| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రంభ నలకూబరుని కడకుంబోవుచు రావణుండున్న యుద్యానంబునకు వచ్చుట |
| తే.గీ. | ఇవ్విధంబున దశకంఠుఁ డేకతమున నున్న యెలదోఁటయే దైవయోగమునను లేమ పులియున్న పొద సొచ్చు లేడి పగిదిఁ జొచ్చి యచ్చోటు మెచ్చుచు వచ్చునపుడు | 183 |
| సీ. | అప్పద్మనయన కీల్కొప్పునఁజుట్టిన - విరిమల్లె సరముల పరిమళంబు లక్కొమ్మ నుదుట సోయగముగా దిద్దిన - కర్పూరతిలకంబు కమ్మతావి యబ్బోటి బిగి గబ్బిగుబ్బల నలఁదిన - కుంకుమగంధంపు క్రొత్తవలపు లచ్చెల్వ చెవిసంది నమరు సంపెఁగపువ్వు - చాయల జవ్వాది సౌరభంబు | |
| గీ. | లమ్మెఱుఁగుఁబోడి పుక్కిటితమ్ములమున బుగులుకొను వాసనలు గొనిపోయి పంక్తి ముఖుని నాసలు సఫలత మొనయ నెదుటఁ బెట్టెఁ జలపాది తెమ్మెర పిన్నవాఁడు | 184 |
| శా. | అయ్యామోదము నాసికాపుటగతంబైనన్ దశాస్యాసురుం డయ్యారే! పరమాద్భుతంబయిన దివ్యామోద మేతెంచె నే యొయ్యారంపుమిటారి చేరినది యీ యుద్యానభూభాగమున్? వెయ్యేలా? యటులైన ధాతనిపుడే వేనోళ్లఁ గీర్తింపనే? | 185 |
| వ. | అని తలంచుచు నిజాగ్రభాగంబున | 186 |
| కం. | కరకంకణపదమంజీ రరవంబులు దిశల నొరయ రశనయు మొరయన్ మరు గజ్జెల గుఱ్ఱమువలె సరభసమున వచ్చు వేల్పు సానిం గాంచెన్ | 187 |
| కం. | కని నివ్వెఱపడి భ్రమగొని తనువు మఱచి కొంతవడికిఁ దనుఁదెలిసి దశా ననుఁ డవ్వనిత తనూవిల సనములు పలుమాఱుఁబొగడసాగెం దనలోన్ | 188 |
| సీ. | మించి దృష్టికి మిఱుమిట్లు గొల్పెడు నిది - తెలియఁ గారుమెఱుంగు దీఁగెయేమొ? కార్మెఱుంగునకిట్టి కళగలదే? యిది - సొబగైన వెన్నెల సోగయేమొ? వెన్నెలసోగ కీచిన్నె లున్నవె? యిది - మరుని రాచిల్కసాంబ్రాణి యేమొ? చిలుకసాంబ్రాణికి జెలువంపు నడలుండు - నా? యిది కలికి రాయంచయేమొ? | |
| గీ. | కలికిరాయంచ కీ సోయగంబు గలదె? యెమ్మెగల దిది జాళువా బొమ్మ యేమొ? జాళువాబొమ్మ కీ విలాసములు గలవె? మెచ్చఁదగు నచ్చరవెలంది మిన్న యేమొ? | 189 |
| మ. | మదనుండే సృజియించె దీని నజుపై మాఱొడ్డి లేకున్న నీ యుదుటుంగుబ్బలపొంక మీ మొగములో నొయ్యార మీ మేనిలోఁ గుదు రీ కన్నుల బెళ్కు లీ తళుకుఁ గీల్గొప్పున్న శృంగార మీ పదియార్వన్నె పసిండిచాయ మఱి యే పద్మాక్షికిం గల్గునే? | 190 |
| సీ. | కలువ లీ డనవచ్చుఁ గలువల కిటువంటి - సొగసు డాలు మెఱుంగు చూపులున్నఁ జక్కవల్ సాటినాఁ జను జక్కవల కిట్టి - యెడలేని పొందిక లెపుడు నున్నఁ దేంట్లు దీ టనఁదగుఁ దేఁటు లీనీటున - గుంపుఁ బాయక జతగూడియున్నఁ జిందంబు సరిపోల్పఁ జెల్లుఁ జిందమున కీ - యందంపుటెలుఁగు చెల్వందియున్న | |
| గీ. | నెటులు సాధర్మ్య మించుకయేని లేని వాని నెటువలెఁ బ్రతి సేయవచ్చు? దీని జళుకు వాల్గన్నులకు గుబ్బచన్నులకును గప్పుకీల్గొప్పునకు మెడయొప్పునకును | 191 |
| ఉ. | పచ్చలకంకణమ్ములను భాసిలు డాపలికేల జాళువా కుచ్చెలకొంగుఁదాల్చి తళుకుందెలి చెక్కులు చెమ్మరింపఁగా హెచ్చు పిఱుందుభారము సహింపక నెన్నడ లింత కొంచఁగా నెచ్చటినుండి యెచ్చటికి నేఁగెడునో యిది యొంటిపాటునన్? | 192 |
| మ. | నునువాల్జూపుల బెళ్కు నెమ్మొగమునందుం దెల్లమౌ తెల్విగు ల్కునడల్ గీల్కొను తత్తరంబు పలుకోర్కుల్ సంతసంబుం బెనం గొను భావంబు సఖీహితోక్తుల పరాకుల్ మీఱె, నిక్కొమ్మ యొ క్కనిపై మేల్పడి యేఁగుచున్న సొలపుల్ గాన్పించె నా చూడ్కికిన్ | 193 |
| సీ. | ఏ మోహనాంగుఁ డీ యెలనాఁగ ముచ్చటల్ - వించుఁ గౌఁగిట గారవించు నొక్కొ! యే యెమ్మెకాని కీయింతి వాతెఱతేనె - లిచ్చి పైకొని రమియించు నొక్కొ! యే మనోహరుఁ డీ వధూమణి మణితంబు - చేఁ బారవశ్యంబుఁ జెందు నొక్కొ! యే వన్నెకాని కీ లావణ్యవతి గోటి - చెనకులుఁ గళలూరఁ జేయునొక్కొ! | |
| గీ. | యీ వెలఁది జన్మ నామంబు లేమి యొక్కొ! మేలుగొని నన్ను రతికేళి నేలు నొక్కొ! యేల కుండిన దీని నే నేల విడుతు? నని దశాననుఁ డుద్వృత్తి నట్టె లేచి | 194 |
| ఉ. | బావురుగానిఁ జూచి వెఱ పైకొనఁ దల్లడమందు మారుతే జీవలె గుండె జల్లు మనఁ జేడ్పడి వేల్పువెలంది పోవ నా త్రోవకు నడ్డమై నిలచి తొయ్యలి కేల్గవఁ బట్టి నిల్పి సొం పావహిలంగ దాని మొగమట్టె కనుంగొని రావణుం డనున్ | 195 |