| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
పనవ మందోదరి పతిమీఁదవ్రాలి 2371తనరిన శోకాబ్ధిఁదరియింపలేక[వా.రా. సర్గ 114] కలసి బాష్పంబులు కన్నులఁదొరుగఁ బలుమాఱు నెలుఁగెత్తి పలవింపఁదొడఁగె; “హా రాక్షసేశ్వర! హా వీరవర్య! హా రణాలంకార! హా నాథ!” యనుచు నలఁతయు బలువగలడలు దీపింపఁ బలుమాఱుఁబలవించి పతిఁజూచి పలికె: “లంకేశ! నేఁడు నీ లంకలోపలికి శంకింప కినరశ్మిజాలముల్ సొచ్చె. ‘నెడరయ్యె నిపు.’ డని యింద్రాదిసురలు నుడువీథిఁజెలరేగి యుబ్బుచున్నారు. అమరాధిపతి గెల్చి యనలుని గెల్చి 2372శమనుని గెల్చి రాక్షసరాజు గెల్చి పాశహస్తుని గెల్చి పవమాను గెల్చి యీశానసఖు గెల్చి యీశాను గెల్చి నీ లావు లావుగా నిఖిలలోకముల వాలుదు; వెందు దుర్వారుండ వీవు. నీ కిట్టిదుర్దశ నేఁడేలకలిగె? నీకంటె బలియురు నేర్చిరే కలుగ? “ధారుణీసుత నిమ్ము; తగదు;రాఘవుఁడు నారాయణుఁడుగాని నరుఁడుగాఁడాతఁ,” డని నీకుఁజెప్పి2373తి; నకట! నా పలుకు వినవైతి; 2374నీ విధి విన నేలయిచ్చుఁ! దప మాచరించుచు దశకంఠ! తొల్లి విపులైకనిష్ఠతో విదితంబుగాఁగ నీ వింద్రియంబుల నెఱి నిగ్రహించి; తా వైరమున నిప్పు2375 డా యింద్రియములు జనకజఁదెప్పించి సమరంబు లోన నినవంశుచే నిన్ను నిట్లు చంపించె. సురలకు నెబ్భంగిఁజొరరాని లంక నురువడి హనుమంతుఁడొక్కఁడే సొచ్చెఁ. గలఁగక జలరాశిఁగట్ట వానరుల కలవియే; సురలు వీరంటి నే నపుడ. తరమిడి యా జనస్థానంబునందు ఖరదూషణాది రాక్షసులఁబెక్కండ్ర బలు2376విడి యొక్కఁడే పటుబాహుశక్తి నలిరేఁగి చంపిననాఁటనుండియును దలఁకుదు రామునిఁదలఁచి నిన్‌జూచి; తలఁకుటలెల్లను దలకూడె నేఁడు. ధర్మతత్పర యరుంధతికంటె, నిత్య నిర్మలమతి రోహిణీదేవికంటె, భూరిగుణోజ్జ్వల భూదేవికంటె, సైరణగలపుణ్యసాధ్వి జానకినిఁ దెగి తెచ్చినప్పు2377డే దేవికోపాగ్నిఁ బొగిలినాఁడవుకదే భువనంబు లెఱుఁగఁ. గైకొని యెవ్వఁడే కర్మంబు సేయు నా కర్మఫలము వాఁడందకపోవఁ. డతినీతిపరుఁడైన యా విభీషణున కతుల2378సౌఖ్యము గల్గె ననఘాత్ముఁడగుట; నేపున లోకంబు లెల్లఁగారించు పాపికి దురవస్థ పాటిల్లె నీకుఁ. గలరు సీతాదేవికంటె సౌభాగ్య కలితలు పెక్కండ్రు కామినీమణులు; కామాంధకారంబు కన్నులఁగప్పి నీ మదిఁదెలియంగ నేర2379వుగాక! కులరూపదాక్షిణ్యగుణకళాకేళిఁ దలఁపవైదేహి నా తరముగా దెందు. నాకంటె నెక్కుడొ, నాతోడ సరియొ, నీ కానమికిఁజెప్ప నేరఁగా కేను. మృత్యు వొక్కొక్కనిమిత్తంబువలన సత్యంబు గలుగుట సకలజీవులకు. నెడరైన మృత్యువు నిట సేరఁదెచ్చు వడువునఁదెచ్చి తా వైదేహి నీవు. భాగ్యంబుగల సీత పతితోడఁగూడి యోగ్యమౌ సుఖలీల నొంది పెంపొందె. నాథ! భాగ్యములేని ననుఁజూడు దుఃఖ పాథోథిలోపలఁబడి మునింగెదను. బొలుపార నీతోడఁ బుష్పకంబెక్కి లలితంబులైన లీలావిహారములు సలిపితి మందరశైలంబునందుఁ గల ధౌతగిరియందుఁ గనకాద్రియందు నాతత నందనోద్యానంబునందుఁ బ్రీతిమై మఱియును బెక్కు దేశముల. నక్కటా! యా లీల లన్నియు నన్నుఁ ద్రెక్కొన్నవిధి కడతేర్చెనే నేఁడు? ‘మయుఁడు నా తండ్రి; నా మగఁడు రావణుఁడు ప్రియపుత్త్రుఁడాహవప్రియుఁడింద్రజిత్తు డని గర్వమున నుంటి ననిలోన రామ జననాథుచే నీవు సచ్చు టే నెఱుఁగఁ. బిడు గడిచినఁగూలుపృథ్వీధరంబు వడువునఁజూర్ణమై వసుధపైఁబడితి. మృత్యువునకు నీవె మృత్యువైయుండి మృత్యువుపాలైతె మేదినిఁగూలి! వైరులసతులకు వైధవ్య మి2380త్తు; నీ రామలకుఁగల్గె నేఁ డా ఫలంబు.” అని 2381యేడ్చుఁ, బలవించు, నసురేశుమోముఁ గనుఁగొని వర్ణించుఁ, గన్నీరు నించుఁ, దొడలపైఁదలయిడుఁ, దొరుగుకన్నీటఁ గడుగు నా ననధూళిఁ,గడుఁజిన్నఁబోవు; 2382గీలించి కేలు కెంగేలిలోఁదార్చు, వాలుడెందము గంద వగచు; నాత్మేశు తలయెత్తి డా కేల ధరియించి చూచుఁ దలయూఁచు, వలచేయి ధరణి2383ఁబొరల్చుఁ “బోయెఁబొ.”మ్మను,“రామభూపాలుఁడింత సేయునే? నే నేమిసేయుదు నింక?” నని యలమటఁబొందు; నవని2384పైఁబొరలుఁ; దన దిక్కులేమికిఁ దద్దయు వగచుఁ; దుదిలేని శోకాగ్నిఁదొడరి యిబ్భంగి వదలక కాలెడు వదినెను జూచి యడుగులపైఁబడి యంతలో నప్పు డడ లిన్మడింపంగ ననె విభీషణుఁడు: “వడితోడఁ బేర్చు రావణపయోరాశి పడఁతుక! రఘురాముబాణాగ్ని నిగిరెఁ; బరతెంచి రాఘవప్రళయమారుతము సరసరావణపారిజాతంబుఁగూల్చె; బలువిడి రాఘవభయదదావాగ్ని నలి దశాననకాననము నీఱుసేసెఁ; బడఁతుక! రాఘవాపరపయోరాశిఁ గడఁగి రావణదివాకరుఁడస్తమించె; ఖరతరామోఘ రాఘవ నీలమేఘ శరవృష్టి రావణసప్తార్చి నార్చె.” |