ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రాముఁడు రావణు కరచరణముల ఖండించుట
నత్యుగ్రనిగ్రహవ్యగ్రులై కదిసి
రత్యంతకాలకాలాకృతి నప్పు.
డలవు2316 ధైర్యంబును నలుక దీపింపఁ
బ్రళయ కాలమునాఁటి ఫాలాక్షుపగిది
ఘనశాత2317కర్తరీక్రకచభల్లంబు
నినవంశవల్లభుం డెసగ సంధించి
‘యరుదరు!’ దనఁద్రుంచె నద్దశాననుని
శిరములు పదియును జేతు లిర్వదియుఁ.
‘ద్రుం2318చుట బొంకొకో, త్రుంచితి!’ననుచుఁ
ద్రుంచిన రాముఁడద్భుతమంది చూడఁ
గరవాల ముసల ముద్గర భిండిపాల
శరచాప కేయూరచయములఁదనరు
కరము లిర్వదియును ఘనకిరీటముల
శిరములు పదియును జెచ్చెర మొలచె.
మొలచినఁగోపించి మొగిఁద్రుంచె మఱియుఁ
దలలుఁజేతులుఁబేర్చి దశరథాత్మజుఁడు.
తల లుద్దవిడిఁద్రుంచుతఱిఁగ్రింద మొలచుఁ
దలలకిరీటముల్‌ తద్బాణతతులఁ
దాఁకి మ్రోయుట చెవిఁదాఁకకమున్న
తాఁకునత్తలల నుదగ్రహాసములు.
తరమిడి త్రెవ్వినతల లోలి మొలవఁ
బరమేష్ఠిచేఁదొల్లి పడయుచో వరము
గళశరంబులఁదలల్‌ గనుకని మొలవ
బలియుఁడై యీతఁడు పడసెనో యనఁగఁ
దలలోలి మొలతేరఁదడవఁగుత్తుకల
నలిఁగాఁడి రాముబాణము లుండె నోలి.
మొగిఁద్రెంచుతలలు, నమ్ములతోన మీఁది
కెగయఁద్రోచుచు దివి కెగయునత్తలలు,
దొంతులకుత్తుకల్‌ దునుము నస్త్రములు
నెంతయు రమ్యమై యెసగెఁజూపఱకు
ఫలితసౌరభరామబాణోత్పలములఁ
గలయ రావణశిరఃకమలసంతతులు
రమణమై రక్తధారా సూత్రతతులఁ
గ్రమమొప్ప నెత్తులు గట్టివేల్పులకుఁ
బొలుపొంద నాకాశపుష్పలావకుఁడు
సొలవక పలుమాఱుఁజూపు చందమున.
దనుజాధిపతి గొంత తడవు చూడ్కులకు
నినకులాధీశ్వరుండేయుచో మఱియుఁ
ద్రెవ్వి2319రాలెడు నెడత్రెవ్వని తలలు
గ్రువ్వనిపేరులై కొమరొప్ప నప్పు
డనిమిషావలియెల్ల నచ్చెరువంది
కనుఁగొన నద్దశకంధరుం డమరె
లలి శిరోమాలికాలంకృతుండైన
ప్రళయావసర ఘోరభైరవుపగిది.
నా వేళ రఘురాముఁడాగ్రహవ్యగ్ర
భావుఁడై రణబలప్రౌఢి దీపింప
లక్షించి దృఢముష్టిలాఘవగతుల
దక్షుఁడై రావణుతలలు బాహువులుఁ
ద్రెంచుఁగ్రమ్మఱ మొలతెంచు వెండియును
ద్రెంచుఁగ్రమ్మఱ మొలతెంచు; నిబ్భంగిఁ
గరములు శిరములుఁగాకుత్స్థతిలకు
శరపరంపరలచేఁ జటులవేగమునఁ
దెగుటలు మొలచుటల్‌ దెలియరాకుండె
నగచరావలికి నయ్యనిమిషావలికి.
నా లోన రఘురామునమ్ములఁ2320ద్రెవ్వి
రాలుచునున్న యా రావణుతలలు
ఆవులింపవు; నొవ్వ; వలసముల్‌ గావు;
లావు దూలవు; నిజోల్లాసముల్‌ సెడవు;
గాజువారవు; మిడుకవు; రెప్పవేయ;
వోజ దప్పవు; వైర ముడుగవెంతయును.
బగయొండె బొమముడిపాటొండె నిండు
నగవొండె నార్పొండె నలువుచూపొండెఁ
బలుకొండె మెచ్చొండెఁబైపఁడి పోరు
నలవొండె ధృతియొండె హంకృతియొండెఁ
గలుగని తలలేదు ఘనరణభూమి
తలమునఁబడియున్నతలలలో నెందు.
నే నగ వే గర్వ మే రోషదృష్టి
యా నగ వా గర్వ మా రోషదృష్టి
మొలతెంచు తలలందు మొగి నుర్విఁగూలు
తలలందు సమములై తలకొనుచుండ
దానవాధీశ్వరుతలలు బాహువులు
భూనభోంతరము లద్భుతముగా నిండె.
నిండుట గనుఁగొని నిండఁగోపించి
వెండియు నా రామవిభుఁడేయుచుండెఁ.
ద్రెంచిన కరములుఁ ద్రెవ్వినతలలుఁ
ద్రుంచినకరములుఁదునిఁగిన తలలు
బలువిడి పుట్టిన బాహుదండముల
నలమి యప్పుడు వట్టి యద్దశాననుఁడు
గణుతింప రాని వేగము లావు మెఱసి
రణరోషదృష్టిమై రాముపై వైచె.
నఱిముఱి దశకంఠుఁడందందవైవఁ
బఱతెంచి శిరములు బాహుదండములుఁ
గువలయహితవృత్తి కుశలుఁడై కళల
నవిరళాకృతి జగదానందుఁడగుచుఁ
గమనీయవానరగ్రహమధ్యవీథి
రమణమై నొప్పెడు రఘురామచంద్రుఁ
గని చంద్రుఁడను బుద్ధిఁగమలషండములు
ఘనరాహుకోటులఁగడఁకతోఁగూడి
యడరి యన్యోన్యసహాయముల్‌ వడసి
వడిఁబేర్చి తాఁకుకైవడిఁదాఁకుచుండె.
శిరములుఁ గరములుఁ జెలఁగి యేతెంచు
వరుసలుచూడంగ వర్ణింప నొప్పె
శ్రీరామవిజయలక్ష్మీవివాహమున
కారణదేవత లర్థి శోభిల్లఁ
బల్లవరత్నదర్పణతోరణములు
తెల్లమై కట్టిన తెఱఁగు దీపింపఁ.
దరిగెడు తలలు నుద్దామబాహువులుఁ
గురిసెడు శరములు ఘూక కాకాది
ఖగములు జగము లాకంపింపఁబేర్చి
గగనమండలమెల్లఁ గలఁగొన నిండె
గురుతరంబై జముకొల్వుకూటమునఁ
గరముగ్రమగు మేలుకట్లనఁబరగి.
యిది దివ; మిది రాత్రి; యిది సంధ్యయను2321ట
త్రిదశులకైనను దెలియరాకుండెఁ.
2322బ్రథితబాణాసనబాణదీప్తులను
2323బ్రథనంబులోఁబట్టపగలయి తోచె.
నప్పుడు రఘురాముఁడా దైత్యుగెలుచు
చొప్పింతయైనను జొప్పడకునికిఁ
గనుఁగొని శరసంధిగతులు సాలించి
తనలోనఁబలుమాఱుఁదలపోయఁదొడఁగెఁ:
“దెరలక శిరములు ద్రెంచి వేసరితి;
దొరకొని కరములు ద్రుంచి వేసరితి;
నెసగుమర్మంబుల నేసి వేసరితి;
విసువక పలుమాఱు వ్రేసి వేసరితి;
నెబ్భంగిఁ దెగటారఁడీ 2324దుష్టచిత్తుఁ;
డెబ్భంగిఁదెగటార్తు నిద్దురాత్మకుని?”
నని యని తలపోసి యలయుట సూచి
జననాథుతో విభీషణుఁడిట్టులనియె:
“వనజాతజాతునివరమునఁజేసి
యినకులాధీశ్వర! యీతని నాభి
నమృత మున్నది కుండలాకృతి గలిగి
యమృతత్వ2325మూలమై యది చంపనీదు.
దానవుతలలు నుద్దండబాహువులు
మానక నీ వెన్నిమాఱు లేసినను
మొలతెంచుచుండు 2326నున్మూలముల్‌ గావు.
తలఁకఁడు దీన నద్దనుజవల్లభుఁడు.
తఱిమి యిమ్మెయి నీవు తలలు బాహువులు
నఱుకుచున్నాఁడవు నరనాథ! కడఁగి.
తుదయేది దీనికి?2327దొరకొని నీవు
చదురొప్ప నాగ్నేయశర మేయుమింక.
నా నాభి2328వివరమూలామృతం2329బిగురు.
దానవపతి దాను దాన లోఁదారు.
నిగిడెడు భవదీయనిష్ఠురాస్త్రములఁ
దెగి మఱి చేతులుఁద్రిదశారితలలు
దురములోపల నూటతొమ్మిదిమాఱు
లరుదుగా మొలతెంచు నంతట పొలియు.”

  1. ↑మైఁగైకొని (గొనితన) యలుక
  2. ↑కర్కశ
  3. ↑చిన బొంకుగాఁద్రుంచి
  4. ↑రాలుచు
  5. ↑ద్రెస్సి
  6. ↑చుఁ-ద్రి
  7. ↑బ్రదర… బహుళ
  8. ↑గదనంబుపట్టపగల్‌ గాఁగఁదోచె
  9. ↑దుర్ణయుండు-నె
  10. ↑మూలంబుగా నదిచావ
  11. ↑నిర్మూ
  12. ↑దొసఁగేది, దొసఁగెద్ది
  13. ↑మూల
  14. ↑బింకు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )