| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| వ. | ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును, హృదయచాంచల్యమాన తామసుండును, దామసగుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందుఁజూపు మని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశదిశలను మిడుంగుఱులు చెదఱం జిటిలి పెటిలిపడి బంభజ్యమానం బగు నమ్మహా స్తంభంబు వలనఁ బ్రళయ వేళా సంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరజోఘుష్యమాణ మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోషనికాశంబులైన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్య మానంబు లయి యెగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు సేసి నిండినం బట్టు సాలక దోదూయమాన హృదయంబులయి పరవశంబులయి పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబుల తోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ, బ్రపుల్ల పద్మయుగళ సంకాశ భాసురచక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారుచరణతలుండును, జరణచంక్రమణఘనవినమిత విశ్వ విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండమహోరు స్తంభ యుగళుండును, ఘణ ఘణాయమాన మణి కింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీరనాభి వివరుండును, ముష్టిపరిమేయ వినుత తనుతర స్నిగ్ధమధ్యుండును, గులాచలసాను భాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగతనయనచకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధరశృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకనత భుజార్గళుండును, మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును, ద్రివళీయుత శిఖరిశిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, బ్రకంపన కంపిత పారిజాత పాదపపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును, శరత్కాల మేఘజాలమధ్య ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, గల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరలతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును, మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపులవక్త్ర నాసికా వివరుండును, నాసికావివర నిస్సరన్నిబిడ నిశ్శ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును, బూర్వపర్వత విద్యోతమాన ఖద్యోతమండల సదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును, శక్రచాప సురుచిరోదగ్ర మహా భ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును, ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, సటాజాలసంచాలన సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వకర్ణుండును, మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును, బర్వాఖర్వ శిశిరకిరణ మయూఖగౌర తనూరుహుండును, నిజ గర్జానినాద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణ కోటరుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును, దేహ ప్రభాపటల నిర్మథ్యమాన పరిపంథి యాతుధాన నికురుంబ గర్వాంధ కారుండును, బ్రహ్లాద హిరణ్యకశిపురంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నయిన శ్రీ నృసింహదేవుం డావిర్భవించినం గనుంగొని. | 285 |
| క. |
నరమూర్తి గాదు, కేవల, హరిమూర్తియుఁగాదు మానవాకారముఁ గే సరియాకారము నున్నది, హరిమాయారచితమగు యథార్థము చూడన్. |
286 |
| ఉ. |
తెంపున బాలుఁడాడిన సుధీరత సర్వగతత్వముంబ్రతి ష్ఠింపఁదలంచి యిందు నరసింహశరీరముఁదాల్చి చక్రి శి క్షింపఁగ వచ్చినాఁడు హరిచే మృతియంచుఁదలంతు నైన నా సొంపును బెంపు నందఱును జూడఁజరింతు, హరింతు శత్రువున్. |
287 |