పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము సప్తమస్కంధము
త్రిపురాసుర సంహారము
క. బహుమాయుఁడైన మయుచే, విహతంబగు హరుని యశము విఖ్యాత జయా
వహముగ నీ భగవంతుఁడు, మహితాత్ముఁడు ము న్నొనర్చె మనుజవరేణ్యా!
387
వ. అనిన ధర్మనందనుం డిట్లనియె. 388
క. ఏ కర్మంబున విభుఁ డగు, శ్రీ కంఠుని యశము మయునిచే సుడివడియెన్‌?
వైకుంఠుఁడెవ్విధంబునఁ, గైకొని తత్కీర్తి చక్కఁగా నొనరించెన్‌?
389
వ. అనిన నారదుం డి ట్లనియె, 390
క. చక్రాయుధ బలయుతు లగు, శక్రాదుల కోహటించి శమమున నసురుల్‌
సక్రోధంబున నరిగిరి, విక్రమములు మాని మయుని వెనుకకు నధిపా!
391
వ. ఇట్లు రక్కసులు దన వెనుకఁ జొచ్చిన మాయా నిలయుండును దుర్నయుండును నైన మయుండు దన యోగబలంబున నయోరజత సువర్ణమయంబులై యెవ్వరికిని లక్షింపరాని గమనాగమనంబులు వితర్కింపరాని కర్కశపరిచ్ఛదంబులును గలిగిన త్రిపురంబుల నిర్మించి యిచ్చిన నక్తంచరు లందఱు నందుఁ బ్రవేశించి కామసంచారులై పూర్వవైరంబుఁ దలంచి సనాయకంబులయిన లోకంబుల నస్తోకంబయిన నిజబలాతిరేకంబున శోకంబు నొందించిన. 392
క. లోకాధినాథులెల్లను, శోకాతురు లగుచు శరణు సొచ్చిరి దుష్టా
నీక విదళనాకుంఠున్‌, శ్రీకంఠున్‌ భువనభరణచిత్తోత్కంఠున్‌.
393
వ. ఇట్లు సకల లోకేశ్వరుండగు మహేశ్వరుం జేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకుళించి. 394
క. త్రిపురాలయులగు దానవు, లపరాజితు లగుచు మాకు నశ్రాంతంబున్‌
వపురాదిపీడఁజేసెద, రపరాధకులను వధింపు మగజాధీశా!
395
క. దీనులము గాక యుష్మద, ధీనులమై యుండు మేము దేవాహిత దో
ర్లీనుల మైనారము బల, హీనుల మగు మమ్ముఁగావు మీశాన! శివా!
396
వ. అనిన భక్తవత్సలుండగు పరమేశ్వరుండు శరణాగతులైన గీర్వాణుల వెఱవకుండుఁడని దుర్వార బలంబున బాణాసనంబుఁ గేల నందికొని యొక్క దివ్యబాణంబు సంధించి త్రిపురంబుల పయినేసిన మార్తాండ మండలంబున వెలువడు మయూఖజాలంబుల చందంబునఁ దద్బాణంబువలన దేదీప్యమానంబులై యనేక బాణసహస్రంబులు సంభవించి భూనభోంతరాళంబులు నిండి మండి తెప్పలుగాఁ గుప్పలుగొని త్రిపురంబుల పయిఁ గప్పె, నప్పుడు తద్బాణపావక హేతి సందోహ దందహ్యమానులై గతాసులైన త్రిపురపుర నివాసులం దెచ్చి మహాయోగియైన మయుండు సిద్ధరసకూపంబున వైచిన. 397
క. సిద్ధామృత రస మహిమను, శుద్ధ మహావజ్రతుల్య శోభితతనులై
వృద్ధింబొందిరి దానవు, లుద్ధతనిర్ఘాతపావకోపము లగుచున్‌.
398
క. కూపామృతరససంగతి, దీపితులై నిలిచియున్న దేవాహితులన్‌
రూపించి చింత నొందెడు, గోపధ్వజుఁజూచి చక్రి కుహనాన్వితుఁడై.
399
శా. ఉత్సాహంబున నొక్కపాఁడి మొదవై యూథంబు ఘ్రాణించుచున్‌
వత్సంబై తన వెంట బ్రహ్మ నడువన్‌ వైకుంఠుఁడేతెంచి యు
ద్యత్సత్త్వంబునఁగూపమధ్యరసముంద్రావెన్‌ విలోకించుచుం
దత్సౌభాగ్యనిమగ్నులై మఱచి రా దైత్యుల్‌ నివారింపఁగన్‌.
400
వ. ఇట్లు విష్ణుండు మోహనాకారంబున ధేనువయి త్రిపురమధ్య కూపామృత రసంబు ద్రావిన నెఱింగి శోకాకుల చిత్తులయిన రసకూపపాలకులంజూచి మహాయోగియైన మయుండు వెఱఁగు పడి, దైవగతిం జింతించి శోకింపక యిట్లనియె. 401
ఆ. అమరులైన దనుజులైనను నరులైన, నెంత నిపుణులైన నెవ్వరైన
దైవికార్థచయముఁదప్పింపఁగా లేరు, వలదు దనుజులార! వగవ మనకు!
402
వ. అని పలికె. అంత విష్ణుండు నైజంబులైన ధర్మ జ్ఞాన విద్యాతపో విరక్తి సమృద్ధి క్రియాశక్తి విశేషంబుల శంభునికిఁ బ్రాధాన్యంబు సమర్పించి రథ సూత కేతువర్మ బాణాసన ప్రముఖ సంగ్రామ సాధనంబులు సేసినం గైకొని. 403
మ. శరియై కార్ముకియై మహాకవచియై సన్నాహియై వాహియై
సరథుండై సనియంతయై సబలుఁడై సత్కేతనచ్ఛత్త్రుఁడై
పరమేశుండొక బాణమున్‌ విడిచెఁదద్బాణానలజ్వాలలం
బురముల్‌ గాలె ఛటచ్ఛటధ్వని నభోభూమధ్యముల్‌ నిండఁగన్‌.
404
వ. ఇట్లు హరుండు దురవగాహంబులైన త్రిపురంబుల నభిజిన్ముహూర్తంబున భస్మంబుసేసి కూల్చిన, నమర గరుడ గంధర్వ సిద్ధ సాధ్య యక్ష వల్లభులు వీక్షించి, జయ జయ శబ్దంబులు సేయుచుఁ గుసుమ వర్షంబులు వర్షించిరి, ప్రజలు హర్షించిరి, బ్రహ్మాదులు కీర్తించి, రప్సరసలు నర్తించిరి, దివ్యకాహళ దుందుభి రవంబులును, మునిజనోత్సవంబులును బ్రచురంబు లయ్యె, నిట్లు విశ్వజనీనంబగు త్రిపురాసుర సంహారంబున నఖిలలోకులును సంతసిల్లియుండ నయ్యవసరంబున. 405
ఆ. తృణకణముల భంగిఁద్రిపురంబుల దహించి, పరముఁడవ్యయుండు భద్రయశుఁడు
శివుఁడు పద్మజాదిజేగీయమానుఁడై, నిజనివాసమునకు నెమ్మిఁజనియె.
406
వ. ఇట్లు నిజమాయా విశేషంబున మర్త్యలోకంబున విడంబించు చున్న విష్ణుని పరాక్రమ విధానంబులు మునిజన వంద్యమానంబులై, సకల లోక కల్యాణ ప్రదానంబులై యుండు ననిన విని నారదునకు ధర్మనందనుం డిట్లనియె. 407
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - saptama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )