ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రాముఁడు విభీషణునిచే రావణునకుఁ బ్రేతకృత్యములు చేయించుట
నని పెక్కుభంగుల నడలుచునున్న
ఘను విభీషణుఁజూచి కాకుత్స్థుఁడనియె:
“నీ వనితల యేడ్పులింక వారింపు;
మీవును శోకింప నిటమీఁద నుడుగు;
2385పరిగొని శూరులు బవరంబులోనఁ
2386బరులచేఁజత్తురు; పరులఁజంపుదురు;
జయ మిద్దఱకు లేదు సమరంబులోన;
జయపరాజయము లస్ఖలితముల్‌ గావు;
సకలసుపర్వుల సాధించె నితఁడు;
సకలదిక్పాలుర సాధించె నితఁడు;
ఏకాంగవీరుఁ; డహీనసాహసుఁడు;
లోకైక2387జితుఁడు; త్రిలోకభీకరుఁడు;
మీ యన్న రణమున మిక్కిలికడిమి
చేయుటఁదెలియఁజూచితిఁగాదె2388యేను?
నీ చందమున నిల్చి యెవ్వండు పోరు?
నీ చందమునఁదుది నెవ్వండు చచ్చు?
నీ లావు నీ చావు నెవ్వరువడయఁ
జాలుదు? రక్కటా! జయ మేమి సేయు?
ననఘ! మీ యన్న కృతార్థుండు; వగవఁ
బనిలేదు; ధైర్యంబు పాటించి నీవు
కడఁకతో నగ్ని సంస్కారాదివిధులు
తడయక చేయు మీ దనుజాధిపతికి.”
ననవుడు భీతుఁడై యా విభీషణుఁడు
ఘనభక్తియుక్తిమైఁ గరములు మొగిచి:
“యెక్కడి సంస్కార!2389మీతఁడు నాకు
నెక్కడి తోఁబుట్టు! వితఁడు నా పగఱ;
నీ దేవిఁ దెచ్చిననీచుండు, కష్టుఁ;
డీ దుష్టచిత్తున కెక్కడి విధులు?
పరవధూజనుల సంస్పర్శంబు సేయు
పురుషు లధోగతిఁ బొంది కూలుదురు.
అట్టివారల ముట్ట నర్హంబు గాదు;
గట్టిగాఁగనుఁగొనఁగా; దటుగాన,
యీ పాపకర్ముని2390నే ముట్టుటకును
నోప; వైదికవిధి కుచితుండు గాఁడు.”
అనుటయు నమ్మాట లంతరంగమునఁ
జొనిపి విభీషణుఁజూచి రాఘవుఁడు
“అనఘ! నీ చెప్పిన 2391దంతయు నిజము.
దనుజాధిపతి నింకఁదగదు దూషింపఁ;
గడఁకతో సమరగంగాప్రవాహమునఁ
గడిగికొన్నాఁడొగిఁ గల కల్మషముల;
నచ్చుగా నా పనులన్నియు నయ్యెఁ.
జచ్చిన పిమ్మట చనదు వైరంబు.
పరువడి నతనికిఁ బరలోకవిధులు
కరమర్థిఁజేయుము కడఁకతో నీవు.”
అనవుడు ‘నౌఁగాక!’యని విభీషణుఁడు
తన బుద్ధి వైదికధర్మంబుఁబూని
యచటికి నగ్నిత్రయంబుఁదెప్పించి
యచలమానసుఁడయి యగ్రజన్మునకుఁ
గరమొప్ప నగ్ని సంస్కారాదులైన
పరలోకవిధులెల్ల భక్తితోఁజేసి,
చనుదెంచి యా రామచంద్రునంఘ్రులకు
వినతుఁడై యున్న నవ్విమలాత్ముఁజూచి
ప్రియభాషణంబులఁబెద్ద మన్నించి
దయ పెంపుమీఱ నాతని నూఱడించి
ధరణీశుఁడప్పుడు తమ్మునిఁజూచి
నిరుపమకారుణ్యనిరతుఁడై పలికె:

  1. ↑పగ
  2. ↑బగఱచే… పగఱ
  3. ↑జయుఁడు
  4. ↑నీవు
  5. ↑మెక్కడి క్రియలు
  6. ↑నేను ముట్టుటకు
  7. ↑యంతకుఁగలఁడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )