| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | కుబేరుండు దండ్రి యనుజ్ఞవలన లంకం జేరుట |
| మ. | సవిశేషాదర భాషలాడి యజుఁడున్ జన్నన్ ధనేశుండు వి శ్రవుఁ జేరన్ జని మ్రొక్కి తండ్రి! భవదాజ్ఞన్ బ్రహ్మ మెప్పించి యి ష్టవరంబుల్ గొని వచ్చితిన్ తగు నివాసం బా యజున్ వేఁడనై తి వినూత్న స్థల మెయ్య దెందు నిలుతున్ దెల్లంబుగాఁ దెల్పవే! | 179 |
| ఆ.వె. | ఈతిబాధ లేక యింత్తైనఁ బగవారి చేతిబాధ లేక చెలువు గలుగు నట్టి గీము వలయు నానతి యిమ్మన్నఁ బట్టి మోముఁ జూచి పలికె గురుఁడు | 180 |
| మ. | కలదీ దక్షిణవార్ధి మధ్యమున లంకానామదీవ్యత్పురం బలఘు ప్రాక్తటినీవిటోత్క్రమణ ధుర్యావార్యహర్యశ్వర థ్యలసత్క్రూర ఖురాగ్ర సౌధగత పంకాలేప సంక్షాళనా కలితాకాశ తరంగిణీతరళ రంగత్తుంగ భంగాఢ్యమై | 181 |
| సీ. | కనకకుంభ ప్రభాకలన బాలార్క వి - భ్రమముఁ జొప్పెడు గోపురములు గలుగ భర్మ భూమిధరంబు పలురూపు లాయెనో - యనమించు నర్మహర్మ్యములు గలుగ హీరకాంతులచేతఁ దారకావళిఁ గేరు - లసమాన లీలాచలములు గలుగ నగరీందిరాదేవి నడుమఁ బూనిన కాంచి - కొమరు గాంచిన పైఁడి కోట గలుగ | |
| గీ. | భూరి వైడూర్య తోరణస్ఫురిత విపణి మార్గములు గల్గ స్వర్గ సామ్యముగ విశ్వ కర్మనిర్మించె నిర్మాణ కౌశలమున రాక్షసార్థంబు మున్నప్పురము కుమార! | 182 |
| కం. | ముందు ముకుందుని భయమున నందు నిలువ వెఱచి దైత్యు లందఱు సుతలం బొందిరి నిర్భయపద మది సెంది సుఖింపుమని తండ్రి సెల విచ్చుటయున్ | 183 |
| సీ. | ఉపవనీరమ మారుతోత్పతత్కుసుమరా - జీకైతవంబున సేస లిడఁగఁ బ్రాకారలక్ష్మి వజ్రపు ఱాల తళుకుచేఁ - దన మేన మంచిగందంబుఁ బూయ భర్మగోపుర చరత్పారావతద్విజ - శ్రేణి పల్కులనె యాశీర్వదింప రాజమార్గ చిరత్న రత్న సౌధ శ్రీలు - గడు రక్తి కుంకుమఁ గాన్క సేయఁ | |
| గీ. | గేళి భూభృత్పరంపరల్ కేతనాంశు కాప్తిఁ బావడ లూన ముక్తాశ్మ దామ లలిత రుచి ధూత చంద్రకలంక లంక రాజసమునఁ బ్రవేశించె రాజరాజు | 184 |
| మ. | ధనదుం డీ గతి లంకఁ జేరి సురగంధర్వాప్సరస్సేవ్యుఁడై తన యాజ్ఞోన్నతి నైరృతుల్ భయముఁ జెందన్ దత్పురం బేలుచున్ జనయిత్రిన్ జనకున్ గనుం గొనఁగ నిచ్చల్ పుష్పకారూఢుఁడై చనుచున్ గ్రమ్మఱుచున్ సుఖించె నతులైశ్వర్యం బవార్యంబుగన్ | 185 |
| తే.గీ. | అని యదంభ వచోనిగుంభనలఁ గుంభ సంభవుండు పులస్త్య వంశక్రమంబు గొంత దెలిపిన విని శ్రీ రఘుప్రవీర వర్యుఁ డిట్లను నాశ్చర్య ధుర్యుఁ డగుచు | 186 |
| శా. | ఓ వింధ్యాచలగర్వనిర్హరణమాత్రోద్యోగ! పూర్వంబు లం కా వాసంబు సురారినాథుల నికాయ్యం బంచు మీ రానతీఁ గా విన్నప్పటి నుండి చిత్రరసశంకాసంకులం బయ్యె మ ద్భావం బంతకు మున్న తాదృశబలుల్ దైతేయు లెవ్వారొకో! | 187 |
| ఉ. | ఆదిఁ బులస్త్య వంశభవు లాసురముఖ్యు లనంగ వింటి నే తాదృశరాక్షసాధికులు దానవు లంతకు మున్నె లంకలోఁ బాదుక యుందురం చిపుడు వల్కితి రీ దశకంధరప్రహ స్తాదులకంటె వీరవరులైన సురారులు వార లెవ్వరో! | 188 |
| ఉ. | వారికి వంశకర్త యగువారి తెఱంగులు వారి పేరులున్ వారి బలోన్నతుల్ పిదప వారు ముకుందున కోడి లంకకున్ జేరకపోవుటల్ జటిలశేఖర! తెల్పుము విస్తరించి నీ చారుసుధారసోపమ వచఃకలనన్ జెవులింపు సెందెడిన్ | 189 |
| ఉ. | భానునిచే మహాతమముఁ బాయు తెఱంగున మాను మాదృశా జ్ఞానము మిమ్మబోఁటి బుధచంద్రులచే నని జానకీ బహిః ప్రాణము రామభూవిభుఁడు ప్రశ్న మొనర్ప దరస్మితంబుతోన్ దా ననియెన్ దథావిధకథావిదుఁ డమ్ముని సమ్మదంబునన్ | 190 |
| మ. | రవివంశోత్తమ! సంశయం బయినచోఁ బ్రశ్నంబు గావింప నే ర్తు, వినన్ నేర్తువు సావధానమున నిన్ స్తోత్రంబు సేయంగ మా కు వశంబే? పరమేష్ఠినుండియును రక్షోవంశ మాద్యంతమున్ వివరింతున్ వినుమం చగస్త్యుఁ డను బ్రావృట్కాలమేఘార్భటిన్ | 191 |