ఇతిహాసములు ఉత్తరరామాయణము దశగ్రీవ కుంభకర్ణ విభీషణుల బాల్యక్రీడలు
దశగ్రీవ కుంభకర్ణ విభీషణుల బాల్యక్రీడలు
సీ.అలఁతి గట్టులు భుజార్గళనిరర్గళత ను - త్పాటించి కందుకప్రౌఢిఁ జూపు
నుడువీథి నొరసిపోయెడు విమానములందు - కొని బిట్టు నేలతోఁగొట్టియార్చు
నాశ్రమోన్నతభూరుహములు దాఁబడఁద్రోచి - పఱచు మౌనుల డాసి పరిహసించు
శరభసింహమదేభసమితి నీడిచి తెచ్చి - గట్టిగా దామెనల్‌ గట్టివైచు
 
గీ.గరుడ గంధర్వ పన్నగాగ్రణుల నెచటఁ
గనని మీతో భుజాభుజిఁ బెనఁగవలయు
నిలువుఁడని వార లుఱుక వెన్వెంటఁదగులు
బాల్యలీలావిలోలుఁడై పంక్తిముఖుఁడు
148
వ.మఱియును149
సీ.గిరిదిశాకరిభోగి కిరికూర్మములు వ్రాల - నంఘ్రిఘట్టన నుర్వి నడఁగఁ ద్రొక్కు
నరుణచోదితరథం బట్టిట్టుగాఁబట్టి - నవినాప్తు బింబంబు నాకి విడుచుఁ
బారసాఁచి దిగీశపట్టణాభ్యంతరో - ద్యానపక్వఫలాగతతులఁ గూల్చుఁ
గనుఁగొన్న వైమానికశ్రేణి వివృతాస్య - బిలంగతంబుగ నొక్క పెట్ట మ్రింగు
 
గీ.నెదుటఁ బడకున్న మునికోటి వెదకి వెదకి
పట్టి భక్షించుఁ గ్రొవ్వెగఁదొట్టి గుఱక
విడిచి నిదురించు, లేచు, నల్గడలఁ దిరుగుఁ
గుంభకర్ణుండు నడయాడుకొండకరణి
150
చం.అతని సహోదరుండు సుజనావనశాలి విభీషణుండు సు
వ్రతములు సల్పుచున్‌ శ్రుతిపరంపర యర్థముఁదండ్రి తెల్పఁగా
హితమతి నాలకింపుచు జితేంద్రియుఁడై యుపకారశీలతం
బ్రతిదినముం జరించు మృదుభావముతోఁగులధర్మపద్ధతిన్‌
151
ఉ.అన్నలుసేయు రాయిడి భయాతురులై పరువెత్తు మౌనులం
గన్నులఁ జూచెనేనిఁ దనుకంపము మానిచి నా నిమిత్త మా
పన్నుల వీరిఁ బ్రోవుఁడని ప్రార్థనసేయు నతండు వారలన్‌
చిన్నతనాన నుండియు విభీషణుఁ డెంత పరోపకారియో!
152
కం.క్రూరుఁడగు కుంభకర్ణుని
బారిఁబడి విభీషణోక్తి బ్రదికి మునులు త
త్కారుణికుని దీవింపుదు
రారవితారముగ బ్రదుకుమన్నా! యనుచున్‌
153
ఉ.అంతట నొక్కనాఁడు దమ యయ్యఁ గనుంగొన రత్నఘంటిక
క్రాంతవిమాన మెక్కికొని కన్నుల పండువుగా ధనేశ్వరుం
డెంతయువేడ్క వచ్చు చెలువెల్లను దప్పక చూచి కైకసీ
కాంత స్వభావసిద్ధమగు క్రౌర్యమునన్‌ దశకంఠుతోననున్‌
154
మ.కనుఁగొంటే భవదగ్రజుం డయిన యక్షస్వామి సౌభాగ్య మీ
తని చందంబున నీవు నిట్టి సిరులొందం జూడఁ గాంక్షించెదన్‌
దనయా! యెందున నీ దృశస్ఫురణఁ జెందన్‌ వచ్చు నా నేర్పుఁ గై
కొను శీఘ్రంబున నేటికూరక యశక్తుంబోలి వర్తింపఁగన్‌?
155
వ.అని ప్రబోధించిన156
మ.జననీ వాగ్వ్యజనానిలజ్వలితరోషజ్వాలియై యద్దశా
ననుఁ డిట్లంచుఁ బ్రతిజ్ఞఁజేసె జననీ! నామాట తథ్యంబుగా
విను యేఘోరతపస్వినై ధనదు ఠీవిన్‌ మించెదన్‌ లేనిచో
ధనతేజంబుల నీదృశం బగు ప్రభుత్వంబైనఁ బ్రాపించెదన్‌
157
కం.పెక్కువకు సాటియును గా
కెక్కువయుంగాక జోక నీతనికంటెం
దక్కువయై రానిఁక నను
మక్కువ వీడ్కొలుపుమని సమగ్రవినీతిన్‌
158
మ.వినతుల్‌ చేసి దశాననుండు మమతన్‌ వేమాఱు దీవించు న
జ్జననిన్‌ వీడ్కొని కుంభకర్ణుఁడు గనిష్ఠభ్రాతయున్‌ వెంట రాఁ
జని గోకర్ణసమాహ్వయాశ్రమము విశ్వాసంబుతోఁజేరి కాం
చనగర్భున్‌ మదినుంచి యుగ్రతపముల్‌ సల్పంగ నుద్యుక్తుఁడై
159
వ.తమ్ములతో నిట్లనియె160
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju