఁడా రామచంద్రు నొప్పారఁగనుఁగొని యుల్లాస1492మెసగ:[వా.రా. సర్గ 75] “వసుధేశ! పొలిసె రావణుబలంబెల్ల నసమసాహస బలాహవకేళి వాలి. గుదులు గ్రుచ్చినక్రియఁ గుంభకర్ణుండు మొదలగు రాక్షసముఖ్యులు1493వడిరి. యదిగాన తన1494సత్త్వమంతయుఁదఱిగెఁ; ద్రిదశారి కయ్యంబు తెఱఁగొల్లఁడింక. లంకఁగాల్పంగ గోలాంగూల బలముఁ బంకజ హితవంశ! పనుపు మీ రాత్రి.” |