| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | తృతీయస్కంధము |
| చ. |
అనవుడు దేవహూతి హృదయంబున సంతసమంది య మ్మునీం ద్రుని వచన క్రమంబునఁ బరున్ భగవంతు ననంతుఁ బద్మలో చను హరి విష్ణు నర్చనము సల్పుచు నుండఁగఁ గొన్ని యబ్దముల్ సనునెడ దానవాంతకుఁడు సమ్మతిఁ గార్దమమైన తేజమున్. |
836 |
| క. |
ధరియించి య మ్మునీంద్రుని, తరుణీ గర్భంబువలన దనుజారి శమీ తరు కోటరమున వైశ్వా, నరుఁ డుదయించిన విధంబునన్ జనియించెన్. |
837 |
| సీ. |
అయ్యవసరమున నాకాశమున దేవ తూర్య ఘోషంబులు తుముల మయ్యె, నందిత దేవతాబృందంబు లందంద, కురిసిరి మందారకుసుమవృష్టి, గంధర్వకిన్నరగానంబు వీతెంచె నప్సరోగణముల యాట లొప్పె, వావిరి దిక్కులఁ గావిరి విరిసెను దవిలి వార్ధుల కలంకువలు మానె, |
|
| తే. |
సాధుజనముల మనములు సంతసిల్లె, హోమవహ్నులు ప్రభలఁ జెన్నొంది వెలిఁగెఁ గుసుమఫలభారముల నొప్పెఁ గుజములెల్ల, సర్వసస్యాళి చెన్నొందె జగతిలోన. |
838 |
| వ. | ఇట్టి మహోత్సవంబున దేవహూతికిం దత్త్వబోధంబుఁ గావించుకొఱకుఁ దదీయగర్భంబున నుదయించిన పరబ్రహ్మ స్వరూపుండైన నారాయణుని దర్శించుకొఱకు మరీచి ప్రముఖ మునిగణ సమేతుండై చతుర్ముఖుండు సనుదెంచి యమ్మహాత్ముని దర్శించి కర్దమదేవహూతులం గనుంగొని యిట్లనియె. | 839 |
| క. |
నుతచరితులార! మీరలు, కృతకృత్యులు, విష్ణుపూజఁ గేవలభక్తిన్ మతి నిష్కపటులరై చే, సితిరి తదర్చన ఫలంబు సేకుఱె మీకున్. |
840 |
| క. |
శ్రిత భయహరణుఁడు, మునిజన, నుత చరితుఁడు, పరుఁడు, మీ మనోరథసిద్ధిన్ వితతంబుగఁ గావించుటఁ, జతురత మీ జన్మ మింక సఫలతఁ బొందెన్. |
841 |
| క. |
వినుఁడు సకాములునై హరి, ననుపమభక్తిన్ భజించునదె ముక్తికిఁ జా లును, మీ పుణ్యం బే మని, కొనియాడఁగ వచ్చు నీతికోవిదులారా! |
842 |
| వ. | అని వెండియుం గర్దమునిం గనుంగొని యిట్లను, “భవదీయ తనూభవలం బ్రకటశీలవ్రతాచార సంపన్నులైన మునివరేణ్యులకుం బెండ్లిసేయు, మట్లయిన వారివలనం బ్రజాసృష్టి బహువిధంబుల వృద్ధిం బొందు”నని చెప్పి మఱియు నిట్లనియె. | 843 |
| చ. |
అనఘ! భవత్సుతుండు సముదంచిత తేజుఁడు నైన యిమ్మహా త్మునిఁ బరమేశు నీశు నజితున్ నలినాక్షు నమేయు నచ్యుతున్ ఘనుని ననంతు నాద్యు నవికారుని నక్షరుఁగాఁ దలంపు, మీ ఘనుఁడు సమస్త చేతన నికాయహృదీప్సితదాయి గావునన్. |
844 |
| సీ. |
మానిత జ్ఞాన విజ్ఞాన యోగంబులు నను నుపాయంబుల నొనరఁ జేసి యలవుమైఁ గర్మజీవుల నుద్ధరించుటకొఱకు నమ్మహితాత్మకుఁడు సమగ్ర హాటకరుచి జటాజూటుండు నుత్ఫుల్ల పంకజనేత్రుండు పద్మపత్ర హల కులిశాంకుశ లలిత రేఖాంకిత చరణతలుండును సత్త్వగుణుఁడు |
|
| తే. |
నగుచు నిప్పుడు సరసీరుహాక్షి, నీదు, గర్భమం దుదయించెను ఘనుఁడు, నీకుఁ దత్త్వబోధంబుఁ గావించుఁ, దావకీన, హృదయ సంగత సంశయ మెల్లఁ బాపు. |
845 |
| వ. | మఱియును. | 846 |
| క. |
నుతికెక్కి సిద్ధగణ సే, వితుఁడై ఘనసాంఖ్యయోగ విలసిత తత్త్వ స్థితి నిరతుఁ డగుచుఁ గపిలా, ఖ్యతఁ దనరి చరించు నీ జగత్త్రయ మెల్లన్. |
847 |
| క. |
అని పలికి య మ్మరీచిం, గని యుద్వాహార్థ మునిచి కమలజుఁ డంతం దన నందను లగు నారద, సనకాదులఁ గూడి యాత్మ సదనము కరిగెన్. |
848 |
| వ. | అంత నా కర్దముండు గమలసంభవచోదితుం డగుచుఁ యథోచితంబుగా నాత్మీయ దుహితల వివాహంబు సేయందలంచి మరీచికిం గళయను కన్యకను, నత్రికి ననసూయను, నంగిరసునకు శ్రద్ధను, బులస్త్యునకు హవిర్భువును, బులహునకు గతినిఁ, గ్రతువునకుఁ గ్రియను, భృగునకు ఖ్యాతిని, వసిష్ఠునకు నరుంధతిని, నధర్వునకు శాంతినింగా నిజకులాచారసరణిం బరిణయంబు గావించిన వారును గృతదారపరిగ్రహులును, గర్దమ కృతసంభావనా సంభావితులును నగుచు నతనిచేత ననుజ్ఞాతులై జాయాసహితు లగుచు నిజాశ్రమ భూములకుం జనిరి. అనంతరంబు కర్దముండు దేవోత్తముండగు విష్ణుండు దన మందిరంబున నవతరించి వసించియుంటం దన చిత్తంబున నెఱింగి వివిక్త స్థలంబునకుం జని యచ్చటఁ గపిలునికి వందనం బాచరించి యిట్లనియె. | 849 |
| సీ. |
చతురాత్మ! విను మాత్మకృతము లైనట్టి యమంగళ భూత కర్మంబు లనెడి దావాగ్ని శిఖలచే దందహ్యమానులై నట్టి జీవులు దుదముట్ట లేక పాయక సంసారబద్ధులై యుందురు బహుళ కాలమ్మిట్లు పరఁగుచుండ సకల దేవతలు బ్రసన్నత నొందఁగ బహుజన్మ పరిచయ ప్రాప్తయోగ |
|
| తే. |
చిరసమాధి తపోనిష్ఠచే వివిక్త, దేశముల యోగిజనములు ధృతుల నే మ హానుభావు విలోకింతు రట్టి దివ్య, పురుషరత్నంబ నా యింటఁ బుట్టి తీవు. |
850 |
| వ. | మఱియు సంసారచక్ర పరిభ్రామ్యమాణుల మగుచు గ్రామ్యుల మయిన మా వర్తనంబులను గణింపక మదీయ గృహంబునం బూర్వంబునం బ్రతిశ్రుతంబు లయిన భవదీయ వాక్యంబులు దప్పకుండ ననుగ్రహింప నుదయించి తని వెండియు నిట్లనియె. | 851 |
| క. |
తలపోయఁగ నప్రాకృత, బలయుక్త చతుర్భుజాది భవదవతారం బులు నీ కనురూపములై, పొలుపొందుం గాదె పరమపురుష! మహాత్మా! |
852 |
| వ. | అదియునుం గాక. | 853 |
| క. |
అనయము భవదీయాశ్రిత, జన సంరక్షణముకొఱకు సమ్మతితోఁ దా ల్చిన మానవ రూపంబులు, ననురూపము లగును గాదె హరి! నీ కెపుడున్. |
854 |
| క. |
సుమహిత తత్త్వజ్ఞానా, ర్థము విద్వజ్జనగణంబు దవిలి నమస్కా రము లోలిఁ జేయు పదపీ, ఠము గల నినుఁ బొగడ వశమె! ఠవణిల్లంగన్. |
855 |
| సీ. |
సమధిక షడ్గుణైశ్వర్య కారణుఁడవు పరమేశ్వరుండవు, ప్రకృతి పురుష మహదహంకార తన్మాత్ర తత్‌క్షోభక హేతు కాలాత్మ విఖ్యాత ధృతివి, జగదాత్మకుఁడవు చిచ్ఛక్తివి నాత్మీయ జఠర నిక్షిప్త విశ్వప్రపంచ మును గల సర్వజ్ఞ మూర్తివి, స్వచ్ఛంద శక్తియుక్తుండవు, సర్వసాక్షి |
|
| తే. |
వగుచుఁ గపిలాఖ్యఁ దనరారు నట్టి నీకు, ననఘ! మ్రొక్కెదఁ, బుత్త్రుండ వగుచు నీవు నాకుఁ బుట్టిన కతన ఋణత్రయంబు, వలనఁ బాసితి, నిఁక భక్తవరద! నేను. |
856 |
| తే. |
మానితవ్రత యోగసమాధి నియతిఁ, జెంది భవదీయ పాదారవింద యుగము డెందమునఁ జేర్చి శోకంబులందుఁ దొలఁగి, సంచరించెద నంచితస్థలములందు. |
857 |
| క. |
అని యిట్లు విన్నవించిన, మునిపుంగవుఁ డైన కర్దముని వచనంబుల్ విని భగవంతుం డగు న, య్యనఘుఁడు గపిలుండు వలికె నర్మిలి దోఁపన్. |
858 |
| సీ. |
నా చేతఁ బూర్వంబునం బ్రతిశ్రుతమైన వచనముల్ దప్పక వరమునీంద్ర! నీ యింటఁ బుట్టితి, నిర్హేతుకస్థితి భూరిదయా గుణంబున నవాప్త సకలకాముఁడ, నేను సన్మునివేషంబు ధరియించుటెల్ల నాకొఱకుఁ గాదు, విను మహాత్మకులైన మునులకుఁ బరమాత్మ, గురు సద్వివేకంబు నరసి చూపు |
|
| తే. |
తత్త్వబోధంబుకొఱకును దాల్పఁబడిన, యంచిత వ్యక్తమార్గ మైనట్టి దేహ మని తలంపుము, మత్పదధ్యాన భక్తి, ధీపరాయణ మహిమంబు దేజరిల్ల. |
859 |
| క. |
సమధిక నిష్ఠం గృతయో, గమునన్ సన్న్యస్త సకల కర్ముఁడవై మో హముఁ బాసి భక్తిచే మో, క్షముకై భజియింపు నను వికారరహితుఁడై, |
860 |
| క. |
ననుఁ బరమేశుఁ బరంజ్యో, తిని ననఘు ననంతు దేవదేవు సకలభూ తనికాయ గుహాశయు నా, ద్యుని నజు నాద్యంతశూన్యు దురితవిదూరున్. |
861 |
| క. |
తిరముగ భవదీయాంతః, కరణ సరోజాత కర్ణికాతలమున సు స్థిరుఁ జేసి యింద్రియంబుల, నిరసించి మనోఽంబకమున నెఱిఁ గను మనఘా! |
862 |
| వ. | అట్లేని. | 863 |
| క. |
తనరిన మోక్షము నొందెద, వని పలికినఁ గర్దముండు నమ్మునికులచం ద్రుని వలగొని వందనములు, ఘనముగ నతిభక్తిఁ జేసి కౌతుక మలరన్. |
864 |
| క. |
మునిగణ సేవిత మగు వన, మునకుం జని యందు మౌనమున నిస్సంగుం డును వహ్నిరహితుఁ డనికే, తనుఁడై యాత్మైక శరణ తత్పరుఁ డగుచున్. |
865 |
| వ. | పరబ్రహ్మంబుఁ జిత్తంబున నిల్పి యహంకారంబు విడిచి మమత్వంబు నిరసించి దయాగుణంబునం జేసి సకల భూతంబులందు సమత్వంబు భజియించి శాంత శేముషీగరిష్ఠుం డగుచు నిస్తరంగంబగు వార్ధి చందంబున ధీరుండై నిఖిల ప్రపంచంబును వాసుదేవమయంబుఁగాఁ దలంచుచు భక్తి యోగంబున భాగవతగతిం బొందె నని చెప్పి వెండియు మైత్రేయుండు విదురునిం గనుంగొని కర్దముండు వనంబునకుం జనిన యనంతరంబ మాతృవత్సలుం డయిన కపిలుండు బిందుసరంబున వసియించి యుండ దేవహూతి తత్త్వమార్గాగ్రదర్శకుం డయిన సుతునిం గనుంగొని బ్రహ్మవచనంబులు దలంచుచు నిట్లనియె. | 866 |