ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
లక్ష్మణేంద్రజిత్తుల పరస్పరాధిక్షేపణము
“మాయలపని యేమి? మగవాఁడవైన
నా యెదుటికి వచ్చి ననుఁజూతుగాక!
నిక్కంపులావున నీవు కయ్యమునఁ
జక్క నిల్వుము; నిన్ను జముఁ1724గూడఁబుత్తుఁ
గపటంబుఁగైకొన్నఁగైకొనకున్నఁ
గపటరాక్షస! నిన్నుఁగడతేర్తు1725వేగ.”
మనవుడు లక్ష్మణు నా యింద్రజిత్తు
గనుఁగొని రోషసంకలితుఁడై పలికె:
“బాలుండవై యిట్టిపంతంబు లేల?
యీ లీల నిలువు మీ వించుకదడవు?
లక్ష్మణ! నిన్ను నాలంబున వీర
లక్ష్మికిఁబెడఁబాపి లా వెడలించి
యసువులు నాదు బాణావలిఁబెఱికి
వసుమతిపైఁగూల్చి వారక వ్రచ్చి
కాకుల గ్రద్దలఁగండలఁదనిపి
భీకరాకారతఁబెంపారువాఁడ.
నుఱక నా కట్టినయురగపాశములు
మఱచితే1726లక్ష్మణ! మది 1727నింతలోన.”
నని లక్ష్మణునిఁబల్కి యవ్విభీషణునిఁ
గనుఁగొని యింద్రారి కడు నల్కఁబలికెఁ:
“బినతండ్రివట నీవు; ప్రియమార నేను
దనయుండ; నా కెగ్గు తలఁపంగ నగునె?
దుర్మతివై కులద్రోహంబు సేయు
ధర్మఘాతుక! నీకుఁదగవేల కలుగు?
నెడరైన బంధుల నెట్టినీచుండు
విడిచి శత్రులఁబోయి వేఁడునే శరణు?
తగవు దప్పిననైనఁ దన వారిఁబాసి
పగవారి1728సేవించి బ్రదుకు టే బ్రదుకు?
ఆ నిశాచరనాథుఁ డధిక తేజుండు
నీ నిష్ఠురోక్తులు నీతిగాఁగొనునె?
యన్న కోపించిన నట యింటిమూల
నున్న నేమగు నుండకున్న నేమగును?
నీ లావుబలిమినే నిఖిల1729దేవతల
నాలంబులో గెల్చె నా దశాననుఁడు!
హితుఁ1730డవై మర్మ మహితునకుఁజెప్పి
యతనిచేతనె చెడు.”మన విభీషణుఁడు:
“నా వర్తనము మేఘనాద! నీ వెఱుఁగు;
దీ వృథాజల్పంబు లేల యాడెదవు?
ఆ తండ్రికొడుకైన యవినీతిమతికి
నీతియు ధర్మంబు నీ కేల కలుగుఁ?
బొసఁగఁజేపట్టిన భుజగంబు భంగి
వెసఁగ్రూరుఁడగు బంధు విడువంగవలయుఁ
బాపాత్ముఁడగు నట్టి పంక్తికంధరుఁడు
నా పలుకులు విన్న నాఁడింతలగునె?
పరధనంబులకును బరకాంతలకును
బరితాపమునఁబొందు పాపకర్ములకుఁ
దగవేల? మే లేల? ధర్మంబు లేల?
జగదేక హితమైన చరితంబు లేల?
మగ్నమౌ నీ మదిమదము గర్వంబు
నగ్నులై కాల్పక యదియేల పోవుఁ?
దలకొని యెప్పు డధర్మవర్తనమె
కలిగి వర్తింతురు కడుఁ1731గ్రొవ్వి మీరు.
సురల బాధింతురు; సువ్రతులైన
పరమమునీంద్రులఁబట్టి చంపుదురు.
కావున, నా దశకంఠునితోడ
నీవును లంకయు నిఖిలబంధువులు
మాన కిచ్చకమాడు మంత్రులుఁగూడి
సేనలు రాముచేఁజెడుట సిద్ధంబు.
బుద్ధిశూన్యుండ1732వైతి; స్ఫుటకాలపాశ
బద్ధుండ; వేమైనఁబల్కినఁబల్కు;
మిటమీఁద నీ మాయ లెక్కవు; 1733నీకు
వటముక్రిందికి హోమవాంఛఁబోరాదు;
చనరాదు లంకకు సౌమిత్రిఁదొడరి;
చనవచ్చు నిఁక వేగ జముపురి.”కనఁగఁ
బ్రథమాద్రిపై1734వచ్చు భానునిపగిదిఁ
బృథుగాత్రు హనుమంతుఁబెంపార నెక్కి[వా.రా. సర్గ 88]
యమరినలక్ష్మణు నా విభీషణుని
సమరార్థులగు నగచరుల వీక్షించి
యా రావణాత్మజుండప్పు డిట్లనియె
వారక రోషదుర్వారుఁడై పేర్చి:
“వీరులై నా బాణవృష్టికి మీరు
సైరించెదరుగాక సమరోర్వి నేఁడు.
ఉడుగక నా వింట నొదవుబాణాగ్ని
యడరి మిమ్మందఱ నాహుతి గొనును.

  1. ↑జూడఁ
  2. ↑నేఁడు- అ
  3. ↑నేఁడు నీ మనమున నదియు
  4. ↑లోన నిపుడె-య
  5. ↑తోఁగూడి… కీర్తి
  6. ↑లోకముల
  7. ↑డయి… తుకెఱిఁగించి … చెడునన
  8. ↑బొట్టక్రొవ్వి
  9. ↑వతి
  10. ↑వినుము
  11. ↑నొప్పు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )