పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము అష్టమస్కంధము
కూర్మావతార కథా ప్రారంభము
సీ. సవరనై లక్షయోజనముల వెడలుపై కడుఁగఠోరమునైన కర్పరమును
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖగహ్వరంబు
సకల చరాచర జంతురాసుల నెల్ల మ్రింగి లోఁగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైఁబడ్డ నాఁగినఁగదలనియట్టి కాళ్ళు
 
తే. వెలికి లోనికిఁజనుదెంచు విపుల తుండ, మంబుజంబులఁబోలెడు నక్షియుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి, కూర్మి చెలువొంద నొక మహాకూర్మమయ్యె.
202
మ. కమఠంబై జలరాశిఁజొచ్చి లఘుముక్తాశుక్తిచందంబునన్‌
నమదద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో
నమరేంద్రాదులు మౌళికంపములతో నౌ నౌఁగదే! బాపురే!
కమలాక్షా! శరణంబు భూదిశలు నాకాశంబునున్‌ మ్రోయఁగన్‌.
203
వ. ఇవ్విధంబున. 204
క. తరిగాండ్రలోన నొకఁడఁట, తరికడవకుఁగుదురు నాఁక త్రాడఁట చేరుల్‌;
దరి గవ్వంబును దా నఁట హరి హరి! హరిచిత్రలీల హరియే యెఱుఁగున్‌.
205
ఆ. జలధిఁగడవ సేయ శైలంబుఁగవ్వంబు, సేయ భోగిఁద్రాడుసేయఁదరువ
సిరియు సుధయుఁబడయ శ్రీవల్లభుఁడు దక్క నొరుఁడు శక్తిమంతుఁడొకఁడు గలఁడె?
206
ఆ. గొల్లవారి బ్రదుకు గొఱఁతన వచ్చునే, గొల్లరీతిఁబాలకుప్పఁద్రచ్చి
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు చేటు లేని మందు సిరియుఁగనిరి.
207
వ. ఇట్లు సురాసుర యూథంబులు హరిసనాథంబులయి కవచంబులు నెట్టంబులు వెట్టికొని, పుట్టంబులు పిరిచుట్టు సుట్టికొని, కరంబులు కరంబుల నప్పళించుచు, భుజంబులు భుజంబుల నొరయుచు, లెండు లెండు దరువఁదొడంగుండు రండని యమందగతిం బెరుఁగుం ద్రచ్చు మందగొల్లల చందంబున మహార్ణవమధ్యంబున మంథాయమాన మందర మహీధర విలగ్నభోగి భోగాద్యంతంబులం గరంబులం దెమల్చుచుఁ, బెనుబొబ్బలం బ్రహ్మాండ కటాహంబు నిర్భరంబయి గుబ్బుగుబ్బని యురలు కొండకవ్వంబుగుత్తి జిఱ జిఱం దిరుగు వేగంబున ఛటచ్ఛటాయమానంబులయి బుగులు బుగుళ్ళను చప్పు ళ్లుప్పరం బెగసి లెక్కకు మిక్కిలి చుక్కల కొమ్మల చెక్కుల నిక్కలువడు మిసిమి గల మీఁది మీఁగడపాల తేటనిగ్గుఁదుంపరల పరంపరల వలన నిజకరక్రమ క్రమాకర్షణ పరిభ్రాంత ఫణి ఫణాగర్భ సముద్భూత నిర్భర విష కీలి కీలజాలంబుల నప్పటప్పటికి నుప్పతిల్లిన దప్పిం గొండొక మందగతిం జెందక యకూపార వేలాతట కుటజ కుసుమగుచ్ఛ పిచ్ఛిల స్వచ్ఛ మకరంద సుగంధి గంధవహావహనంబునం గ్రొంజెమట నీటి పెను వఱదగము లొడళ్ల నిగుర నొండొరులం బరిహసించుచుఁబేరువాడి విలసించుచు, మేలుమే లని యుగ్గడించుచు, గాదు కాదని భంగించుచు, నిచ్చ మెచ్చని మచ్చరంబు వలన వనధి వలమాన వైశాఖ వసుంధరాధర పరివర్తన సముజ్జనిత ఘుమఘుమారావంబును, మథనగుణాయమాన మహాహీంద్రప్రముఖ ముహుర్ముహురుచ్చలిత భూరి ఘోర ఫూత్కార ఘోషంబును, గులకుధర పరిక్షేపణ క్షోభిత సముల్లంఘన సమాకులితంబులై వెఱచఱచి గుబురుగుబురులై యొరలు కమఠ కర్కట కాకోదర మకర తిమితిమింగిల మరాళచక్రవాక బలాహకభేక సారసానీకంబుల మొఱలునుం గూడికొని ముప్పిరిగొని, దనుజ దివిజ భటాట్టహాస తర్జన గర్జన ధ్వనులు నలుపురియై మొత్తినట్లైన దశదిగంతభిత్తులును, బేఁటెత్తి పెల్లగిలం ద్రుళ్ళుచుఁగికురు పొడుచుచు నొకఁడొకనికంటె వడియునుం, గడుపునుం గలుగఁద్రచ్చుచుఁబంతంబు లిచ్చుచు సుధాజననంబుఁజింతించుచు నూతనపదార్థంబులకు నెదుళ్లు సూచుచు నెంతదడవు ద్రత్తమని హరి నడుగుచు నెడపడని తమకంబుల నంతకంతకు మురువు డింపక త్రచ్చు సమయంబున. 208
క. అప్పాలవెల్లిలోపల, నప్పటి కప్పటికి మందరాగము దిరుగం
జప్పుడు నిండె నజాండము, సెప్పెడి దే మజుని చెవులు సిందఱగొనియెన్‌.
209
వ. అంత నప్పయోరాశిమధ్యంబున. 210
క. ఎడమఁగుడి మునుపు దిరుగుచుఁగుడి నెడమను వెనుకఁదిరుగుఁ గులగిరి గడలిం
గడ లెడల సురలు నసురులుఁదొడి తొడి ఫణి ఫణము మొదలుఁదుదియును దిగువన్‌.
211
క. వడిగొని కులగిరిఁదరువఁగ, జడనిధి ఖగమకరకమఠఝషఫణిగణముల్‌
సుడివడుఁదడఁబడుఁ గెలఁకులఁబడు భయపడి నెగసి బయలఁబడు నురలిపడున్‌.
212
క. అమరాసురకరవిపరి, భ్రమణధరాధరవరేంద్ర భ్రమణంబును దాఁ
గమఠేంద్రు వీఁపు తీఁటను శమియింపఁగఁజాలదయ్యె జగతీనాథా!
213
వ. తదనంతరంబ. 214
క. ఆలోల జలధి లోపల నాలో నహి విడిచి సురలు నసురులుఁబఱవం
గీలా కోలాహలమై హాలాహల విషము పుట్టె నవనీనాథా!
215
వ. అదియునుం బ్రళయకాలాభీల ఫాలలోచన లోచనానల శతంబు చందంబున నమందంబై విలయ దహన సహస్రంబు కైవడి వడియై, కడపటి పట్టపగలింటి వెలుంగుల లక్ష తెఱంగున దుర్లక్షితంబై, తుదిరేయి వెలింగిన మొగిలు గముల వలనుం బడు బలు పిడుగుల వడువున బెడిదంబై, పంచభూతంబులుం దేజోరూపంబులైన చాడ్పున దుస్సహంబై, భుగ భుగాయమానంబులైన పొగలును, జిటజిటాయమానంబులైన విస్ఫులింగంబులును, ధగధగాయ మానంబులైన నెఱమంటలును గలిగి మహార్ణవ మధ్యంబున మందర నగం బమంథరంబుగం దిరుగునెడ జనియించి పటపటాయమానంబై నింగికిం బొంగి, దిశలకుం గేలుసాఁచి బయళ్లు ప్రబ్బికొని, తరిగవ్వంపుఁగొండ నండ గొనక, నిగిడి కడల నలుగడలకుం బఱచి, దరుల కుఱికి, సురాసుర సముదయంబులన్‌ దరికొని, గిరివర గుహాగహ్వరంబుల సుడివడక, కులశిఖరి శిఖరంబుల నెరగలివడి, గహనంబుల దహించి, కుంజ మంజరీ పుంజంబుల భస్మంబు సేసి, జనపదంబు లేర్చి, నదీ నదంబు లెరియించి, దిక్కుంభి కుంభములు నిక్కలు వడ నిక్కి, తరణితారామండలంబులపై మిట్టించి, మహర్లోకంబు దరికొని, యుపరిలోకంబునకు మాఱు గొనలిడి. సుడివడి, ముసరుకొని, బ్రహ్మాండ గోళంబు చిటిలిపడన్‌ దాఁటి పాతాళాది లోకంబులను వ్రేళ్లువాఱి, సర్వలోకాధికంబై శక్యంబు గాక యెక్కడఁ జూచినం దానయై, కురంగంబు క్రియం గ్రేళ్లుఱుకుచు భుజంగంబు విధంబున నొడియుచు, సింగంబుభంగి లంఘించుచు, విహంగంబు పగిది నెగయుచు, మాతంగంబు పోలికి నిలువంబడుచు, నిట్లు హాలాహల దహనంబు జగంబులం గోలాహలంబు సేయుచున్న సమయంబున, మెలకు సెగల మిడుక జాలక నీఱైన దేవతలును, నేలంగూలిన రక్కసులును, డుల్లిన తారకలును గీటడంగిన కిన్నర మిథునంబులును, గమరిన గంధర్వ విమానంబులును, జీకాకుపడిన సిద్ధ చయంబులును, జిక్కుపడిన గ్రహంబులును, జిందఱవందఱ లయిన పర్ణాశ్రమంబులును, నిగిరిపోయిన నదులును, నింకిన సముద్రంబులును, గాలిన కాననంబులును, బొగిలిన పురంబులును బొనుఁగు పడిన పురుషులును బొక్కిపడిన పుణ్యాంగనా జనంబులును, బగిలిపడిన పర్వతంబులును, భస్మంబులైన ప్రాణి సంఘంబులును, వేఁగిన లోకంబులును, వివశలైన దిశలును, నొడ్డ గెడవులైన భూజ చయంబులును, నఱవఱలైన భూములునునై, యకాల విలయకాలంబై తోఁచుచున్న సమయంబున. 216
క. ఒడ్డారించి విషంబున, కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్‌
గొడ్డేఱి మ్రంది రా లన, బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథా!
217
వ. అప్పుడు. 218
మ. చని కైలాసముఁజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి యీ
సున దౌవారికు లడ్డపడ్డఁదల మంచుంజొచ్చి ‘కుయ్యో! మొఱో!
విను మాలింపుము; చిత్తగింపుము; దయన్‌ వీక్షింపు’ మం చంబుజా
ననముఖ్యుల్‌ గని రార్తరక్షణకళాసంరంభునిన్‌ శంభునిన్‌.
219
క. వారలు దీనత వచ్చుటఁగూరిమితో నెఱిఁగి దక్షుకూఁతురు దానుం
బేరోలగమున నుండి దయా, రతుఁడై చంద్రచూడుఁడవసర మిచ్చెన్‌.
220
వ. అప్పుడు భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని స్తుతియించిరి. 221
సీ. భూతాత్మ! భూతేశ! భూత భావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య!
యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవు; బంధమోక్షములకుఁబ్రభుఁడ వీవ;
యార్తశరణ్యుండవగు గురుండవు నిన్నుఁగోరి భజింతురు కుశలమతులు;
సకలసృష్టిస్థితిసంహారకర్తవై బ్రహ్మవిష్ణుశివాఖ్య బరఁగు దీవు;
 
ఆ. పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త, మంబు నీవ; శక్తిమయుఁడ వీవ
శబ్దయోని వీవ; జగదంతరాత్మవు నీవ, ప్రాణ మరయ నిఖిలమునకు.
222
క. నీయంద సంభవించును, నీయంద వసించి యుండు నిఖిలజగములున్‌
నీయంద లయముఁబొందును, నీ యుదరము సర్వభూతనిలయము రుద్రా!
223
సీ. అగ్నిముఖంబు; పరాపరాత్మక మాత్మ; కాలంబు గతి; రత్నగర్భ పదము;
శ్వసనంబు నీ యూర్పు; రసన జలేశుండు; దిశలు కర్ణంబులు; దివము నాభి;
సూర్యుండు గన్నులు; శుక్లంబు సలిలంబు; జఠరంబు జలధులు; చదలు శిరము;
సర్వౌషధులు రోమచయములు; శల్యంబు లద్రులు; మానస మమృతకరుఁడు;
 
తే. ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయ;, మాస్యపంచక ముపనిషదాహ్వయంబు;
నయిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య, మై స్వయం జ్యోతియై యొప్పు నాద్య మగుచు.
224
క. కొందఱు గలఁడందురు నినుఁ; గొందఱు లేఁడందు రతఁడు గుణి గాఁడనుచుం
గొందఱు; గలఁడని లేఁడని కొందల మందుదురు నిన్నుఁగూర్చి మహేశా!
225
సీ. తలఁపఁబ్రాణేంద్రియ ద్రవ్యగుణ స్వభావుఁడవు, కాలక్రతువులును నీవ;
సత్యంబు ధర్మ మక్షరము ఋతంబును, నీవు ముఖ్యుండవు నిఖిలమునకు
ఛందోమయుండవు సత్త్వరజస్తమ, శ్చక్షుండవై యుందు సర్వరూప
కామ పురాధ్వర కాలగరాది భూతద్రోహభయము చోద్యంబు గాదు;
 
తే. లీలలోచనవహ్ని స్ఫులింగ శిఖల, నంతకాదులఁగాల్చిన యట్టి నీకు
రాజఖండావతంస! పురాణ పురుష!, దీనరక్షక! కరుణాత్మ! దేవ దేవ!
226
ఆ. మూఁడు మూర్తులకును మూఁడు లోకములకు, మూఁడు కాలములకు మూల మగుచు
భేద మగుచుఁదుది నభేదమై యొప్పారు, బ్రహ్మ మనఁగ నీవ ఫాలనయన!
227
క. సదసత్తత్త్వ చరాచర సదనం బగు నిన్నుఁబొగడ జలజభవాదుల్‌
పెదవులు గదలుప వెఱతురు వదలక నినుఁబొగడ నెంతవారము దేవా!
228
మత్త. బాహుశక్తి సురాసురుల్‌ చని పాలవెల్లి మథింప హా
లాహలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లాహలంబుగఁజేసి చిచ్చును లాగముంగొని ప్రాణి సం
దోహమున్‌ బ్రదికింపవే? దయ దొంగలింపఁగ నీశ్వరా!
229
క. లంపటము నివారింపను సంపదఁగృపసేయ జయము సంపాదింపం
జంపెడివారి వధింపను సొంపారఁగ నీక చెల్లు సోమార్ధధరా!
230
క. నీకంటె నొం డెఱుంగము; నీకంటెంబరులు గావ నేరరు జగముల్‌;
నీకంటె నొడయఁడెవ్వఁడు, లోకంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా!
231
వ. అని మఱియు నభినందించుచున్న ప్రజాపతి ముఖ్యులం గని సకలభూత సముండగు నద్దేవుండు దన ప్రియసతి కిట్లనియె. 232
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - aShtama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )