పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
పరీక్షితుఁడు వేఁటాడి శమీకునిపై మృతసర్పము నెత్తి వైచుట
క. మృగయులు మెచ్చ నరేంద్రుఁడు, మృగరాజు పరాక్రమమున మెఱసి హరించెన్‌
మృగధర మండలమునఁ గల, మృగ మొక్కటి దక్క సర్వమృగముల నెల్లన్‌.
456
వ. ఇట్లు వాటంబయిన వేఁటతమకంబున మృగంబుల వెంబడిం బడి యెగచుచుం జరించుటం జేసి బుభుక్షాపిపాసల వలన మిగులఁ బరిశ్రాంతుండయి ధరణీకాంతుండు చల్లని నీటికొలంకులు గానక కలంగెడు చిత్తంబుతోఁ జని యొక్క తపోవనంబు గని యందు. 457
సీ. మెలఁగుట చాలించి మీలితనేత్రుఁడై శాంతుఁడై కూర్చుండి జడత లేక
ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగవీథులఁ బాఱనీక
జాగరణాదిక స్థానత్రయము దాఁటి పరమమై యుండెడి పదముఁ దెలిసి
బ్రహ్మభూతత్వ సంప్రాప్త్యవిక్రియుఁ డయి యతిదీర్ఘజటలుఁ ద న్నావరింప
 
తే. నలఘు రురు చర్మధారియై యలరుచున్న, తపసిఁ బొడగని శోషితతాలుఁ డగుచు
నెండి తడిలేక కుత్తుక నెలుఁగు డింద, మందభాషల నిట్లను మనుజవిభుఁడు.
458
క. తోయములు దెమ్ము మా కీ, తోయము వేఁటాడ వెరవు దొరకదు ఘన చే
తోయుత! డప్పి జనించెను, తోయము వారలును లేరు దుస్సహ మనఘా!
459
వ. అని భూవరుండు శమీకమహాముని సమాధి నిష్ఠానిమీలిత నేత్రుండును విస్మృత బాహ్యాంతరింద్రియ కృత సంచారుండును హరిచింతాపరుండునునై యుండుటం దెలియలేక. 460
ఉ. కన్నులు మూసి బ్రాహ్మణుఁడు గర్వముతోడుత నున్న వాఁడు, చే
సన్నల నైన రమ్మనఁడు, సారజలంబులు దెచ్చి పోయఁ డే
మన్ననలైనఁ జేయఁడు, సమగ్రఫలంబులు వెట్టఁడింత సం
పన్నత నొందెనే తన తపశ్చరణాప్రతిమ ప్రభావముల్‌.
461
ఆ. వారిఁగోరుచున్న వారికి శీతల, వారి యిడుట యెట్టివారి కయిన
వారితంబుగాని వలసిన ధర్మంబు, వారి యిడఁడు దాహవారి గాఁడు.
462
చ. అని మనుజేశ్వరుండు మృగయాపరిఖేద నితాంత దాహ సం
జనిత దురంత రోషమున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ
జనములు సేయఁడంచు మృతసర్పము నొక్కటి వింటికోపునం
బనివడి తెచ్చి వైచె నటు బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్‌.
463
వ. ఇట్లతండు ప్రత్యాహృత బాహ్యాంతరింద్రియుం డగుట నిమీలితలోచనుండు గా నోపునో యట్లుగాక గతాగతులగు క్షత్త్రబంధులచే నేమియని మృషాసమాధి నిష్ఠుండు గానోపునో, యని వితర్కించుచు వృథారోష దర్పంబున ముని మూఁపున గతాసువయిన సర్పంబు నిడి నరేశ్వరుండు దనపురంబునకుం జనియె; నంత సమీపవర్తులైన మునికుమారు లంతయుం దెలియం జూచి శమీకనందనుండైన శృంగికడకుం జని. 464
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )