ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రామున కగస్త్యుఁ డాదిత్యహృదయ ముపదేశించుట
నలి నప్పు డేచి మైనాకంబుపోలెఁ
దలఁగక యందంద దశకంఠుఁడేయు
శరవేగగతిఁ జూచి జనలోకనాథుఁ
డరుదంది చింతింప నట యగస్త్యుండు[వా.రా. సర్గ 107]
చనుదెంచి యా రామచంద్రు నీక్షించి:
“విను మహాభుజబలవీర! యో రామ!
వితతంబుగా నాజి విజయంబు సేయు
నతి గోప్యమగుచున్న యట్టి మంత్రంబు
నెలమితో నాదిత్యహృదయంబు హృదయ
మలర ననుష్ఠింపు మవనీశచంద్ర!
యిమ్మహాజపమున నిప్పుడే నీవు
సమ్మదం బడరంగ శత్రు గెల్చెదవు.
ఇది2265యాయు వొనరించు; నిది దుఃఖమణఁచు;
నిది సర్వమంగళహేతుభూతంబు.
వెలయ సురాసుర2266 వినుతుఁడై పొలుచు
జలజాప్తుఁ బూజింపఁ జను నీకు నధిప!
యీ లోకలోచనుం డెల్లలోకములఁ
జాలరశ్ములు నిండఁజరియించుచుండు.
బ్రహ్మయు విష్ణుండు ఫాలలోచనుఁడు
బ్రహ్మకల్పాదిని భానుఁడైనాఁడు.
మది సర్వదేవతామయునిఁగా నెఱిఁగి
కదనంబునందు నీ కమలబాంధవుని
నెవ్వఁడు కీర్తించు నింపుసొంపార
నవ్వీరునకుఁగల్గు నాహవ విజయ.”
మనుచు నమ్మునివరుం డాశ్రమంబునకుఁ
జనుటయు నా సౌరజప మాచరించి
యప్పు డత్యున్నతుఁడై రాఘవేంద్రుఁ
డుప్పొంగి రావణోద్యోగంబు సూచి
2267ఘోరావలోకనాగ్నులు మండుచుండ
భూరి2268ధూమ్రాయతభ్రుకుటి నిక్కించి
పెరిగి రావణురథాభీల ఘోటముల
నురుతరాస్త్రంబుల నుఱక నొప్పించి
వరశరత్రయము రావణు లలాటమున
సరిగ్రుచ్చి యురురక్తసంసిక్తుఁజేసె.
నప్పుడు రక్తసిక్తాంగుఁడై చూడ
నొప్పె లంకేశ్వరుం డొగి రామచంద్ర
శర వసంతాగమసమయ సంఫుల్ల
తరుణారుణాశోక తరువు చందమునఁ.
గుపితుఁడై యంత రక్షోభర్త రాము
విపులవృక్షం బేసె వేయిబాణముల.[వా.రా. సర్గ 105]
‘నధమప్రయుక్తంబులై సురద్రో2269హ
విధి కోసరింపక విషశక్తి మెఱసి
నిర్మలగుణయుక్తి నెఱిఁ బెడఁబాసి
ధర్మంబు విడిచి యుద్ధతశక్తి నిగుడి
చనుదెంచి రాఘవేశ్వరుని నొప్పించి2270
చన నధోగతిగాక సద్గతి గలదె!’
యనిన చందంబున నద్దశానను2271ని
ఘనబాణ2272ములు వచ్చి కాకుత్స్థుఁగాఁడి
జగదద్భుతంబుగాఁజని భూమిదూరి
తగులక నిగుడి పాతాళంబు సొచ్చె.
నురుశరక్షతముల నుఱక పెల్లుబ్బి
తొరుగునెత్తుటఁదొప్పఁదోఁగి రాఘవుఁడుఁ
బ్రళయకాలాభీల పావకజ్వాల
లలవుమై నిట్లుండు నన నిండ మండి
మండు చిచ్చఱకంటిమంటలు మింట
నొండొండపర్వుకాలోగ్రుఁడో యనఁగఁ
జండతేజమునఁబ్రచండమార్తాండ
మండలకిరణసమానాసమాన
మానితశరపంరపరలోలిఁ బఱ2273పి
మానగర్వముఁదొంటిమదమును2274నుడిపి
యని సేయఁ గాలుసేయాడక యుండఁ
దనువెల్ల జర్జరితంబుగాఁ జే2275సి
పర్వెడురఘురాముబాణవేగమున
నిర్విణ్ణుఁడై యుండె నిల్చి రావణుఁడు.
దశరథసుతుఁడు ప్రతాపభాస్కరుఁడు
దశకంఠుఁజూచి యుదగ్రుఁడై పలికె:

  1. ↑జయం బొనరించు
  2. ↑వినతుఁ
  3. ↑ఘోరకోపాగ్నులొల్కుచుఁగన్నులదర
  4. ↑ధూమముఁబోలె (లన)బొమలు
  5. ↑హి
  6. ↑పఁ-జన
  7. ↑ఁడు
  8. ↑తతు లేయఁగా
  9. ↑ప
  10. ↑నుడుగ-న
  11. ↑యఁ-బ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )