పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
వ్యాసునికడకు నారదుండు వచ్చుట
సీ. తన చేతివల్లకీతంత్రీచయంబున సతతనారాయణశబ్ద మొప్ప
నాననసంభూత హరిగీతరవసుధా ధారల యోగీంద్రతతులు సొక్కఁ
గపిలజటాభార కాంతిపుంజంబుల దిశలు ప్రభాతదీధితి వహింపఁ
దనులగ్నతులసికాదామగంధంబులు గగనాంతరాళంబుఁ గప్పికొనఁగ
 
ఆ. వచ్చె మింటనుండి వాసవీనందను, కడకు మాటలాడఁ గడఁకతోడ
భద్రవిమలకీర్తిపారగుఁ డారూఢ, నయవిశారదుండు నారదుండు.
86
క. కనియెన్‌ నారదుఁ డంతన్‌, వినయైకవిలాసు నిగమవిభజన విద్యా
జనితోల్లాసున్‌ భవదుః, ఖ నిరాసున్‌ గురుమనోవికాసున్‌ వ్యాసున్‌.
87
వ. ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెఱింగి లేచి వ్యాసుండు విధివత్క్రమంబునం బూజించిన నతండు లేనగవు నెగడెడి మొగంబుతోడ విపంచికాతంత్రి వ్రేల మీటుచు నిట్లనియె. 88
ఉ. ధాతవు! భారతశ్రుతివిధాతవు! వేదపదార్థజాత వి
జ్ఞాతవు! కామముఖ్యరిపుషట్కవిజేతవు! బ్రహ్మతత్త్వ ని
ర్ణేతవు! యోగినేతవు! వినీతుఁడ వీవు చలించి చెల్లరే!
కాతరుకైవడిన్‌ వగవఁ గారణ మేమి? పరాశరాత్మజా!
89
వ. అనినఁ బారాశర్యుం డిట్లనియె 90
క. పుట్టితి వజుతనువునఁ జే, పట్టితివి పురాణపురుషు భజనము పదముల్‌
మెట్టితివి దిక్కులం దుది, ముట్టితివి మహాప్రబోధమున మునినాథా!
91
వ. అదియునుం గాక నీవు సూర్యునిభంగి మూఁడులోకంబులం జరింతువు; వాయువు పగిది నఖిలజనులలోన మెలంగుదువు; సర్వజ్ఞుండ వగుటం జేసి. 92
క. నీ కెఱుఁగరాని ధర్మము, లోకములను లేదు బహువిలోకివి నీవున్‌
నాకొఱఁత యెట్టి దంతయు, నాకున్‌ వివరింపుమయ్య! నారద! కరుణన్‌.
93
వ. అనిన నారదుం డిట్లనియె. 94
ఉ. అంచితమైన ధర్మచయ మంతయుఁ జెప్పితి, వందులోన నిం
చించుక గాని విష్ణు కథ లేర్పడఁ జెప్పవు; ధర్మముల్‌ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁ గాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా!
95
మ. హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజహంసావళీ
సురుచిభ్రాజితమైన మానససరస్స్ఫూర్తిన్‌ వెలుంగొందు; శ్రీ
హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీ
కరమై యుండ; దయోగ్య దుర్మద నదత్కాకోలగర్తాకృతిన్‌.
96
మ. అపశబ్దంబులఁ గూడియున్‌ హరిచరిత్రాలాపముల్‌ సర్వ పా
ప పరిత్యాగము సేయుఁ గావున హరిన్‌ భావించుచుం బాడుచున్‌
జపముల్‌ సేయుచు వీనులన్‌ వినుచు నశ్రాంతంబు గీర్తించుచుం
దపసుల్‌ సాధులు ధన్యులౌదురు గదా తత్త్వజ్ఞ! చింతింపుమా!
97
వ. మునీంద్రా! నిర్గతకర్మంబై నిరుపాధికంబైన జ్ఞానంబు హరిభక్తి లేకున్న విశేషంబుగ శోభితంబు గాదు, ఫలంబు గోరక కర్మం బీశ్వరునకు సమర్పణంబు సేయకున్న నది ప్రశస్తంబై యుండదు; భక్తిహీనంబు లయిన జ్ఞానవాచాకర్మకౌశలంబులు నిరర్థకంబులు; గావున మహానుభావుండవు, యథార్థదర్శనుండవు, సకలదిగంతధవళకీర్తివి, సత్యరతుండవు, ధృతవ్రతుండవు నగు నీవు నిఖిల బంధమోచనంబు కొఱకు వాసుదేవుని లీలావిశేషంబులు భక్తితోడ వర్ణింపుము; హరివర్ణనంబు సేయక ప్రకారాంతరంబున నర్థాంతరంబులు వీక్షించి తద్వివక్షాకృత రూప నామంబులంజేసి పృథగ్దర్శనుండైన వాని మతి పెనుగాలిచేతం ద్రిప్పంబడి తప్పంజను నావచందంబున నెలవు సేర నేరదు; కామ్యకర్మంబులందు రాగంబు గల ప్రాకృతజనులకు నియమించిన ధర్మంబులు సెప్పి శాసకుండవగు నీవు వగచుట తగ; దది యెట్టు లనిన వార లదియె ధర్మం బని జుగుప్సితంబు లగు కామ్యకర్మంబులు సేయుచుఁ దత్త్వజ్ఞానంబు మఱతురు; గావున బుద్ధిమోహంబు జనియింపక తత్త్వజ్ఞుండవై వ్యథా వియోగంబు సేయుమని మఱియు నిట్లనియె. 98
చ. ఎఱిఁగెడు వాఁడు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్‌
నెఱయ నెఱింగి యవ్వలన నేరుపుఁ జూపు గుణానురక్తుఁడై
తెఱకువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమానయుక్తుఁడై
యెఱుఁగని వానికిం దెలియ నీశ్వరులీల లెఱుంగఁ జెప్పవే!
99
చ. తన కులధర్మమున్‌ విడిచి దానవవైరిపదారవిందముల్‌
పనివడి సేవ సేసి పరిపాకము వొందక యెవ్వఁడేనిఁ జ
చ్చిన మఱుమేన నైన నది సిద్ధి వహించుఁ దదీయసేవఁ బా
సినఁ గులధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్‌?
100
వ. అది గావున నెఱుక గలవాఁడు హరిసేవకుం బ్రయత్నంబు సేయందగుఁ; గాలక్రమంబున సుఖ దుఃఖంబులు ప్రాప్తంబు లయినను హరిసేవ విడువం దగదు; దానం జేసి యూర్ధ్వంబున బ్రహ్మ పర్యంతంబు గ్రింద స్థావరపర్యంతంబుఁ దిరుగుచున్న జీవులకు నెయ్యది పొందరా దట్టిమేలు సిద్ధించు కొఱకు హరిసేవ సేయవలయు. హరిసేవకుం డగువాఁడు జననంబు నొందియు నన్యుని క్రియ సంసారంబునఁ జిక్కండు; క్రమ్మఱ హరిచరణస్మరణంబుఁ జేయుచు భక్తిరసవశీకృతుం డయి విడువ నిచ్చగింపఁడు; మఱియును. 101
సీ. విష్ణుండు విశ్వంబు; విష్ణుని కంటెను వేఱేమియును లేదు; విశ్వమునకు
భవవృద్ధి లయము లా పరమేశుచే నగు; నీ వెఱుంగుదు గాదె నీ ముఖమున
నెఱిఁగింపఁ బడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము; రమణతో హరిపరాక్రమము లెల్ల
 
ఆ. వినుతిసేయు మీవు వినికియుఁ జదువును, దాన మతుల నయముఁ దపము ధృతియుఁ
గలిమి కెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకుఁ, గమలనాభుఁ బొగడఁ గలిగెనేని.
102
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )