| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| క. |
మునివల్లభుఁడజగరుఁడను, సునయుండు హిరణ్యకశిపు సూనుండును ము న్నొనరించిన సంవాదము, విను మీ యర్థంబునందు వెలయు నరేంద్రా! |
430 |
| వ. | తొల్లి భగవత్ప్రియుండయిన ప్రహ్లాదుండు కతిపయామాత్య సమేతుండయి లౌకికతత్త్వంబు నెఱింగెడి కొఱకు లోకంబుల సంచరించుచు నొకనాఁడు కావేరీతీరంబున సహ్యపర్వత తటంబున ధూళి ధూసరితంబు లయిన కరచరణాద్యవయవంబుల తోడ గూఢంబైన నిర్మల తేజంబుతోఁ గర్మాకారవచోలింగ వర్ణాశ్రమాదుల నెవ్వరికి నెఱుంగఁబడక నేల నిద్రించుచు నజగర వ్రత ధరుండైన మునిం గని డాయం జని విధివత్ప్రకారంబున నర్చించి మునిచరణంబులకు శిరంబు మోపి మ్రొక్కి యతని చరిత్రంబు దెలియ నిశ్చయించి యి ట్లనియె. | 431 |
| సీ. |
భూమి నుద్యోగియై భోగియై యుండెడి, నరునికైవడి మునినాథ! నీవు ఘనశరీరము దాల్చి కదలవు, చిత్ర, ముద్యమయుక్తునకుఁ గాని ధనము లేదు, ధనవంతునకుఁగాని తగు భోగములు లేవు, భోగికి గాని సంపూర్ణమైన తనువు లే, దుద్యోగధనభోగములు లేక నేల నూరక వడి నిద్ర వోవు |
|
| ఆ. |
నీకు నెట్లు గలిగె నిరుపమదేహంబు?, సముఁడ వార్యుఁడవు, విశారదుఁడవు, బుద్ధినిధివి, జనులఁబొగడవు, దెగడవు, నిద్ర ప్రతిదినంబు నిలుపనేల? |
432 |
| వ. | అని యిట్లు ప్రహ్లాదుం డడిగిన వికసితముఖుండయి మునీంద్రుండు తదీయ మధురాలాపసుధారస ప్రవాహంబులు కర్ణంబులఁబరిపూర్ణంబులైన నతని నవలోకించి యిట్లనియె. | 433 |
| సీ. |
ఆంతరంగికదృష్టి నంతయు నెఱుఁగుదు, వార్యసమ్మతుఁడ వీ వసురవర్య! విశ్వజంతువుల ప్రవృత్తి నివృత్తి లక్షణములు నీ యెఱుంగనివి లేవు, భగవంతుఁడగు హరి పాయక నీ మనో వీథి రాజిల్లుచు వెలుఁగుఱేని క్రమమున బహుళాంధకారంబుఁబరిమార్చుఁ బరమసాత్త్వికుఁడవు, భద్రబుద్ధి |
|
| ఆ. |
వైన నీవు నన్ను నడిగెదు గావున, విన్న ధర్మమెల్ల విస్తరింతు, నిన్నుఁజూడఁగలిగె నీ తోడిమాటల, నాత్మశుద్ధి గలిగె ననఘచరిత! |
434 |
| వ. | వినుము, ప్రవాహకారిణియై విషయంబులచేతం బూరింపరాని తృష్ణచేతం బడి కర్మంబులఁ బరిభ్రామ్యమాణుండనైన నేను నానావిధ యోనులందుఁ బ్రవేశించుచు, వెడలుచు నెట్టకేలకు మనుష్యదేహంబు ధరియించి యందు ధర్మంబున స్వర్గ ద్వారంబును, నధర్మంబున శునకసూకరాది తిర్యగ్జంతు యోని ద్వారంబుల నొంది క్రమ్మఱ మనుష్యుండై పుట్టవలయు నని వివేకించి సుఖరక్షణ దుఃఖమోక్షణంబుల కొఱకు ధర్మంబు సేయు దంపతుల వ్యవహారంబు గని సర్వక్రియా నివృత్తి గలిగిన జీవుండు స్వతంత్రుఁడై ప్రకాశించునని నిర్ణయించి భోగంబులు మనోరథ జాత మాత్రంబులు గాని, శాశ్వతంబులు గావని పరీక్షించి నివృత్తుండనై యుద్యోగంబు లేక నిద్రించుచుఁ బ్రారబ్ధభోగంబుల ననుభవించుచు నుండుదు, నివ్విధంబునఁ దనకు సుఖరూపంబైన పురుషార్థంబు దనయందుఁ గలుగుట యెఱుఁగక పురుషుండు శైవాలజాల నిరుద్ధంబులైన శుద్ధజలంబుల విడిచి యెండమావులు జలంబులని పాఱెడు మూఢుని వడువున సత్యంబుగాని ద్వైతంబుఁ జొచ్చి ఘోర సంసార చక్ర పరిభ్రాంతుండైయుండు దైవతంత్రంబులైన దేహాదుల చేత నాత్మకు సుఖంబును దుఃఖనాశనంబునుం గోరుచు నిరీశుండైన వాని ప్రారంభంబులు నిష్ఫలంబులగు, నదియునుంగాక మర్త్యునకు ధనంబు ప్రాప్తంబయిన నది దుఃఖకరంబుగాని సుఖకరంబు గాదు, లోభవంతులయిన ధనవంతులు నిద్రాహారంబులు లేక రాజచోర యాచక శత్రుమిత్రాది సర్వస్థలంబులందును శంకించుచు దానభోగంబులు మఱచి యుండుదురు, ప్రాణార్థవంతులకు భయంబు నిత్యంబు, శోకమోహ భయక్రోధరాగశ్రమాదులు వాంఛామూలంబులు, వాంఛ లేకుండవలయును. | 435 |
| మ. |
సరఘల్ గూర్చిన తేనె మానవులకున్ సంప్రాప్తమైనట్లు లో భ రతుల్ గూర్చిన విత్తముల్ పరులకుంబ్రాపించుఁబ్రాప్తాశియై తిరుగంబోని మహోరగంబు బ్రదుకున్ దీర్ఘాంగమై యుండియుం జిరకాలంబును వాని వర్తనములం జింతించి యేకాంతినై |
436 |
| క. |
అజగరమును జుంటీఁగయు, నిజ గురువులుగాఁదలంచి నిశ్చింతుఁడనై విజనస్థలిఁగర్మంబుల, గజిబిజి లేకున్నవాఁడ గౌరవవృత్తిన్. |
437 |
| సీ. |
అజినవల్కల దుకూలాంబరంబులు గట్టి యైన గట్టక యైనఁ నలరుచుందు నాందోళికారథ హయనాగముల నెక్కి యైన నెక్కకయైన నరుగుచుందు, గర్పూరచందన కస్తూరికా లేప మైన భూరజమైన నలఁదుచుందు, భర్మశయ్యల నైనఁబర్ణశిలాతృణ భస్మంబు లందైనఁ బండుచుందు, |
|
| ఆ. |
మానయుక్తమైన మానహీనంబైనఁ, దీయనైన మిగులఁ దిక్తమైనఁ గుడుతు సగుణమైన గుణవర్జితంబైన, నల్పమైనఁజాల నధికమైన. |
438 |
| క. |
లే దని యెవ్వరి నడుగను, రా దని చింతింపఁబరులు రప్పించినచోఁ గా దని యెద్దియు మానను, ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్. |
439 |
| క. |
నిందింపఁబరుల నెన్నఁడు, వందింప ననేకపీడ వచ్చిన, మది నా క్రందింప, విభవముల కా, నందింపఁబ్రకామవర్తనంబున నధిపా! |
440 |
| వ. | ఇట్లు గోరిక లేక యొక్క సమయంబున దిగంబరుండనై పిశాచంబు చందంబున వర్తించుచుఁ బెక్కు దినంబులం గోలెఁ బెనుఁ బాఁప వర్తనంబుఁ గైకొని నిమీలిత లోచనత్వంబున నేకాంత భావంబున విష్ణునియందు వికల్పంబును భేదగ్రాహక చిత్త వృత్తులఁ జిత్తంబు నర్థరూప పరిభ్రమణంబు గల మనంబు నందు మనంబును, నహంకారంబునందు నహంకారంబును, మాయయందు మాయను, నాత్మానుభూతియందు లయంబు నొందించి సత్యంబు దర్శించుచు విరక్తినొంది స్వానుభవంబున నాత్మస్థితుండనై యుండుదు. నీవు భగవత్పరుండవు గావున రహస్యంబైన పరమహంస ధర్మంబు స్వానుభవ గోచరంబైన తెఱంగున నీకు హృద్గోచరంబగునట్లు సెప్పితి ననిన విని. | 441 |
| క. |
ఘను నజగరముని వల్లభు, దనుజేంద్రుఁడు పూజసేసి తగ వీడ్కొని నె మ్మనమున సంతోషించుచుఁ, జనియెన్ నిజగేహమునకు శశికులతిలకా! |
442 |
| వ. | అనిన యుధిష్ఠిరుం డిట్లనియె. | 443 |
| క. |
ననుబోఁటి జడగృహస్థుఁడు, మునివల్లభ! యిట్టి పదవి మోదంబున నే యనువునఁజెందును? వేగమ, వినిపింపుము నేఁడు నాకు విజ్ఞాన నిధీ! |
444 |
| వ. | అనిన నారదుం డిట్లనియె, గృహస్థుం డయినవాఁడు వాసుదేవార్పణంబుగా గృహోచితక్రియ లనుసంధించుచు మహామునుల సేవించి వారల వలన నారాయణ దివ్యావతార కథా శ్రవణంబు సేయుచు, నయ్యై విహితకాలంబుల శాంతజనులం గూడి మెలంగుచుఁ, బుత్ర మిత్ర కళత్రాది సంగంబులు గలల వంటివని యెఱుంగుచు లోపల నాసక్తి లేక సక్తుని కైవడి వెలుపలఁ బురుషకారంబు లొనర్చుచుఁ దగులంబులేక విత్తంబు లిచ్చి జనక సుత సోదర సఖి జ్ఞాతి జనుల చిత్తంబులు సమ్మదాయత్తంబులు గావించుచు, ధనధాన్య నిధాన దైవలబ్ధంబుల వలన నభిమానంబు మాని యనుభవించుచు, గృహక్షేత్రంబులఁ జొచ్చి యుదరపూరణ మాత్రంబు దొంగిలినవాని దండింపక భుజగ మృగ మూషక మర్కట మక్షికా ఖరోష్ట్రంబుల హింసింపక పుత్త్రులభంగి నీక్షించుచు, దేశకాల దైవంబుల కొలందిని ధర్మార్థకామంబులఁ బ్రవర్తించుచు, శునక పతిత చండాలాదులకైన భోజ్యపదార్థంబులు దగిన భంగి నిచ్చుచు నిజవృత్తి లబ్ధంబులగు నశనాదులచేత దేవ ఋషి పితృభూత మానవుల సంతర్పించుచుఁ బంచమహాయజ్ఞావశేషంబుల నంతర్యామి పురుషయజనంబును నాత్మజీవనోపాయంబును సమర్థించుచు నుండవలయు. | 445 |
| ఆ. |
జనకగురులనైనఁజంపు నర్థమునకై, ప్రాణమైన విడుచు భార్యకొఱకు, నట్టిభార్యఁబురుషుఁడతిథిశుశ్రూష సే, యించి గెలుచు నజితు నీశునైన. |
446 |
| ఆ. |
పరముఁడీశ్వరుండు బ్రాహ్మణముఖమున, నాహరించి తుష్టుఁడయిన భంగి నగ్నిముఖమునందు హవ్యరాసులు గొని, యైనఁదుష్టి నొందఁడనఘచరిత! |
447 |
| వ. | కావున గృహస్థుండు బ్రాహ్మణులందును, దేవతలందును మర్త్యపశు ప్రముఖ జాతులందును నంతర్యామియు, బ్రాహ్మణాననుండును నైన క్షేత్రజ్ఞునందు నయ్యై కోరికలు సమర్పించి సంతర్పణంబు సేయవలయు, భాద్రపదంబునఁ గృష్ణ పక్షంబునందును, దక్షిణోత్తరాయణంబులందును, రేయింబగలు సమమైన కాలంబులందును, వ్యతీపాతంబునందును, దినక్షయంబులందును, సూర్యచంద్రగ్రహణంబు లందును, శ్రవణద్వాదశి యందును, వైశాఖ శుక్ల తృతీయయందును, గార్తిక శుక్లనవమియందును, హేమంత శిశిరంబులలోన నాలుగష్టకలందును, మాఘశుక్ల సప్తమియందును, జన్మ నక్షత్రంబుల తోడం గూడిన పున్నమలందును, ద్వాదశితోడం గూడిన యుత్తరాత్రయ శ్రవణానూరాధలందును, నుత్తరాత్రయ సహితంబు లయిన యేకాదశీ తిథులందును, జన్మ నక్షత్ర యుక్త దివసంబులందును, మఱియుఁ బ్రశస్తకాలంబు లందును, జననీ జనక బంధుజనులకు శ్రాద్ధంబులును, జపహోమస్నాన వ్రతంబులును, దేవబ్రాహ్మణ సమారాధనంబులును, నాచరింపవలయు, భార్యకుఁ బుంసవనాదికంబును, నపత్యంబునకు జాత కర్మాదికంబును, దనకు యజ్ఞదీక్షాదికంబును, బ్రేతజనులకు దహనాదికంబును, మృతదివసంబున సాంవత్సరికంబును జరుపవలయు. | 448 |
| మ. |
విను, మే దేశములన్ దయా గుణ తపో విద్యాన్వితంబైన వి ప్రనికాయంబు వసించు, నే స్థలములన్ భాగీరథీ ముఖ్య వా హిను లుండున్, హరిపూజ లెయ్యెడల భూయిష్ఠప్రకారంబులం దనరున్ భూవర! యట్టి చోటులఁ దగున్ ధర్మంబులంజేయఁగన్. |
449 |
| క. |
హరియందు జగము లుండును, హరిరూపము సాధుపాత్రమం దుండు, శివం కరమగు పాత్రము గలిగిన, నరయఁగ నది పుణ్యదేశ మనఘచరిత్రా! |
450 |
| వ. | మఱియుఁ గురుక్షేత్రంబును గయాశీర్షంబును బ్రయాగంబును బులహాశ్రమంబును నైమిశంబును ఫాల్గునంబును సేతువును బ్రభాసంబును గుశస్థలియును వారణాసియు మధురాపురియును బంపాబిందు సరోవరంబులును నారాయణాశ్రమంబును సీతారామాశ్రమంబును మహేంద్ర మలయాదులైన కులాచలంబులును హరిప్రతిమార్చన ప్రదేశంబులును హరిసేవాపరులైన పరమభాగవతులు వసించెడు పుణ్యక్షేత్రంబులును శుభకాముండైన వాఁడు సేవింపవలయు. | 451 |
| ఆ. |
భూవరేంద్ర! యిట్టి పుణ్యప్రదేశంబు, లందు నరుఁడు సేయునట్టి ధర్మ మల్పమైన నది సహస్రగుణాధిక, ఫలము నిచ్చు హరికృపావశమున. |
452 |
| వ. | వినుము, చరాచరం బయిన విశ్వమంతయు విష్ణుమయం బగుటంజేసి పాత్ర నిర్ణయ నిపుణులైన విద్వాంసులు నారాయణుండు ముఖ్యపాత్రం బని పలుకుదురు. దేవఋషులు, బ్రహ్మ పుత్రులైన సనకాదులును నుండ భవదీయ రాజసూయంబున నగ్రపూజకు హరి సమ్మతుం డయ్యె ననేక జంతు సంఘాత సంకీర్ణంబైన బ్రహ్మాండ పాదపంబునకు నారాయణుండు మూలంబు, తన్నిమిత్తంబున నారాయణ సంతర్పణంబు సకల జంతు సంతర్పణంబని యెఱుంగుము ఋషి నర తిర్యగమర శరీరంబులు పురంబులు, వానియందుఁ దారతమ్యంబులతోడ జీవరూపంబున భగవంతుండయిన హరి వర్తించుటం జేసి పురుషుం డనఁ బ్రసిద్ధుఁ డయ్యె నందుఁ దిర్యగ్జాతుల కంటె నధికత్వంబు పురుషునియందు విలసిల్లుటం జేసి పురుషుండు పాత్రంబు పురుషులలోన హరితనువైన వేదంబును ధరించుచు సంతోష విద్యాతపోగరిష్ఠుండైన బ్రాహ్మణుండు పాత్రంబు బ్రాహ్మణులలోన నాత్మజ్ఞాన పరిపూర్ణుండయిన యోగి ముఖ్య పాత్రం బని పలుకుదురు పరస్పర పాత్రంబులకు సహింపని మనుష్యులకుఁ బూజ నార్థంబుగాఁ ద్రేతాయుగంబునందు హరిప్రతిమలు గల్పింపఁబడియెఁ, గొందఱు ప్రతిమార్చనంబు సేయుదురు పాత్ర పురుష ద్వేషులైన వారలకు నట్టి ప్రతిమార్చనంబు ముఖ్యార్థప్రదంబు గాదు మందాధికారులకుఁ బ్రతిమార్చనంబు పురుషార్థప్రదం బగును | 453 |
| ఆ. |
అఖిలలోకములకు హరి దైవతము చూడ, హరికి దైవతము ధరాధినాథ! పదపరాగలేశపం క్తిచేఁ ద్రైలోక్య, పావనంబు సేయు బ్రాహ్మణుండు. |
454 |
| వ. | అట్టి బ్రాహ్మణ జనులందుఁ గర్మనిష్ఠులు, దపోనిష్ఠులు, వేదశాస్త్రనిష్ఠులు, జ్ఞానయోగ నిష్ఠులునై కొందరు వర్తింతు, రందు జ్ఞాననిష్ఠునికి ననంత ఫలకామియైన గృహస్థుండు పితృజనుల నుద్దేశించి కవ్యంబులును, దేవతల నుద్దేశించి హవ్యంబులును బెట్టుట ముఖ్యంబు, దైవకార్యంబునకు నిరువురనైన నొకరినైనఁ బితృకార్యంబునకు మువ్వురనైన నొకరినైన భోజనంబు సేయింప వలయు, ధనవంతునకైనను శ్రాద్ధవిస్తారంబు కర్తవ్యంబు కాదు. దేశ కాలప్రాప్త కందమూల ఫలాదికం బయినవారి నై వేద్యంబున విధిచోదిత ప్రకారంబుగా శ్రద్ధతోడఁ బాత్రంబునందుఁ బెట్టిన యన్నంబు కామదంబయి యక్షయ ఫలకారియగు, ధర్మతత్త్వవేదియైన వాఁడు శ్రాద్ధంబులందు మాంస ప్రదానంబు సేయక భక్షింపక చరింపవలయుఁ; గందమూలాది దానంబున నయ్యెడి ఫలంబు పశుహింసనంబున సంభవింపదు, ప్రాణిహింస సేయక వర్తించుటకంటె మిక్కిలి ధర్మంబు లేదు, యజ్ఞవిదులైన ప్రోడలు నిష్కాములయి బాహ్యకర్మంబులు విడిచి యాత్మజ్ఞాన దీపంబులందు గర్మమయంబు లయిన యజ్ఞంబుల నాచరింతురు. | 455 |
| క. |
పశువులఁబొరిగొని మఖములు, విశదములుగఁజేయు బుధుని వీక్షించి తమున్ విశసనము సేయునో యని, క్రశిమన్ బెగడొందు భూతగణము నరేంద్రా! |
456 |
| వ. | అది గావున ధర్మవేది యయినవాఁడు దైవప్రాప్తంబు లయిన కందమూలాదికంబులచేత నిత్యనైమిత్తిక క్రియలఁ జేయవలయు, నిజధర్మ బాధకం బయిన ధర్మంబును, పరధర్మ ప్రేరితంబయిన ధర్మంబును, నాభాసధర్మంబును, బాషండ ధర్మంబును, గపటధర్మంబును ధర్మజ్ఞుండయిన వాఁడు మానవలయు, నైసర్గిక ధర్మంబు దురితశాంతి సమర్థంబగు, నిర్ధనుండు ధర్మార్థంబు యాత్రసేయుచునైన ధనంబు గోరవలదు, జీవనోపాయంబునకు నిట్టట్టుఁ దిరుగక కార్పణ్యంబు లేక జీవించు మహాసర్పంబు తెఱంగున సంతోషంబున నాత్మారాముండై యెద్దియుం గోరక బ్రదికెడి సుగుణునికిం గల సుఖంబు కామలోభంబుల దశదిశలం బరిధావనంబు సేయువానికి సిద్ధింపదు, పాదరక్షలు గలవానికి శర్కరాకంటకాదుల వలన భయంబు లేక మెలంగ నలవడుభంగిఁ గామంబుల వలన నివృత్తి గల వానికి నెల్ల కాలంబును భద్రంబగు, నుపస్థమునకును జిహ్వాదైన్యంబునకుఁ బురుషుండు గృహపాలక శునకంబుకైవడి సంచరించుచు సంతుష్టి లేక చెడు, సంతోషి గాని విప్రుని విద్యా తపో విభవ యశంబులు నిరర్థకంబులగు, నింద్రియ లోలత్వంబున జ్ఞానంబు నశించు, సకలభూలోక భోగంబుల భోగించియు దిగ్విజయంబు సేసియు బుభుక్షా పిపాసలవలనఁ గామపారంబును, హింసవలనఁ గ్రోధపారంబును జేరుట దుర్లభంబు, సంకల్పవర్జనంబునఁ గామంబును, గామవర్జనంబునఁ గ్రోధంబును, నర్థానర్థ దర్శనంబున లోభంబును, నద్వైతానుసంధానంబున భయంబును, నాత్మా నాత్మ వివేకంబున శోకమోహంబులును, సాత్త్విక సేవనంబున దంభంబును, మౌనంబున యోగాంతరాయంబును, శరీరవాంఛలేమిని హింసయు, హితాచరణంబున భూతజంబయిన దుఃఖంబును, సమాధిబలంబున దైవిక వ్యథయుఁ బ్రాణాయామాదికంబున మన్మథవ్యథయు, సాత్త్వికాహారంబున నిద్రయు, సత్త్వగుణంబున రజస్తమంబులును, నుపశమంబున సత్త్వంబును గురుభజన కుశలుఁడై శీలంబున జయింపవలయు. | 457 |
| క. |
హరిమహిమ దనకుఁజెప్పిన, గురువున్ నరుఁడనుచుఁదలఁచి కుంఠితభక్తిం దిరుగు పురుషుశ్రమ మెల్లను, గరిశౌచముక్రియ నిరర్థకంబగు నధిపా! |
458 |
| ఉ. |
ఈ వనజాతనేత్రుఁబరమేశు మహాత్ముఁబ్రధానపూరుషున్ దేవశరణ్యు సజ్జనవిధేయు ననంతుఁబురాణయోగి సం సేవితపాదపద్ముఁదమ చిత్తములన్ నరుఁడంచు లోకు లి చ్ఛావిధిఁజూచుచుండుదురు సన్మతి లేక నరేంద్రచంద్రమా! |
459 |
| వ. | వినుము షడింద్రియంబులలోన నొకటియందుఁ దత్పరులై యిచ్ఛాపూరణ విధానంబులఁ జరితార్థులమైతి మను వారలు ధారణాభ్యాస సమాధియోగంబుల సాధింపలేరు, కృషి ప్రముఖంబులు సంసార సాధనంబులు గాని మోక్షసాధనంబులు గావు, కుటుంబ సంగంబునఁ జిత్తవిక్షేపం బగుఁ, జిత్త విజయ ప్రయత్నంబున సన్న్యసించి సంగంబు వర్జించి మితంబయిన భిక్షాన్నంబు భక్షించుచు శుద్ధ వివిక్త సమప్రదేశంబున నొక్కచో నాసీనుండై సుస్థిరత్వంబునఁ బ్రణవోచ్చారణంబు సేయుచు రేచక పూరక కుంభకంబులఁ బ్రాణాపానంబుల నిరోధించి కామహతంబయిన చిత్తంబునఁ బరిభ్రమణంబు మాని కామ విసర్జనంబుసేసి మరలు నంతకు నిజనాసాగ్ర నిరీక్షణంబు సేయుచు నివ్విధంబున యోగాభ్యాసంబు సేయువాని చిత్తంబు కాష్ఠరహితంబైన వహ్ని తెఱంగున శాంతిఁ జెందుఁ, గామాదులచేత వేధింపంబడక ప్రశాంత సమస్త వృత్తం బయిన చిత్తంబు బ్రహ్మసుఖ సమ్మర్శనంబున లీనంబై మఱియు నెగయ నేరదు. | 460 |
| మ. |
ధరణీదేవుఁడు సన్న్యసించి యతియై ధర్మార్థకామంబులం బరివర్జించి పునర్విలంబమునఁదత్ప్రారంభి యౌనేని లో భ రతింగ్రక్కిన కూడు మంచి దనుచున్ భక్షించి జీవించు దు ర్నరుచందంబున హాస్యజీవనుఁడగున్ నానాప్రకారంబులన్. |
461 |
| క. |
మలమునఁగ్రిమియును బడు క్రియ, నిలఁబడు నొడ, లాత్మ గాదు హేయం బనుచుం దలఁతురు తద్‌జ్ఞులు, పొగడుదు, రలసత నొడ లాత్మ యనుచు నజ్ఞు లిలేశా? |
462 |
| ఆ. |
వ్రతము మానఁదగదు వడుగుఁగుఱ్ఱనికిని, గ్రియలు మానఁ దగదు గృహగతునికిఁ, దపసి కూర నుండఁదగదు, సన్న్యాసికిఁ, దరుణితోడి పొత్తు దగదు తగదు, |
463 |
| సీ. |
రథము మే నెల్ల, సారథి బుద్ధి, యింద్రియ గణము గుఱ్ఱములు, పగ్గములు మనము, ప్రాణాది దశవిధ పవనంబు లిరుసు, ధర్మాధర్మగతులు రథాంగకములు బహుళతరంబైన బంధంబు చిత్తంబు, శబ్దాదికములు సంచారభూము, లభిమాన సంయుతుండయిన జీవుఁడు రథి, ఘనతరప్రణవంబు కార్ముకంబు, |
|
| తే. |
శుద్ధజీవుండు బాణంబు, శుభదమైన, బ్రహ్మమంచితలక్ష్యంబు, పరులు రాగ భయ మద ద్వేష శోక లోభ ప్రమోహ, మాన మత్సర ముఖములు మానవేంద్ర! |
464 |
| వ. | ఇట్లు మనుష్య శరీర రూపంబయిన రథంబు దన వశంబు సేసికొని మహాభాగవత చరణకమల సేవానిశితంబయిన విజ్ఞాన ఖడ్గంబు ధరియించి శ్రీమన్నారాయణ కరుణావలోక బలంబున రాగాదిశత్రు నిర్మూలనంబు గావించి ప్రణవబాణాసనంబున శుద్ధజీవశరంబును సంధించి బ్రహ్మమనియెడు గుఱియందుఁ బడవేసి యహంకార రథికుండు రథికత్వంబు మాని నిజానందంబున నుండవలయు, నట్టి విశేషంబు సంభవింపని సమయంబున బహిర్ముఖంబు లయిన యింద్రియ ఘోటకంబులు బుద్ధి సారథి సహితంబులై స్వాభిమాన రథికుని ప్రమత్తత్వంబు దెలిసి ప్రవృత్తిమార్గంబు నొందించి విషయశత్రు మధ్యంబునంగూల్చిన. | 465 |
| ఆ. |
విషయశత్రులెల్ల విక్రాంతితోడ సా, రథిసమేతుఁడయిన రథికుఁబట్టి యుగ్రతిమిరమృత్యుయుతమగు సంసార, కూపమధ్యమందుఁగూల్తు రధిప! |
466 |
| వ. | వినుము వైదికకర్మంబు ప్రవృత్తంబును, నివృత్తంబును నన రెండు దెఱంగులయ్యె, నందుఁ బ్రవృత్తంబునఁ బునరావర్తనంబును, నివృత్తంబున మోక్షంబును సిద్ధించుఁ, బ్రవృత్తకర్మంబులోన నిష్టాపూర్తంబులన రెండు మార్గంబులు గల, వందు హింసా ద్రవ్యమయ కామ్యరూపంబులయిన దర్శ పూర్ణమాసపశు సుత వైశ్వదేవ బలిహరణ ప్రముఖంబులైన యాగాదికంబు లిష్టంబులు, దేవతాలయ వన కూప తటాక ప్రముఖంబులు పూర్తంబులు, ప్రవృత్తకర్మంబున దేహంబు విడిచి దేహాంతరారంభంబున దేహి హృదయాగ్రంబున వెలుంగు, వానితోడ నింద్రియంబులుంగూడ భూతసూక్ష్మయుక్తుండై ధూమ దక్షిణాయన కృష్ణపక్ష రాత్రి దర్శంబుల వలన సోమలోకంబుఁ జేరి భోగావసానంబున విలీనదేహుండై వృష్టి ద్వారంబునఁ గ్రమంబున నోషధి లతాన్న శుక్ల రూపంబులం బ్రాపించి భూమియందు జన్మించు, నిది పునర్భవ రూపంబయిన పితృమార్గంబు, నివృత్త కర్మనిష్ఠుం డయిన వాఁడు జ్ఞానదీప్తంబు లయిన యింద్రియంబులందుఁ గ్రియాయజ్ఞంబుల యజించి ఇంద్రియంబుల దర్శనాది సంకల్ప మూలంబయిన మనంబునందు వికారయుక్తంబయిన మనంబును, వాక్కునందు విద్యావిలక్షణమైన వాక్కును, వర్ణసముదాయంబు నందు వర్ణసముదాయంబును, నకారాది స్వరత్రయాత్మకం బయిన యోంకారంబునందు నోంకారంబును, బిందువందు బిందువును. నాదంబునందు నాదంబును, బ్రాణంబునందు ప్రాణంబును బ్రహ్మమందు నిలుపవలయును, దేవమార్గంబయిన యుత్తరాయణ శుక్ల పక్ష దివా ప్రాహ్ణ పూర్ణిమా రాకల వలన సూర్య ద్వారంబున బ్రహ్మలోకంబునందుఁ జేరి భోగావసానంబున స్థూలోపాధియైన విశ్వుండై సూక్ష్మంబునందు లయించి సూక్ష్మోపాధియైన తైజసుండై సూక్ష్మంబును గారణంబునందు లయించి, తుర్యుండై సూక్ష్మలయంబునందు శుద్ధాత్ముండై యివ్విధంబున ముక్తుం డగును. | 467 |
| ఆ. |
అమరనిర్మితంబులై యొప్పు పితృదేవ, సరణు లెవ్వఁ డెఱుఁగు శాస్త్రదృష్టి నట్టివాఁడు దేహియై మోహమున నొందఁ, డతిశయించు బుద్ధి నవనినాథ! |
468 |
| వ. | వినుము దేహాదులకుఁ గారణత్వంబున నాదియందును నవధికత్వంబున నంతమందును గలుగుచు బహిరంగంబున భోగ్యంబును నంతరంగంబును భోక్తయుఁ బరంబును నపరంబును జ్ఞానంబును జ్ఞేయంబును వచనంబును వాచ్యమును నప్రకాశంబును ప్రకాశంబును నైన వస్తువునకు వేఱొండు లేదు, ప్రతిబింబాదికంబు వస్తుతత్త్వంబునం జేసి వికల్పితంబై తలంపంబడు భంగి నైంద్రియకం బైన సర్వంబును నర్థత్వంబున వికల్పితంబయి తోఁచుంగాని పరమార్థంబు గాదు. దేహాదికంబులు మిథ్యాత్మకంబులు, వానికి హేతువులయిన క్షితి ప్రముఖంబులును మిథ్యాత్మకంబు లగుట సిద్ధంబు, పరమాత్మకు నవిద్యచేత నెంతదడవు వికల్పంబు దోఁచు నంత దడవును భ్రమంబునుం దోఁచు, నవిద్యానివృత్తియైన సర్వంబును మిథ్యయయి శాస్త్రవిధి నిషేధంబులు గల లోపల మేలుగన్న తెఱం గగు, భావాద్వైత క్రియాద్వైత ద్రవ్యాద్వైతంబులు మూఁడు గల, వందుఁ బటతంతు న్యాయంబునఁ గార్య కారణంబులందు వస్తు వొక్కటియై యుండు నని యెఱింగి, యేకత్వాలోచనంబు సేసి వికల్పంబు లేదని భావించుట భావాద్వైతంబు, మనోవాక్కాయ కృతంబులైన సర్వకర్మంబులను ఫలభేదంబు సేయక పరబ్రహ్మార్పణంబు సేయుట క్రియాద్వైతంబు, పుత్త్రమిత్రకళత్రాది సర్వప్రాణులకుం దనకును దేహంబునకుం బంచభూతాత్మకత్వంబున భోక్త యొక్కరుండను పరమార్థత్వంబున నర్థకామంబుల యెడ నైక్యదృష్టిం జేయుట ద్రవ్యాద్వైతంబు, నేర్పున నాత్మతత్త్వానుభవంబున నద్వైతత్రయంబును విలోకించి వస్తుభేదబుద్ధియుఁ గర్మభేదబుద్ధియు స్వకీయపరకీయబుద్ధియు స్వప్నంబులుగాఁ దలంచి ముని యైనవాఁడు మానవలయు. | 469 |
| క. |
వాదములు వేయు నేటికి?, వేదోక్తవిధింజరించు విబుధుఁడు గృహమం దాదరమున నారాయణ, పాదంబులు గొలిచి ముక్తిపదమున కేఁగున్. |
470 |
| శా. |
భూపాలోత్తమ!, మీరు భక్తిగరిమస్ఫూర్తిన్ సరోజేక్షణ శ్రీపాదాంబుజయుగ్మమున్ నియతులై సేవించి కాదే మహో గ్రాపత్సంఘములోనఁజిక్కక సమస్తాశాంతనిర్జేతలై యేపారంగ మఖంబు సేసితిరి దేవేంద్రప్రభావంబునన్. |
471 |