ఇతిహాసములు ఉత్తరరామాయణము రఘువీరుఁడు లవణాసురుని సంహరింప శత్రుఘ్నునిఁ బంపుట
రఘువీరుఁడు లవణాసురుని సంహరింప శత్రుఘ్నునిఁ బంపుట
శా.ధాత్రీనాయక! నన్నుఁ బంపుము మహోద్యద్గాత్రుఁ గుంభీనసీ
పుత్రున్‌ నే వధియించి వచ్చెద యతుల్‌ భూదేవతల్‌ దేవతల్‌
విత్రాసస్థితు లింకఁ జెంద రనినన్‌ వే లేచి భూభర్తకున్‌
శత్రుఘ్నుండు కరాబ్జముల్‌ మొగిచి చంచద్భక్తితో నిట్లనున్‌.
49
మ.ఇనవంశాధిప! మిమ్ముఁ బాసి పదునాల్గేండ్లున్‌ వెతన్‌ గూరలే
తిని నారల్‌ ధరియించి మై బడల నందిగ్రామవాసంబు సే
సినవాఁ డీ భరతుండు మీ చరణసంసేవాప్తి నిందుండ నిం
డనిలో నే లవణున్‌ వధింపఁగల నన్నంపింపుఁ డంచత్కృపన్‌
50
కం.తలఁచెద మీ పదపద్మము
నిలిచెద మధుపురము చెంత నిమిషములోనన్‌
గెలిచెద లవణుని మీ కృపఁ
బొలిచెద నన ననుజు మెచ్చి భూవరుఁ డనియెన్‌.
51
చం.అవిరళ ధైర్యశాలివి కృతాస్త్రుఁడ వాహవకోవిదుండ వీ
వవుట నిజంబుగాఁ దెలిసి యంపెద వైరి వధించి భూరివై
భవముల నీవు తత్పురముఁబాలన సేయుము ధాత్రిఁబ్రోచు ధ
ర్మువునకు సాటి లే దనిరి మున్పటి పెద్దలు రాజనీతులన్‌
52
ఉ.ఆలములో రిపున్‌ గెలిచి యా రిపురాజ్యము ధర్మసంగతిన్‌
బాలన సేయకున్న నగుఁ బాపము పూర్వజునాజ్ఞ యెయ్యెడన్‌
బాలురకున్‌ గ్రహింపఁదగుఁ బల్కకు మేమియు శత్రు పట్టణ
శ్రీలకు నీవు రాజ వభిషేకమహోత్సవ మందుమంచనన్‌
53
చం.అళుకుచు లక్ష్మణావరజుఁ డగ్రజుఁడుండఁగ రాజ్యవైభవం
బులు వహియింపఁ బిన్నలకుఁ బోలునె? యంచనఁబోయి క్రమ్మఱన్‌
బలుకక క్రుంకినన్‌, ధరణిపాలుఁడు లేనగవంకురింపఁగా
లలితమనస్కులౌ భరతలక్ష్మణులన్‌ గని పల్కె నత్తఱిన్‌.
54
చం.తగు నభిషేకవస్తువు లుదారతఁదేఁ దగువారిఁ బంపుఁ డా
ర్య గురుపురోహితాప్త సచివాదులఁ బిల్వుఁడు పిన్నతమ్మునిం
బగతుని పట్టణంబునకుఁ బట్టము గట్టెడుమాట వీటిలో
నెగడఁగఁ జాటఁ బంపుఁ డన నిల్వక వారలు తత్‌క్షణంబునన్‌.
55
ఆ.వె.అధిపుఁ డాన తిచ్చి నన్నియు జతకూర్చి
గురుపురోహితాదికులను బిల్చి
సకలకార్యములను సంఘటించితి మని
విన్నవింప రామవిభుడు దనరి.
56
సీ.శ్రీరస్తు రిపుజయశ్రీరస్తు తే యని - క్షితిసురశ్రేష్ఠు లాశీర్వదింపఁ
బటహగోముఖ శంఖ పణవాద్య బహుతూర్య - రవములు రోదోంతరముల నెరయ
హృద్యవాగనవద్యగద్యపద్యస్ఫూర్తి - గనిపించి వందిమాగధులు పొగడ
నటన శాస్త్రానుగుణ్యంబుగా గణికాంబు - జాస్యలు సరసలాస్యములు సలుపఁ
 
గీ.దల్లు లందఱుఁ గన్నులు చల్లఁగాఁగఁ
జూచి కడు సంతసిల వసిష్ఠుండు మంగ
ళాభిషేకంబుఁ గావింప ననుజు నిటల
పట్టిక సువర్ణపట్టంబుఁ గట్టె విభుఁడు.
57
చం.భవదనుజన్మునేఁడు మధుపట్టణభర్త నొనర్చినప్పుడే
లవణుఁడు పోరిలోఁబడియె లక్ష్మణపూర్వజ! మీరు నెమ్మదిన్‌
దవిలి తలంచినట్టి పని తప్పునె సిద్ధముగాక? యంచు నా
చ్యవనుఁడు మున్నుగాఁగల మహర్షులు రాముని నెంచిరయ్యెడన్‌.
58
చం.అనుపమ రత్నభూషణ మహాప్రభ బాలదివాకరుండొ నాఁ
దనరుచుఁ జేరవచ్చి ప్రమదంబున నానతుఁడైన పిన్న త
మ్ముని దయమీఱ నెత్తుకొని మూర్ధము మూర్కొని యక్కుఁజేర్చి గ్ర
క్కునఁదొడమీఁద నుంచుకొని క్షోణిసుతాహృదయేశుఁడిట్లనున్‌.
59
మ.అమరజ్యేష్ఠుఁడు తొల్లి యొక్క మహనీయాస్త్రంబు నిర్మించె డె
న్దమునన్‌ దా మధుకైటభాసురులు దానన్‌ గూలి రయ్యస్త్రరా
జము నాకున్‌ లభియించె లోకములకున్‌ సంత్రాసమౌఁదత్ప్రయో
గముచే నం చది యేయ నెవ్వరిపయిన్‌ గైకొమ్ము నీకిచ్చెదన్‌.
60
మ.అనుజా! నీకిది గల్గినన్‌ లవణసంహారంబు దుస్సాధమే?
యని శత్రుఘ్నునకుం బ్రయోగ ముపసంహారంబు మంత్రక్రమం
బును సాంగంబుగ నానతిచ్చి, విశిఖంబున్‌ గూర్మితో నిచ్చి రా
మనృపాలాగ్రణి క్రమ్మఱన్‌ బలికె శుంభత్ప్రౌఢవాగ్గుంభనన్‌.
61
ఉ.ఆ నిటలాక్షదత్త చటులాయతశూలము కేలఁబూనినన్‌
దానవునిన్‌ జయింపఁబురదానవభేదికినైన శక్యమే?
దాని గృహంబునం దిడి క్షుధావ్యథఁగానల సంచరించుచో
వాని నెదిర్చినన్‌ జయమవశ్యము నీ కగు లక్ష్మణానుజా!
62
ఉ.ఆలము సేయవచ్చె రిపుఁడంచొకయించుక వాఁడెఱింగినన్‌
శూలముకేల నేమఱఁడుసుమ్మది నెమ్మదినుంచి, దవ్వులన్‌
బాళెముడించి యొక్కఁడవు బాణకృపాణధనుర్ధరుండవై
యా లవణుండు ప్రోల్వెడలినప్పుడె కప్పుము గొప్పతూపులన్‌.
63
ఉ.ఘోరశరాహతిన్‌ నొగిలి కుత్సితుఁడై పురి దూఱఁబోయినన్‌
దూఱఁగ నీక యయ్యసురతో నని సల్పుము, నిల్వుమప్పుర
ద్వారముచక్కిఁగన్మొఱఁగి, వాఁడు గృహంబున కేఁగె నేనియున్‌
బోరునఁదెచ్చు నిచ్చలును బూజలొనర్చు మహోగ్రశూలమున్‌.
64
కం.అనిమిషమానస శూలం
బనఁదగు శూలంబు లేనియవసరమున శ
త్రుని గెలువు మనుచుఁ బలుమఱు
ననుజా! యెఱిఁగించినాఁడ నది మఱువకుమీ!
65
సీ.క్షణములోపల నద్రిఁ జౌకళించు జవంబు - ననుమించు హయములు నాల్గువేలు
మణిహేమరుచుల రోహిణిమేరువుల మీఱి - దండియౌ రథములు రెండువేలు
నింగితోనొఱయు నుత్తుంగాంగకస్ఫూర్తి - సరిలేని మదసామజములు వేయి
విలయరుద్రునినైన వెఱపింపఁగాఁ జాలు - వీరభటుల్‌ పదివేలమంది
 
గీ.కొలువఁగవినట గాయకకోటి వంది
మాగధసమూహ మూరవ్యమణుల దండు
వెంటరా లక్ష వరహాలు వెచ్చమునకుఁ
గొని మధుని పట్టణమునకుఁ జనుము నీవు.
66
కం.సేనాధీశుల భటులఁబ్ర
ధానుల బాంధవుల హితులఁ దగురీతుల స
న్మానింపు మేమఱక తఱి
యైనపనుల్‌ గొనుము సముచితాదరణములన్‌.
67
కం.వడిగలవా రని భటులను
బడలింపకు మనఘ! నిడుద పయనంబున మం
డెడు వేసవినిన్‌ విడిసిన
యెడలన్‌ బ్రజ డప్పి నొప్పు లెఱుఁగుము కరుణన్‌.
68
మ.ధనలోభంబునఁ బ్రోవ కుండెదు సుమీ తండ్రీ! భటశ్రేణులన్‌
ధనమున్‌ రాజ్యము దుర్గముల్‌ భటులచేతంగాదె సంరక్షఁజెం
దు? నృపాలుండు భటేతరుండయిన శత్రుల్‌ చీరికింగొందురే?
జనులున్‌ మెత్తురె? హత్తునే విజయముల్‌ సంగ్రామరంగంబులన్‌?
69
ఉ.ఆతపతప్తులైన సుభటాశ్వికహాస్తిపకాదికుల్‌ ప్రమో
దాతిశయంబుఁ గాంచ సముదంచితజహ్నుసుతా తటావనీ
జాత లతాగృహాంతముల చాయ నిల్చిన నీ శ్రమంబు త
చ్ఛీతలవాతపోతములచే నిఁకమీఁదటఁ బాయకుండునే?
70
మ.గగనోద్ఘార్షి దవాగ్నికీలికల స్రుక్కంబాఱి వారిస్పృహన్‌
మృగతృష్ణల్‌ గని పోయి పోయి మృగముల్‌ మేనుల్‌ వడంకం దగన్‌
జగతిన్‌ వ్రాలెడిజాలిఁ గన్గొనుచు భీష్మగ్రీష్మ సంతాప మిం
కఁ గడంద్రోయఁగలారె నీ భటులు గంగాతీరవన్యాస్థితిన్‌!
71
మ.భవదీయధ్వజినీ వ్రజోత్థిత రజోబాహుళ్య మగ్రేసర
చ్యవనాది ప్రతిరాజి కెంజడలతో సంధింపఁగాఁబోయి, జా
హ్నవియున్‌ వేగఁగ్రమించి, యద్దరిని సేనన్‌ డించి కాళింది చే
రువ నొక్కండవె పొంచియుండి లవణున్‌ రోధించి సాధింపుమా!
72
కం.ఎప్పుడు లవణునిఁ గూర్చితి
వప్పుడె నీ విజయలేఖ ననపుమిచటి కీ
వప్పనికిఁ దామసించినఁ
జెప్పెడిదే మంగకముల జీవములున్నే ?
73
కం.అని పలికి పయనమునకున్‌
దినమును నిశ్చయమొనర్చి తెలిపిన, నతఁడిం
పునఁ బతి యానతియిచ్చిన
యనువున సైన్యములఁగూర్చి యా దివసమునన్‌.
74
చం.మునుకొని యవ్వసిష్ఠునకు మ్రొక్కి యతండు రిపుక్షయో-స్తు తే
యన ముదమంది, తల్లులకు నందఱకున్‌ నతిసేసి వారి దీ
వనలు గ్రహించి, స్వామి కభివందనముల్‌ ఘటియించి భక్తి వీ
డ్కొని, మఱి యిద్ద ఱగ్రజులకున్‌ బ్రణమిల్లి యథోచితంబుగన్‌.
75
ఉ.విఘ్నము లేక గెల్వు మరివీరుని నీవని వారలున్‌ గృపా
నిఘ్నమనస్కులై పనుప నెట్టన బ్రాహ్మణ పూజసేసి శ
త్రుఘ్నుఁడు పౌరకాంతలు విరుల్‌ పయిఁజల్లఁగ విద్విషచ్ఛిరో
దఘ్న మహోజ్జ్వలద్భటకదంబముతోఁ గదలెన్‌ హుటాహుటిన్‌.
76
లయవిభాతికదలి త్రిదశేంద్రు వనకదళికల వంచుకొను - కదలికల హస్తములు చదలఁ బొదలంగా
మదకరులు ముందరుగ మది నెదుగు వేగములు - గదుర హయముల్‌ నడల యుదుటు గనిపింపన్‌
జదలములు నల్గడలఁ బొదివికొఁ దేరుగము - లుదిరిమలలో యనఁగఁ జెదర కరుదేరన్‌
నదులు నిధులున్‌ వనులు మొదలుగఁ గనుంగొనుచుఁ - ద్రిదినములలో నమరనది నతఁడు చేరెన్‌.
77
మాలినిచేరి దళత్సరసీజ లసద్రసశీకర తుందిల శీతమనో
హారిసమీర విహారములన్‌ శ్రమ మాఱఁగ నన్నది యవ్వలికిన్‌
భూరి రయంబునఁబోయి తదంతిక భూమిఁజమూచయముల్‌ విడియన్‌
బోరనఁ బుట్టను బుట్టిన మౌని తపోవన మోయనఁ జేరి రహిన్‌.
78
మానినిపరహితమతిలోలున్‌ బ్రహ్మవిద్యావిశాలున్‌
బరమమునివరేణ్యున్‌ భారతీశాభిగణ్యున్‌
సరసకవనదక్షున్‌ సత్కృపాంచత్కటాక్షున్‌
సురుచిర గుణజాలున్‌ జూచె వల్మీకజాతున్‌.
79
మత్తకోకిలచూచి లక్ష్మణసోదరుండు విశుద్ధబుద్ధి వినమ్రుఁడై
యా చతుర్ముఖతుల్యుఁగన్గొని యయ్య! నే లవణాసురున్‌
ఖేచరాంతకు రామునాజ్ఞను గెల్వవచ్చితి వేకువన్‌
లేచిపోయెద నేటి కిచ్చట నిల్తునే? యని వేడినన్‌.
80
తరలం.నగచు నమ్ముని పల్కెనో నరనరాథనందన! నాయమే
బెగడుచున్‌ బెఱవానిపోలిక భేదవాక్యములాడఁగాఁ
దగదె నీ గృహసీమ నీవు ముదంబుతో వసియింప నం
చగణితాదృతి సేమ మారసి యర్ఘ్యమిచ్చి కృపామతిన్‌.
81
మ.ఫలమూలాదు లొసంగి తృప్తి యొనరింపన్‌ బర్ణశాలాంతర
స్థలి నాత్మశ్రమమాఱ నిల్చి పిదపన్‌ శత్రుఘ్నుఁడమ్మౌనికం
జలిఁ గావించి మునీంద్ర! యీ వనములో జాలొంది యూపాళుల
గ్గలమై యున్నవి యెవ్వరిందు మఖముల్‌ గావించిరో? నావుడున్‌.
82
ఉత్సాహఆ మునీంద్రుఁడానతిచ్చె నయ్య! తొల్లి సూర్యవం
శామృతాబ్ధి పూర్ణచంద్రుఁడై తగున్‌ సుదాసుఁడన్‌
భూమిభర్త యొక్కఁ డవ్విభుండు పుత్రకాంక్ష యెం
తే మదిన్‌ వహించి చేసె నెల్ల ధర్మకోటులన్‌
83
కం.మిత్ర సఖుఁ డనఁగ నంతట
పుత్రుం డొకఁ డుద్భవించెఁ బుణ్యవశమునన్‌
ధాత్రీశుఁ డక్కుమారుని
ధాత్రికిఁ బతిఁజేసి తాను దపమున కేఁగెన్‌
84
కం.ఆ మిత్రసఖుఁడు శౌర్యజి
తామిత్ర సఖుండనంగ నలరుచు మృగయా
ప్రేమ నొకనాఁడు కానన
సీమన్‌ విహరించెఁ బొలము చెంచులు కొలువన్‌
85
వ.మఱియును86
లయవిభాతిహరుల హరియించుచును గరుల విరియించుచును - గిరుల ముఱియించుచును రురులఁ బొరిగొంచున్‌
ధరణివరుఁ డెల్లెడలఁ దిరుగునెడ బెబ్బులుల - తెఱఁగునను దైత్యవరు లిరువురల కానన్‌
బఱచు మృగయూధముల సరగ దిగమ్రింగుచును - బరుగు లిడఁజూచి యెట కరిగెద రటం చ
ద్దొర కినిసి వింటనొక శరము దొడి యొక్కపులి - శిరముఁదెగనేసె బాల మరులు నుతింపన్‌
87
మ.హతశేషుండు నిజాకృతిన్‌ నిలిచి రాజా! నిర్నిమిత్తంబు నా
హితునిం జంపితివేకదా! మఱతునే యిక్కార్య మంచున్‌ దిరో
హితుఁడైనన్‌ వెఱఁగంది క్రమ్మఱి యతం డిచ్చో వసిష్ఠోక్తి స
త్క్రతుశాలల్‌ ఘటియించి చేసె హరిమేధంబుల్‌ బుధుల్‌ మెచ్చఁగన్‌
88
కం.ఆ సమయంబునఁ దొల్లిటి
యాసురుఁడు వసిష్ఠరూప మచ్చుపడఁగ సౌ
దాసుఁగని సామిషాశన
మాసయ్యెడిఁగలుగఁజేయుమని యడుగుటయున్‌
89
ఉ.నిక్కము మౌనియంచు ధరణీపతి నెమ్మదినెంచి పాచకుం
గ్రక్కునఁ బిల్వనంపు నెడఁగన్గొని పాచకవేషధారియై
యక్కుటిలుండు వచ్చి యతఁడప్పనిఁదెల్ప మనుష్యమాంసమున్‌
దక్కక వండి తెచ్చి జననాథుని ముందటఁ బెట్టిపోయినన్‌
90
మ.మనుజాధీశుఁడు భార్యచేత ముని కమ్మాంసంబుతో నన్న మిం
పున వడ్డింప వసిష్ఠుఁడల్గి తగునే భూమీశ! యస్పృశ్యమౌ
మనుజక్రవ్యముఁబెట్ట? నీ మదికి రమ్యంబైన యీ మాంసమే
తినుచుం గ్రుమ్మరు మన్న రాజు మదయంతీయుక్తుఁడై దీనతన్‌
91
చం.కులగురుఁ జూచి మీరె మునుగోరినఁ బాచకుఁబిల్చి యర్హమౌ
పలలము వండి తెమ్మనుచుఁ బంచితి, వాఁ డది యెట్లువండెనో
తెలియదు, లెస్స చూడకయ తిట్టుట యర్హమె? యన్న నాతఁడుం
దెలిసె నదంతయుం బొలసుఁ దిండి యొనర్చిన మాయగా మదిన్‌
92
కం.తెలిసి వసిష్ఠుడు భూవర!
తలఁకకు నీ యసురతనము ద్వాదశవర్షం
బులు సనఁ దొలఁగెడి నన నతఁ
డలిగి గురున్‌ మరలఁదిట్ట నంబువులు గొనన్‌
93
మ.మదయంతీసతి యడ్డమై విడువుమో క్ష్మామండలాధీశ! చె
ల్లదు శాపంబు వసిష్ఠమౌనిపయి నేలా యింత మౌర్ఖ్యం బనన్‌
బదభాగంబున డించె శాపజలమున్‌ బాదంబు లవ్వేఁడిమిన్‌
గదిసెం గర్బురభావ మందునఁ దగెన్‌ గల్మాషపాదుండనన్‌
94
కం.ఆ సౌదాసుఁడు యాగము
సేసినచోటిదియటంచుఁజెప్పిన జటిలా
గ్రేసరు నుతిఁజేసె సుమి
త్రాసతి కడగొట్టు కొడుకు తత్సమయమునన్‌
95
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju