| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుండు కపిలమునిచే భంగపడిన కథ చెప్పుట |
| చం. | పరిచరు లూడిగంబు సలుపన్ సచివుల్ హితభాషలాడఁగా శరధి తరంగ రంగదురు సైకతసీమల సంచరించుచున్ బరిసరధారుణిన్ దుహినపర్వతమో యన మించునొక్క భూ ధరమణిఁ జూచి చేరఁజని దానవుఁ డందొక కోనలోపలన్ | 40 |
| సీ. | నికటావనీజ పంక్తికిఁ గడార జటాంశు - లామ్రేడిత దళంబులై వెలుంగ నాసన్నఝరములం దానన శోణాబ్జ - మమితారుణాంభోరుహముల నింప సవిధకుంజాళిపుంజముల గ్రీవాలగ్న - పద్మమాలిక సౌరభములఁ బిల్వఁ బరిసరపల్లవప్రతతిఁ బల్లవమంజు - పాదముల్ నఖకాంతిఁ బరిహసింప | |
| గీ. | బద్ధపద్మాసనస్థుడై పరమనిష్ఠఁ గన్నుఁగవ మూసికొని పాణికమల సముచి తాక్షమాలిక చెవి వ్రేల నాత్మయోగ పూర్ణసుఖ మొందు నొక మహాపురుషుఁ గాంచె | 41 |
| ఉ. | కాంచి సమీపభూమి దశకంఠుఁడు సేరఁగఁ దత్పిశంగనే త్రాంచలవీథి నుప్పతిలె నగ్నిశిఖల్ భ్రుకుటీకరాళమై మించె ముఖంబు బాహుల నమేయశితాయుధయూథముల్ విజృం భించెఁ దనూరుహాళిఁ గనిపించె మరుద్వసురుద్ర సంఘముల్ | 42 |
| వ. | మఱియును | 43 |
| చం. | గ్రహముల భానుఁడన్ గిరులఁ గాంచనశైలము వేల్పులందు వృ త్రహుండు నిభంబులందుఁజవుదంతియుఁ జెట్టులఁ గల్ప ధారుణీ రుహము వెలుంగునట్టు లజరుద్రముఖామరమూర్తులందు దు స్సహమగు మూర్తిఁజేకొని యెసంగెడు నాఘనుఁ జూచు చున్నెడన్ | 44 |
| సీ. | ఉరమున శ్రీదేవి, యూరుల ధర్మంబు, - తలఁపున మదనుండు దపము దమము, మూఁపున పితృసంఘమును, శల్యముల మరు - ద్గణములుఁ, గుక్షి సాగరచయమ్ము, వసువులు నడుమఁ, బార్శ్వముల దిక్కులు, కన్నుఁ - గవ సూర్యచంద్రు, లగ్రంబున రుద్రు, లాశ్వినుల్ చెవుల, బాహాదండములను ధా - తయు విధాతయు నను దైవతములు | |
| గీ. | రమ్యమణిబంధమున భిదురంబు, పాణి తలములను భగపూషులు, తగ నఖముల భుజగతతి, రోమముల దానవులు, తనువున వివిధ దివ్యులు దివమును వెలయుటయును | 45 |
| శా. | ఆ వింతల్ గని యౌర! నా యెదుట మాయల్ సేతుఁగాఁ జొచ్చినాఁ డీ వాచంయమి యంచు రావణుఁడు వహ్నిజ్వాలి కాభీల లీ లావేలాస్త్రచయంబు లా ఘనునిపై నందంద వర్షించి వీ రావేశంబునఁ బేర్చి యార్చిన నతం డాటోపమేపారఁగన్ | 46 |
| కం. | బెడఁగుం జూపుల నిప్పులు జడిగొన వడిలేచి నన్ను సాధింపఁగ ని క్కడకున్ వచ్చితె? యోరీ! చెడుగా!యని యలఁతి ముష్టిచేఁ దాటించెన్ | 47 |
| ఉ. | ఆయన ముష్టిఘాతము మహాకులిశాయుధలీల మించినన్ వాయు మహోద్ధతిన్ ధరణివ్రాలు మహాకుజమో యనంగ దై తేయుఁడు గూలెఁ గూలిన పతిం గని మంత్రులు దాఁక వచ్చినన్ బాయఁగఁ జేసె హుంక్రియనె బల్లిదుఁ డప్పురుషుండు భూవరా! | 48 |
| వ. | ఇవ్విధంబున | 49 |
| ఆ.వె. | అలఁతి ముష్టిఁబొడిచి యమరారి నొగిలించి యతనివారి హుంక్రియనె కలంచి యమ్మహానుభావుఁ డంతికగిరిగుహా భ్యంతరంబు సొచ్చె నతిరయమున | 50 |
| ఉ. | ఆ యెడ మూర్ఛఁ దేఱి, దనుజాగ్రణియుం దనవారిఁ జూచి న న్నీయెడ ముష్టి నొంచి నతఁడెక్కడ కేఁగె? నటన్న, వారల య్యా! యిఁక నేటి కాతఁడు? భయంపడి యిగ్గుహ సొచ్చి చెచ్చెరం బోయెఁ బరాఙ్ముఖం దొడరఁ బోవుదురే మిమువంటి బల్లిదుల్? | 51 |
| కం. | అదిగాక బాహువిక్రమ మదనం బితనికి మహాత్ముఁ డని తోఁచుచు ను న్నది పాఱెడు బండ్లకు వల వదు పదములు చాఁప దనుజవల్లభ! యనినన్ | 52 |
| చం. | అలిగి భళా! యతండు ప్రళయాంతకుఁ డైనను బోవనిత్తునే? నిలువుఁడు మీర లీడ నని నిర్భయుఁడై నిబిడాంధకారముల్ దళముకొనంగ మూఢు మదిలాగున నున్న గుహాంతరంబులో పలికి దశాననుం డరిగె బాణకృపాణరుచుల్ వెలుంగఁగన్ | 53 |
| వ. | అరిగి తత్ప్రదేశంబున | 54 |
| సీ. | అతిభీషణాకారులై ఘోరశస్త్రాస్త్ర - ధారులై విలసిల్లు వీరవరుల నఖిలలోకైక మోహన విలాసాగణ్య - లావణ్యవతులైన దేవసతుల నవలోకములనె బ్రహ్మాండంబు భస్మంబు - సేయఁజాలిన మహాసిద్ధవరుల శంఖచక్రగదాసి శార్‌ఙ్గముల్ గల చతు - ర్భుజములఁ దాల్చిన పురుషవరులఁ | |
| గీ. | జూచి వారల తేజంబు సొంపు పెంపు గఱువతనమును దను భీతుఁగా నొనర్ప నుప్పతిలు తత్తఱమున నందుండ వెఱచి పఱచి దశకంఠుఁ డగ్గుహాభ్యంతరమున | 55 |
| సీ. | దివ్యచందనమాల్య భవ్యసౌరభములు - ఘుమ్మని గుహయెల్లఁ గ్రమ్ముకొనఁగ మహనీయ కోటీర మకరకుండల మణి - ద్యుతు లంధకారంబుఁ దొలఁగఁద్రోయ గగనభాగమున నక్షత్రపంక్తులఁబోలి - యురమున మౌక్తికసరము లలరఁ జామరగ్రాహిణీ చటులకంకణ నిస్వ - నంబులు చెవుల కానంద మొసఁగఁ | |
| గీ. | దగు శరచ్చంద్ర చంద్రికా ధవళశయ్యఁ బవ్వళించి, పదాబ్జముల్ బాల యొకతె దొడల నిడుకొని యొత్తఁ, గందోయి మోడ్చి, నిదురవోయెడి యొక సౌఖ్యనిధినిఁ జూచి | 56 |
| తే.గీ. | చూచి, యాయన చెంగట సొబగువాలు బెళుకుఁజూపుల వెలయు నచ్చెలియ నట్టె ఱెప్పవ్రేయక కనుచు దుర్వృత్తుఁడగుచుఁ జెంత కొకయింతఁ జేరినయంతలోన | 57 |
| తే.గీ. | ఎఱిఁగి యమ్మేటి తా ముసుంగిడిన జిలుగుఁ జలువ వెలిపట్టు దొలఁగించు సరగలేచి సరభసంబున నట్టహాసంబు సేయ వింశతిభుజుండు భీతిల్లి వివశుఁడయ్యె | 58 |
| కం. | వివశుఁడయి కొంతవడి క ద్దివిజారిప్రభుఁ డొకింత తెప్పిఱి యతనిన్ సవినయముగఁ గని యెవ్వం డవు నీవు? మహాత్మ! యేర్పడఁగఁ దెల్పఁగదే! | 59 |
| సీ. | రుద్రునిఁ గనుఁగొంటి రుద్రున కిటువంటి - దారుణోన్నిద్ర రౌద్రంబుఁగాన జమునితో మార్కొంటి జమునకు నిటువంటి - కర్కశోదగ్ర విగ్రహముఁగానఁ దపనునిఁ బొడగంటిఁ దపనున కిటువంటి - ప్రతిమాతిగ ప్రతాపంబుఁగానఁ గనకాద్రిపైనుంటిఁ గనకాద్రి కిటువంటి - యతిదుర్నివార ధైర్యంబుఁగాన | |
| గీ. | నింద్ర చంద్రాది దివ్యుల నెల్లఁగంటి వారియం దీప్రభావ మెవ్వరికిఁగాన నివుఱులో నిప్పుతీరున నీ చరిత్ర మెఱుఁగఁబడ దన్న నగి యతఁ డిట్టులనియె | 60 |
| తే.గీ. | ఇప్పుడెల్లను నన్ను నీ కెఱుఁగవచ్చు నేని దశానన! యిఁకమీఁద నీవ యెఱిఁగె దింతలోపలఁ బదరి నే నింతవాఁడ ననుచు వివరింపఁబో నది యట్టులుండె | 61 |
| శా. | బ్రహ్మేశానవరంబులన్ భువనముల్ బాధించి బ్రహ్మణ్యుల బ్రహ్మణ్యంబులు వెట్టంగా మెలఁగినన్ బ్రహ్మోక్తి సైరించితిన్ బ్రహ్మఘ్నున్ నిను నింకమీఁద ననిలో బాహాబలం బేర్పడన్ బ్రహ్మేశాది సురేంద్రు లడ్డపడినన్ భంజింపుదున్ రావణా! | 62 |