ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
సీతా పరిగ్రహణము
“వనిత సెమర్పదు; వాడదు మోము;
తనువల్లి గందదు; తలఁక దింతయును.
బొలఁతి ధరించిన పుష్పమాలికలు
నలుఁగవు;2438తెరలదు నాతి మైపూఁత.”
యనుచు దైత్యులు కపు లందంద2439నిక్కి
కనుఁగొంచు నడలుచుఁగళదశ్రులగుచు
“జగతీశుఁడీ పుణ్యసతి నింతపలుకఁ
దగ”దంచు:“నీ తెంపుదగ.”దంచునుండఁ
గోమలిఁదగ నెత్తికొని వచ్చి ప్రీతి
రాముసన్నిధి నిల్పి రాముతో ననియె:
“నీవె దైవంబును; నీవె ప్రాణంబు;
నీవె చుట్టంబును; నీవె సర్వంబుఁ
గానుండు; నొండొకగతిఁజిత్తవృత్తిఁ
గాన దీ కల్యాణి; కడుముద్దరాలు;
రావణుపనుపున రాక్షసస్త్రీలు
వేవురు వేవేలవిధముల వచ్చి
తఱిమి నొప్పింతురు; దారుణక్రియల
వెఱపింతు; రలఁతురు;వెడ్డ వెట్టుదురు;
ఇన్నియుఁజేయంగ నెంతయు సాధ్వి
తన్నింత మఱవదు; తలఁక దెంతయును;
నీ యందె చిత్తంబు నిలిపి సర్వంబు
నీ యధీనము సేసి నిల్చె నీ యింతి.
కైకొమ్ము నెమ్మి నీ కమలాక్షి నింకఁ;
గైకొనకుండుట గాదు ధర్మంబు.”
అని పావకుఁడు వల్క నా రామవిభుఁడు
తన మది2440నొక్కింత దడవు చింతించి
యాది దేవుండు బ్రహ్మాదులు వినఁగ
నా దేవసభలోన నప్పుడిట్లనియె:
“నీ యింతిదెసఁ బాప మింతయు లేదు;
నా యెడఁదప్ప దున్నత చిత్తురాలు;
వెఱపును భక్తియు విమలశీలంబు
నెఱుకయు ధైర్యంబు నీ యింతియందుఁ
గల! దెఱుంగుదు; నటుగాక దైత్యునకు
మెలఁతుకఁగదియరామియునెఱుంగుదును.
“అధిగతబహుదోషుఁడగు దశగ్రీవుఁ
డధికబలోన్మత్తుఁడై కొనిపోయి
తనవినో 2441దారామతరుమధ్యసీమ
నునిచినజానకి నూరక తెచ్చె
నిలమీఁద రఘురాముఁ;2442డిట్టికాముకుఁడు
గలఁడె?దుష్కీర్తికిఁగలఁగఁడేమియును”?
నని లోకమునఁబుట్టు నపవాదమునకు
జనకజ నిబ్భంగి శాసింపవలసెఁ.
గలశంకలన్నియుఁగడతేఱె; నింక
మెలఁతుకఁగైకొంటి; మీ మాట వింటి”.
నని సమీపంబున నా దేవి నుండఁ
బనిచి రాఘవుఁడు చూపఱు సూడ నొప్పె
దివినుండి రోహిణీదేవియుఁదాను
నవిరళప్రభనొప్పు నమృతాంశుపగిది.
నప్పుడు సకలలోకారాధ్యచరణుఁ
డొప్పుమహోల్లాస ముల్లంబు నిండ[వా.రా. సర్గ 122]
శ్రీమహాదేవుఁడాశ్రితకల్పతరువు
రాముఁగనుంగొని రాగిల్లి పలికె:
“నెవ్వఁడుద్యోగించు నింతటిపనికి?
నెవ్వఁడు సాధించు నీ జగద్ధితము?
లోకకంటకుఁడుఁ ద్రిలోకభీకరుఁడు
నాకాదిలోక ప్రణామసాధకుఁడు
రావణుఁడఖిలవిద్రావణబలుఁడు;
రావణు మర్దింపరా దెవ్వరికిని?
వీనితోఁబగగొని వీనిపై విడిసి
వీని నివ్విధిఁజంపి వీనిఁగాల్పించి
బలవిక్రమక్రమప్రౌఢిమ మెఱయఁ
గలరె లోకమున నెక్కడనైన మగలు?
ఆ రావణునిఁజంపి తనఘ! నీ వలన
నీ రేడు జగములు నిటమీఁద బ్రదికె.
మీ తండ్రి దశరథమేదినీ నాథుఁ
డేతెంచె దివినుండి యీ యొప్పు సూడ.
నదె విమానారూఢుఁడై యున్నవాఁడు
త్రిదశగణాధీశదీప్తుఁడై వాఁడె.
యా జగద్ధితకృత్యుఁడగు సత్యనిధికిఁ
బూజానమస్కారములు సేయఁబొమ్ము.”

  1. ↑తొలఁగదు
  2. ↑నిలిచి
  3. ↑నెంతయుఁదలపోసి చూచి
  4. ↑దించునుద్యానంబునందు
  5. ↑డెట్టి… కుఁడొ.? కలుగు దుష్కీర్తికిఁ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )