పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
ధర్మజుఁడు భీమునికి కొన్ని ఉత్పాతాలు చెప్పుట
సీ. ఓడక ముందట నొక సారమేయంబు మొఱుఁగుచు నున్నది మోర యెత్తి
యాదిత్యుఁ డుదయింప నభిముఖంబై నక్క వాపోయె మంటలు వాతఁ గలుగ
మిక్కిలుచున్నవి మెఱసి గృధ్రాదులు గర్దభాదులు దీర్చి క్రందుకొనియె
నుత్తమాశ్వంబుల కుదయించెఁ గన్నీరు మత్తగజంబుల మదము లుడిగెఁ
 
ఆ. గాలు దూతభంగిఁ గదిసెఁ గపోతము, మండ దగ్ని హోమమందిరములఁ
జుట్టుఁ బొగలు దిశల సొరిది నాచ్ఛాదించెఁ, దరణి మాసెఁ జూడు ధరణి గదలె.
337
క. వాతములు విసరె, రేణు, వ్రాతము లాకసముఁ గప్పె, వడి సుడిగొని ని
ర్ఘాతములు వడియె, ఘన సం, ఘాతంబులు రక్తవర్షకలితము లయ్యెన్‌.
338
క. గ్రహములు పోరాడెడి నా, గ్రహములు వినఁబడియె, భూత కలకలములు దు
స్సహము లగుచు శిఖికీలా, వహములక్రియఁ దోఁచె గగనవసుధాంతరముల్‌.
339
క. దూడలు గుడువవు చన్నులు, దూడలకున్‌ గోవు లీవు దుగ్ధము లొడలం
బీడలు మానవు పశువులఁ, గూడవు వృషభములు తఱపి కుఱ్ఱల నెక్కున్‌.
340
క. కదలెడు వేల్పుల రూపులు, వదలెడుఁ గన్నీరు వానివలనం జెమటల్‌
వొదలెడిఁ బ్రతిమలు వెలిఁజని, మెదలెడి నొక్కొక్క గుడిని మేదినియందున్‌.
341
క. కాకంబులు వాపోయెడి, ఘూకంబులు నగరఁ బగలు గుండ్రలు గొలిపెన్‌
లోకంబులు విభ్రష్ట, శ్రీకంబులు గతి నశించి శిథిలము లయ్యెన్‌.
342
మ. యవ పద్మాంకుశ చాప చక్ర ఝష రేఖాలంకృతంబైన మా
ధవు పాదద్వయ మింక మెట్టెడు పవిత్రత్వంబు నేఁడాదిగా
నవనీకాంతకు లేదు పో; మఱి మదీయాంగంబు వామాక్షి బా
హువు లాకంపము నొందుచుండు; నిల కే యుగ్రస్థితుల్‌ వచ్చునో!
343
వ. మఱియు మహోత్పాతంబులు పెక్కులు పుట్టుచున్నయవి; మురాంతకుని వృత్తాంతంబు వినరాదని కుంతీసుతాగ్రజుండు భీమునితో విచారించు సమయంబున. 344
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )