| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| సీ. |
కలివర్తనంబునఁ గ్రౌర్యహింసాసత్య దంభ కౌటిల్యాద్యధర్మచయము పురముల గృహముల భూములఁ దమలోనఁ గలుగుట దలపోసి కరిపురమున మనుమని రాజవై మను మని దీవించి సింధుతోయకణాభిషిక్తుఁ జేసి యనిరుద్ధనందనుండైన వజ్రునిఁ దెచ్చి మధురఁ బట్టము గట్టి మమతఁ బాసి |
|
| ఆ. |
కరుల హరుల భటులఁ గంకణాదికముల, మంత్రిజనుల బుధుల మానవతుల నఖిల మయిన ధనము నభిమన్యుసుతునకు, నప్పగించి బుద్ధి నాశ్రయించి. |
384 |
| వ. | విరక్తుండైన దర్మనందనుండు ప్రాజాపత్యం బనియెడి యిష్టిఁ గావించి యగ్నుల నాత్మారోపణంబు సేసి, నిరహంకారుండును, నిర్దళితాశేష బంధనుండునునై సకలేంద్రియంబుల మానసంబున నడంచి, ప్రాణాధీనవృత్తి యగు మానసంబును బ్రాణమందును, బ్రాణము నపానమందును, నుత్సర్గసహితం బయిన యపానము మృత్యువు నందును, మృత్యువును పంచభూతంబులకు నైక్యంబైన దేహంబు నందును, దేహమును గుణత్రయంబు నందును, గుణత్రయంబు నవిద్యయందును, సర్వారోపహేతు వగు నవిద్యను జీవునియందును, జీవుం డయిన తన్ను నవ్యయంబయిన బ్రహ్మమందును లయింపఁజేసి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి, నారచీరలు ధరియించి మౌనియు నిరాహారుండును ముక్తకేశుండునునై, యున్మత్త పిశాచ బధిర జడుల చందంబున నిరపేక్షకత్వంబున. | 385 |
| క. |
చిత్తంబున బ్రహ్మము నా, వృత్తముఁ గావించికొనుచు విజ్ఞానధనా యత్తులు దొల్లి వెలింగెడి, యుత్తరదిశ కేగె నిర్మలోద్యోగమునన్. |
386 |
| సీ. |
అంత నాతని తమ్ము లనిలపుత్త్రాదులు గలిరాకచేఁ బాపకర్ము లగుచుఁ జరియించు ప్రజల సంచారంబు లీక్షించి యఖిలధర్మంబుల నాచరించి వైకుంఠ చరణాబ్జ వర్తితహృదయులై తద్భక్తినిర్మలత్వమును జెంది విషయయుక్తులకుఁ బ్రవేశింపఁగా రాక నిర్ధూతకల్మష నిపుణమతులు |
|
| తే. |
బహుళ విజ్ఞానదావాగ్ని భసితకర్ములైన, యేకాంతులకు లక్ష్యమై వెలుంగు ముఖ్యనారాయణ స్థానమునకుఁ జనిరి, విగతరజమైన యాత్మల విప్రముఖ్య! |
387 |
| వ. | అంత విదురుండు ప్రభాస తీర్థంబున హరియందుఁ జిత్తంబు సేర్చి, శరీరంబు విడిచి, పితృవర్గంబు తోడ దండధరుం డగుటం జేసి నిజాధికార స్థానంబునకుం జనియె; ద్రుపదరాజపుత్రియుఁ బతులవలన నుపేక్షితయై జగత్పతియైన వాసుదేవునందుఁ జిత్తంబు సేర్చి తత్పదంబు సేరె నిట్లు. | 388 |
| క. |
పాండవకృష్ణుల యానము, పాండురమతి నెవ్వఁడైనఁ బలికిన విన్నన్ ఖండితభవుఁడై హరిదా, సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా!. |
389 |
| వ. | అంత నటం బరీక్షిత్కుమారుండు జాతకర్మవిదులైన పెద్దలు సెప్పిన చందంబున భూసురో త్తమశిక్షావశంబున మహాభాగవత శేఖరుండై ధరణీపాలనంబు సేయుచు నుత్తరుని పుత్రిక నిరావతి యను మత్తకాశినిం బెండ్లియయి, జనమేజయ ప్రముఖులైన నలువురు కొడుకుల నుత్పాదించి, గంగా పులినతలంబునఁ గృపాచార్యుండు గురుత్వంబు సేయ యాగభాగంబులకు వచ్చిన దేవతల నీక్షించుచు, భూరిదక్షిణంబులుగా మూఁడశ్వమేధంబు లాచరించి, దిగ్విజయకాలంబున గోమిథునంబుఁ దన్ను శూద్రుండును రాజచిహ్న ముద్రితుండును నగు కలిం బట్టి నిగ్రహించె నని చెప్పిన, శౌనకుండు పౌరాణికున కిట్లనియె. | 390 |