ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుడు చంద్రలోకముపై దండెత్తుట; చంద్రలోకవర్ణనము
రావణుడు చంద్రలోకముపై దండెత్తుట; చంద్రలోకవర్ణనము
కం.మునిపతి లోకహితంబుగ
మునుకొని తమ కిటుల సఖ్యమున్‌ జేసి చనన్‌
జననాయకుఁడు యథేచ్ఛం
జనియె దశాస్యుఁడును జనియెఁ జంద్రునిమీఁదన్‌
75
వ.ఈ చందంబున దశకంధరుండు మాంధాతృ వసుంధరావరునితో సంధిఁ గావించి, సౌగంధికబంధుమదనిర్గంధనోత్సాహంబు వహియించి, మహనీయపుష్పకారూఢుండయి, యమ్మహాగిరివరోపరిభాగంబున కుద్గమించి, యవల విడంబితాడంబరంబునం బోయి పోయి, పదివేల యోజనంబుల పొడవునన్‌ బ్రథమభూమిక యనందగి, యగణితాధర చరణారుణ ప్రభాపరిహసితాభినవహంసమండలంబగు హంసమండలంబుతోఁ జని మరుత్పథంబు గడచి, యవతల నంతదూరంబు నడచి, పుష్కలజలావిష్కృతపుష్కలావర్తకాది బహువిధజలధర ప్రకాండంబులకు నుండ నిరవగు రెండవ మండలంబు నతిక్రమించి, యవక్ర విక్రమాసాధ్యు లగు సిద్ధచారణసాధ్యులకు వీఁడుఁబట్టగు మూఁడవచోటు దాఁటి, యమ్మీఁదట నవనాయకధీరతోదగ్ర వినాయక గ్రహ భూత ప్రేత పిశాచ నిశాచరగోచరం బగు నాలవ కక్ష్యాంతరంబు దరలి, తరళీకృత విస్తృతపాథోనికరశీకరంబుల నధోగతవలాహకగర్భంబులు నించుచు, నుదంచితామర తరంగిణీ తుంగతరంగరంగత్కమలకుముదాపహృతులం బొలుపుమీఱు కుముదాదివేదండ కాండంబుల విలాసంబులకు సదేశం బగు పంచమప్రదేశంబు వాసి, వాసవాసిధారానివారణోదార దారుణ కఠోర గరుజ్జాత సంచలనసముజ్జాతవాతావధూతసకల గ్రహమండలుం డగు నండజ మండలా ఖండలునకు బిడారగు నాఱవ ఠావున వెడలి, కడలి బోలిన గంభీరత్వంబు ధరించి నిత్య సత్య సంపదలం బెంపుఁ గని నిర్దోషలీలఁ గ్రాలు జమదగ్ని ప్రముఖ మునిరత్నంబులకు నిదానం బగు సప్తమస్థానంబునన్‌ బయలుదేఱి, యవారితమందారకోర కామందమందాకినీ సరిజ్జల బిందుబృందంబునఁ జెలు వంది, చలువల కెల్లనెల్ల యగు నెనిమిదవనెల వొరసికొని, తదూర్ధ్వమార్గంబున బడలువడక, దశ సహస్రయోజనంబు లరిగి, యవ్వల నయుతయోజనాయతం బగు సుధాకర లోకంబు విలోకించి, తన్మధ్యభాగంబున.76
సీ.తన మనోహరమూర్తి ధరణిఁ జక్కనివారి - కుపమేయపాత్రమై యొప్పు మిగులఁ
దనయంచితకళాభ్యుదయ మాశ్రయించిన - విబుధుల కుత్కంఠ వెలయఁ జేయఁ
దన విలాసములు చెంతలనున్న రోహిణీ - ప్రముఖకాంతల వింత బాళి ముంపఁ
దన చంద్రికామహత్త్వంబు బ్రహ్మాండక - రండంబునకుఁ గప్పురంబుగాఁగఁ
 
గీ.దనరు హిమధాము సౌజన్యధాము సోముఁ
జేరఁబోయినయంతట శిశిరకిరణ
పాళిపైపైన యెలసినఁ బంక్తిముఖుని
మంతురుల మేనులెల్లఁ గంపంబు నొందె
77
కం.చలిఁ జనఁగాక వడంకుచు
నలజడిఁబడి మంత్రులెల్ల నయ్యా! యిచటన్‌
నిలలేము దొలఁగి చనుటకు
సెలవీవలె ననుడు దనుజశేఖరుఁ డలుకన్‌
78
శా.ఆహా! తావకదేహముల్‌ వడఁకఁజేయం జొచ్చె నీ మూర్ఖుఁడీ
నీహారాంశుఁడు దాళుఁ డించుకని యాగ్నేయాస్త్రరౌద్రాస్త్రసం
దోహంబుల్‌ శశిమీఁద నించుటకు నుద్యోగించినన్‌ బౌత్త్రభూ
బాహాశౌర్య మెఱింగి వచ్చెనటకున్‌ బద్మాసనుం డయ్యెడన్‌
79
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju