| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | పీఠిక |
| శ్రీకృష్ణస్తుతి | ||
| శా. | శ్రీరాధాధరబింబమున్ దొరయు రాచిల్కన్ నిజోరఃస్థలీ రారాజన్మణికాంతి రాఁ బిలిచి తద్రాకేందుబింబాననా స్మేరాంకూరముచేఁ గృతార్థుఁ డగుచుం జెల్వొందు గోపాంగనా జారగ్రామణి కృష్ణుఁ డీవుత మహైశ్వర్యంబు మా కెప్పుడున్ | 1 |
| లక్ష్మీస్తుతి | ||
| సీ. | పుష్కర విహరణ స్ఫురణంబు వహియించి - యచలానుగుణవృత్తి నవధరించి యార్యాభిగణ్య సౌకర్యంబున రహించి - ప్రబల హిరణ్యవర్ధనత మించి త్రిభువనాంచిత రూప విభవంబుఁ బ్రాపించి - భృగు కులంబు పవిత్రముగ జనించి యంభోధి భంగ లీలాసక్తి వర్తించి - కామపాలనరీతి ఖ్యాతిఁ గాంచి | |
| గీ. | పుణ్యజనముల పూజనములు గ్రహించి కలికితన మెందు నిట్టిది గలదె యనఁగఁ జెలువు చెలువున నలువొందు కలిమి చెలువ మెచ్చి నిచ్చలు మా కోర్కు లిచ్చుఁగాక | 2 |
| ఈశ్వరస్తుతి | ||
| చం. | వనితరొ! వెండికొండ నెలవంకలు పెక్కు వహించెఁ జూచితే యని సరసోక్తిఁ దా ననిన నచ్చపు గందపుఁ బూఁత గుబ్బ జా రిన నునుఁ బైఁట కొంగు సవరించుచు నవ్విన గౌరిఁ గౌఁగిటం దనిపెడు చంద్రశేఖరుఁ డుదారకృపన్ మముఁ బ్రోచుఁ గావుతన్ | 3 |
| పార్వతీస్తుతి | ||
| ఉ. | ఊరక చుట్టుకొన్నఁ గమలోత్పలపంక్తులు వాడునంచునో యేఱును గూర్చి చుట్టితివ యెంతటి జాణవు మేలు మేలు నీ నేరుపు మెచ్చవచ్చునని నిచ్చలు మచ్చిక శంభుఁ గేరు నీ హారగిరీంద్రకన్యక దయామతిఁ గోర్కులు మా కొసంగుతన్ | 4 |
| బ్రహ్మస్తుతి | ||
| చం. | భువనములం బ్రసిద్ధిఁ గని భూరితరోర్మి వరప్రభావ మొం ది విధుని రాక కుబ్బుచు నుదీర్ణ గుణాంచిత రత్నరాశియై కవులు సమాశ్రయింపఁ దగి కర్బుర గర్భత శ్రీ గురుత్వముం దవులు సరస్వతీశ్వరుఁ డుదారత మాకుఁ జిరాయు వీవుతన్ | 5 |
| సరస్వతీస్తుతి | ||
| చం. | తన హృదయాంబుజాతమునఁ దార్కొను నాథగతానురాగవా హిని వెలిఁ గ్రమ్మఁ జేసెనొకొ! యీ గతి నాఁగ విధాత చెంగటన్ దనరి జపాప్రసూన సవిధస్పటికాకృతి రక్తిఁ గుల్కు వా గ్వనజదళాక్షి మా కొసఁగుఁ గాత! వచో రచనా చమత్కృతుల్ | 6 |
| విఘ్నేశ్వరస్తుతి | ||
| మ. | కలుషేభావళి నాఁప నంకుశము విఘ్నక్ష్మాధరశ్రేణి వ్ర క్కలు గావింప వరస్ఫురత్ కులిశమున్ గర్వప్రమత్తారి వీ రుల బంధింపఁగఁ బాశము న్నత మనోరుగ్రేణువుల్ మాన్పఁబు ష్కలదానాంబువు లూను వేల్పడఁచు మత్కావ్యాంతరాయచ్ఛటల్ | 7 |
| ఆంజనేయస్తుతి | ||
| సీ. | శైశవంబుననె భాస్కరుమ్రింగె నితని తే - జమునకే ఘనుఁడింక సదృశుఁడనుచు హనుతటోద్ధతి వజ్ర మడఁచె నీతని తను - ద్రఢిమ కే మిఁకఁ బోల్పఁదగు నటంచు నురుధాటిఁ గడలిలో మెఱసె నీతని గభీ - రతకు నెయ్యది యింకఁ బ్రతియటంచు వాలాగ్రమున గిరుల్ వ్రాల్చె నీతని ధైర్య - సంపద కిఁక నెవ్వి సాటియనుచు | |
| గీ. | జానకీ రామచంద్రులే శౌర్యవంతు పటు గుణ స్ఫూర్తు లప్పటప్పటికి నెంతు రా మహాశాంతు నతిదాంతు నరికృతాంతు నతులమతిమంతు హనుమంతు నభినుతింతు | 8 |
| సుకవిప్రశంస | ||
| ఉ. | ఏ కవి జిహ్వఁదొల్త నటియించె సరస్వతి పాదనూపు రో ద్రేకఝళంఝళార్భటులు దిక్కులఁ బిక్కటిలంగ నే శుభ శ్లోకుని మానసాబ్జమున శోభిలెఁ దారకహంస మట్టి వా ల్మీకి మహర్షిశేఖరు నమేయగుణాకరు నాశ్రయించెదన్ | 9 |
| మ. | ధరణీభృన్మణిమౌళివర్తనములం దళ్కొంది యార్యోక్తివై ఖరిప్రాపించి యహీనవిస్ఫురదలంకారాప్తి శోభిల్లి భూ రిరసారూఢిఁ జెలంగి యర్థపరమైత్రిం జొక్కి మేలౌ కవీ శ్వరులన్ గొల్చెద సన్మనోహరకళా చంచత్ప్రభావాఢ్యులన్ | 10 |
| కుకవి నిరాకృతి | ||
| చం. | సరసతఁ దామునుం దెలియఁ జాలరు చెప్పిన నీసులేక యా దరణవహించి యూఁకొనరు తప్పులె పట్టుదు రొప్పుఁ గన్న మె చ్చరు పెడయుక్తు లెన్నుదురు శక్తులుగా రొకఁడైన నింపు చే కుఱ రచియింపరట్టి చెడుగుల్ విన నోర్తురె సత్ప్రబంధముల్? | 11 |
| వ. | అని యిష్టదేవతాప్రణామఖేలనంబును విశిష్టకవిస్తుతి మేళనంబును నికృష్టకవిజనావహేళనంబునుం గావించి | 12 |
| కృతిప్రశంస | ||
| మ. | పరమశ్రావ్య మఘవ్యయామితకథాభవ్యంబు దీవ్యత్సుధీ పరిష త్సంతతసేవ్య మబ్జభవ సంభావ్యంబునై మించు ను త్తరరామాయణకావ్యమున్ మృదువచోధారార్థ సందర్భని ర్భర తత్తద్రసముల్ రహింప రచియింపం బూనితిన్ వేడుకన్ | 13 |
| మ. | వరుసం దిక్కనయజ్వ నిర్వచనకావ్యంబై తగంజేసె ను త్తరరామాయణ మందునన్ మఱి ప్రబంధం బూని నిర్మించు టే సరసత్వంబని ప్రాజ్ఞులార! నిరసించం బోకుఁడీ! రాఘవే శ్వర చారిత్రము నెంద ఱెన్ని గతులన్ వర్ణించినం గ్రాలదే! | 14 |
| ఉ. | మానక కర్మభూమి పయి మానుషదేహముతో హితాహిత జ్ఞానమెఱుంగు బ్రాహ్మణుఁడు చారుకవిత్వము నేర్చి జానకీ జానికథల్ రచింపక యసత్కథ లెన్ని రచించెనేనియున్ వాని వివేక మేమిటికి? వాని కవిత్వమహత్త్వ మేటికిన్? | 15 |
| ఉ. | శ్రీకరరామమంత్ర జపసిద్ధిఁ బ్రసిద్ధి వహించి, వెన్క వా ల్మీకి రఘుప్రవీరుకథలే రచియించి గదా చెలంగె? ము ల్లోకములందు నెల్లమునులుం గొనియాడఁగ నట్టి దౌటఁ బు ణ్యాకరమైన రాము కథ హైన్యము మాన్పదె యెట్టివారికిన్! | 16 |
| శా. | ఆ వాల్మీకి మనీషివర్యమతి మంథాహార్య సంశోభితం బై విశ్వాతిగకామితార్థఫలదంబై, శ్రీపదంబై, సుశ బ్దావాసం బయి, మాధురిం దనరు రామాంచత్కథాక్షీర పా రావారంబు సమాశ్రయింతుఁ గవితాప్రఖ్యాతి కర్హంబుగన్ | 17 |
| చం. | ఇహపరసాధకంబన రహించు ప్రబంధ మొనర్ప శ్రీరఘూ ద్వహుని చరిత్ర మున్ దొరకె వాసిగ నీ కృతిరత్నమే మహా మహునకు సంతసంబున సమర్పణ సేయుదునంచు నెమ్మదిన్ దుహితకు భర్తనారయు జనున్ బలె యోజనసేయుచున్నెడన్ | 18 |
| కృతిపతినిర్ణయము | ||
| సీ. | పొడుపుఁ గెంపు వహించు బెడిదంపు నినుఁ గెంపు - రహి నింపు కంఠహారంబు వాఁడు కోమలాంఘ్రల యోర గొనబు రింగులు జాఱఁ - గట్టిన బంగారు బట్టవాఁడు శృంగారగతి మీఱ చెలువొందు కస్తూరి - తిలకంబుచే ముద్దుగులుకువాఁడు మకరకుండలలోల మణిజాలరుచిలీలఁ - దళుకొత్తు చెక్కుటద్దములవాఁడు | |
| గీ. | తలను వలగొన్న పించెపు దండవాఁడు విమల శతపత్ర జైత్ర నేత్రములవాఁడు మురళి డాచేతఁ గల జగన్మోహనుఁ డొ కండు నా స్వప్నమునను సాక్షాత్కరించె | 19 |
| క. | ఏనును నతనిం బొడఁగని ధ్యానంబున నలరు శ్రీమదనగోపాలుం డౌనని కలలోననె పర మానందముఁ జెంది మ్రొక్కి యర్చించు నెడన్ | 20 |
| ఉ. | అమ్మహనీయకీర్తి కరుణాన్వితుఁడై యను - వత్స! నీ ప్రబం ధమ్ము మదంకితంబుగ నొనర్పు, కృతార్థుడవయ్యె దింతె కా దిమ్మహి వస్తువాహన సమృద్ధ రమారమణీయభోగ భా గ్యమ్ములుఁ గల్గెడుం గృతియు నారవితారకమై ప్రకాశిలున్ | 21 |
| తే.గీ. | శ్రీవెలయ మున్ను విష్ణుమాయా విలాస యక్షగానంబు మాకె సమర్పణముగఁ జేసి తది యాదిగా మేము నీ సుధాను సారి వాక్కులఁ జొక్కి యున్నార మనుఘ! | 22 |
| కం. | అని పల్కి యా కృపాళుఁడు సనుటయు నేమేలు కాంచి స్వప్నమునందున్ ననునేలు స్వామిఁ గనఁ గలి గెనె? యని రోమాంచకంచుకితగాత్రుఁడనై | 23 |
| మ. | హనుమ ద్దివ్య పదారవింద మకరందానందనేందిందిరా త్ము ననేకాంధ్రకృతి ప్రకల్పన సమర్థుం బుష్పగిర్యప్పనా ర్యుని సత్పుత్రునిఁ దిమ్మనాఖ్య కవిచంద్రున్ మత్సహశ్రోతఁ బ్రొ ద్దుననే పిల్వగఁ బంచి కన్నకల సంతోషంబునం దెల్పినన్ | 24 |
| మ. | అతఁ డానందముఁ జెంది నన్నుఁ గని యన్నా! జాళువాపైఁడికిం గృతవర్ణాంచిత రత్న మబ్బినటు లయ్యెన్ నీవు వాక్ప్రౌఢిమన్ గృతిసేయంగఁ దొడంగు రామకథకుం గృష్ణుండు రాజౌటఁ బ్ర స్తుతి గావింపఁగ మాకు శక్యమె భవత్పుణ్య ప్రభావోన్నతుల్ | 25 |
| తే.గీ. | అని కిరీటికి శౌరి తోడైనయట్టు లమ్మహాకవి సాహాయ్య మాచరింపఁ గృతి నొనర్పఁగఁ బూనిన యేను మొదట నెంతు మద్వంశవిధ మది యెట్టు లనిన? | 26 |
| గ్రంథకర్తృవంశవర్ణనము | ||
| సీ. | అఖిలరాజాధిరాజాస్థాన జనహృద్య - విద్యావిహారు లార్వేలవారు కల్పకబలికర్ణకలశార్ణవోదీర్ణ - వితరణోదారు లార్వేలవారు సజ్జనస్తవనీయ సతత నిర్వ్యాజహా - రిపరోపకారు లార్వేలవారు ఘనదుర్ఘటస్వామి కార్య నిర్వహణ ప్ర - వీణతాధారు లార్వేలవారు | |
| గీ. | విమత గర్వాపహారు లార్వేలవార లట్టి యార్వేల వారిలో నలఘుకీర్తి వెలయు శ్రీవత్స గోత్రారవిందహేళి మహిత గుణశాలి వల్లభామాత్యమౌళి | 27 |
| ఉ. | ఎల్ల భయంబులన్ విడువుఁడేఁ గల నంచు వచించి ప్రేమ శో భిల్ల భరించు బంధుజన బృందము డెందమునందు భక్తి రం జిల్ల భజించు సంతతము శ్రీహరిదివ్య పదారవిందముల్ వల్లభమంత్రి బుద్ధి సురవల్లభమంత్రి యమాత్యమాత్రుఁడే | 28 |
| కం. | శ్రీవల్లభుండు లక్ష్మీ దేవిని మునుపెండ్లియైన తెఱఁ గునఁ దనకున్ దేవేరిగ లక్ష్మాంబిక నా వల్లభమంత్రి పెండ్లియాడెన్ వేడ్కన్ | 29 |
| సీ. | జడనిధిఁ బొడమని జలజాతగేహిని - చండికాఖ్యఁ దొలఁగు శైలకన్య బహుముఖావాసంబుఁ బాయు సరస్వతి - గోత్రభిత్సతి యనఁగూడని శచి చక్ర విద్వేషణాశ్రయగాని రోహిణి - పతిప్రతాపము మెచ్చి ప్రబలు సంజ్ఞ హీనవంశోత్పత్తి లేని యరుంధతి - పృథు పంక మొందని భీష్మజనని | |
| గీ. | యీమె యౌనని చుట్టంబులెల్లఁ బొగడ నగణితక్షాంతి సంపద నవనిఁ బోలి వల్లభుని సేవసేయు నవార్య లలిత లక్షణకదంబ కంకంటి లక్ష్మమాంబ | 30 |
| కం. | అల్లక్ష్మమాంబ యందా వల్లభనామ ప్రధాన వర్యుఁడు గనియెన్ బల్లవ బాణాకారున్ హల్లక హితధారు నయ్యన ధీరున్ | 31 |
| మ. | కనకాహార్య సమాన ధైర్యుఁడగు కంకంట్యయ్య నామాత్య వ ర్యునకుం బ్రాక్తనమంత్రు లద్యతన మంత్రుల్ భావిమంత్రుల్ విశు ద్ధనయోద్యుక్తిఁ బరోపకార వినయౌదార్య ప్రసక్తిన్ మృదూ క్తి నిజస్వామిహితోరుకార్య ఘటనాధీశక్తి నీడౌదురే! | 32 |
| కం. | అయ్యనవద్యగుణావని యయ్యనమంత్రిమణి నరసమాంబ వివాహం బయ్యెనహార్యకుమారిని నెయ్యంబునఁ బెండ్లియయిన నెలతాల్పురహిన్ | 33 |
| సీ. | వసియింప ప్రభుఁ డురం బొసఁగినచో వన - జాతంబు డాయు శ్రీసతి హసించి ప్రియుని సామేననుండియును దత్తేజంబు - సైరింపఁ జాలని శాంభవి నగి విభుసమ్ముఖంబున వెలసియు బహురస - జ్ఞాధీనయైన బ్రహ్మాణిఁ దెగడి తనకెందు గతియూన ధవుని లావణ్యంబుఁ - గలయు నప్పుడడంచు గంగఁ గేరి | |
| గీ. | యే కొరంతయులేక యస్తోక భక్తి చే నిజేశుని పరిచర్య సేయునెపుడు ధర్మగుణధామ పతిదేవతాలలామ భవ్యమతిపేటి నరసమాంబావధూటి | 34 |
| కం. | ఆ నరసాంబా గర్భాం భోనిధి నమృతాంశు చందమున దానయశో- నూనవిభావిభవైక ని ధానంబగు నన్నయ ప్రధానుం డొడమెన్ | 35 |
| మ. | దయమానాత్మ దయాబ్ధి గుప్తకవి విద్యావైదుషీభోజ భూ దయితగ్రామణి పూర్వదాతృ మహిమాధఃకారి దానప్రభూ తయశోధౌత దిశావకాశుఁడు మహో దంభూత వామాంగుఁ డ ప్పయమంత్రీశ్వరుఁ డమ్మహామహు నుతింపం జెల్లదే యెయ్యెడన్ | 36 |
| తే.గీ. | వినయమున కిమ్ము దాక్షిణ్యమునకు నెలవు సత్యమున కాస్పదము సదాచారమునకుఁ బ్రాపు నైపుణ్యమునకుఁ జేపట్టు గొమ్మ యలవియె నుతింపఁ గంకంటి యప్పఘనుని | 37 |
| కం. | జనసుతు డయ్యప్పఘనుం డనఘఁడు చిదురూరి నరసయకుఁ దిమ్మమకున్ దనుజామణియై గుణములఁ బెనపొందిన నరసమాంబఁ బెండిలి యయ్యెన్ | 38 |
| సీ. | తలఁప సురాధీశు తల్లి గాకుండెనే - నదితి నించుకసాటి యనఁగ వచ్చు రూఢిగా దోషాకరునిఁ బెంపకుండెనే - ననసూయనింత జోడనఁగ వచ్చు శక్తి గర్భీకరించక యుండెనే నరుం - ధతి నొక్కగతి నీడనంగ వచ్చు జనులు నిందింప మందునిఁ గాంచకుండెనే - ఛాయఁగొంత సమంబు సేయవచ్చు | |
| గీ. | అక్కొదవలున్న వార లయ్యతివకుఁ బ్రతి యౌదురే? యని బుధు లెంచ నతిశయిల్లె నప్పయామాత్యమౌళి యర్ధాంగలక్ష్మి నయదయాది గుణాలంబ నరసమాంబ | 39 |
| కం. | అన్నరసమాంబ యందు స మున్నతగుణుఁ డప్పనార్యముఖ్యుఁడు గనియెన్ సన్నుతినిఁ బాపరాజా ఖ్యున్నరసింహాభిధానుఁ గులము వెలయఁగన్ | 40 |
| తే.గీ. | వారిలోఁ బాపరాజాఖ్య వన్నెఁగన్న వాఁడ నేఁ బూర్వకృతపుణ్యవాసనా వి శేషమునఁ గృష్ణదేవునిఁ జెలఁగి కొలిచి తత్కృప మహాకృతి యొనర్పఁ దలఁచినాఁడ | 41 |
| ఉ. | కాంచనగర్భ శంకరముఖత్రిదశేంద్రులు ప్రౌఢరీతిఁ గీ ర్తించిన మెప్పుతో వినని కృష్ణుఁడు మత్కృతకీర్తనం బ్రహ ర్షించి వినున్ స్వకీయ కృపచే విలసిల్లెడు వాక్కులౌటఁ దా పెంచిన చిల్కపల్కు వినఁ బ్రీతి వహింపక యుందురే? దొరల్ | 42 |
| శా. | వైదర్భీ విలసద్విలాసమునఁ జెల్వంబూని సత్యోక్తి నెం తే దీపించి కళిందజోజ్జ్వలరసాప్తిన్ మించి భద్రాత్మకం బై దీవ్యద్ఘన లక్షణాశ్రయ సమాఖ్యం గాంచు మత్కావ్యమా హ్లాదం బిచ్చు గ్రహింపఁ గృష్ణునకు నర్హంబేకదా యెయ్యెడన్ | 43 |
| సీ. | శ్రీ రుక్మిణికి మకరికలు చెక్కుల వ్రాసి - సత్యకీల్జడకుఁ బూసరులు సుట్టి జాంబవతికిఁ గొప్పు చక్కఁగా నిడి మిత్ర - విందకుఁ బుక్కిటివిడె మొసంగి భద్ర సిబ్బెంపుగుబ్బల గంద మలఁది సు - దంతకుఁ దిలక మందముగ దిద్ది కాళింది ముఖఘర్మకణము గోటను మీటి - లక్షణ యడుగుల లాక్షయుంచి | |
| గీ. | నీళకు మణివిభూషణ పాళి దొడిగి నవ్య వకులంబు రాధకర్ణమునఁ జెరివి వెలఁదిమిన్నలు పదియావేలు గొలువ మించుకృష్ణుని శృంగార మెంచవశమె | 44 |
| షష్ఠ్యంతములు | ||
| కం. | ఏవంవిధ గుణ నిధికిన్ దైవత చాతక ఘనాఘన ప్రతినిధికిన్ లావణ్యరసాంబుధికిని సేవకసేవధికి మౌని చింతావధికిన్ | 45 |
| కం. | పురుషగ్రామణికి నురోం తరభృతరమణికిని బూతనాప్రాణమరు ద్ధరణోగ్రఫణికి వినతా మరమణికి మహామహోరమాద్యోమణికిన్ | 46 |
| కం. | ఆనతవిందునకున్ శ్రుతి నానటితపదారవిందునకు నుదితయశో దానందునకు సదాత్మస దానందున కవితశివశతానందునకున్ | 47 |
| కం. | కందళితానందశతా నందసుతానూనగాననవనాధృతికిన్ గుందశరత్కందమరు త్తుందభరప్రభువిభాపృథుయశోరతికిన్ | 48 |
| కం. | నీలమణీ నీలఘృణీ జాలతృణీకరణనిపుణ చారుతనునకున్ శూలధరాభీలకరా వేలశరాకారఘోరవిహృతి ఘనునకున్ | 49 |
| కం. | వివిధావతారునకు నఖ రవిజితతారునకుఁ బరధరశతారునకున్ స్తవనదవ ప్లుషిత సుదృ గ్భవకాంతారునకు భువనభయతారునకున్ | 50 |
| కం. | వ్రజగజగమనాలోలున కజగరవరజరఠవారణాభీలునకున్ సుజనైకకృపాళునకున్ కుజనవిఫాలునకు మదనగోపాలునకున్ | 51 |