| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | అష్టమస్కంధము |
| క. |
తెల్లని మేనును నమృతము జిల్లున జల్లించు పొదుఁగు శితశృంగములుం బెల్లుగ నర్థుల కోర్కులు వెల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టెన్. |
252 |
| ఆ. |
అగ్నిహోత్రి యనుచు నా సురభిని దేవ మునులు పుచ్చికొనిరి మున్నెఱింగి విబుధసంఘములకు వెరవుతో నధ్వర హవులు వెట్టుకొఱకు నవనినాథ! |
253 |
| వ. | మఱియు నా జలరాశియందు. | 254 |
| క. |
సచ్చంద్రపాండురంబై యుచ్చైశ్శ్రవ మనఁగఁదురగ మొగి జనియించెం బుచ్చి కొనియె బలి దైత్యుం డిచ్చఁగొనం డయ్యె నింద్రుఁడీశ్వరశిక్షన్. |
255 |
| క. |
ఒఱ పగు నురమును బిఱుఁదును, నెఱిఁదోకయు ముఖము సిరియు నిర్మలఖురముల్ కుఱుచ చెవులుఁదెలిగన్నులుఁదఱచగు కందంబుఁజూడఁదగు నా హరికిన్. |
256 |
| వ. | అంత న ప్పాలకుప్పయందు. | 257 |
| క. |
దంతచతుష్టాహతి శైలాంతంబులు విఱిగి పడఁగ నవదాత కుభృ త్కాంతంబగు నైరావతదంతావళ ముద్భవించె ధరణీనాథా! |
258 |
| క. |
తడలేని నడపు, వడి గల యొడలును, బెను నిడుదకరము, నురుకుంభములున్ బెడఁగై యువతుల మురిపపు నడకలకున్ మూలగురు వనన్ గజ మొప్పెన్. |
259 |
| వ. | మఱియు నత్తరంగిణీవల్లభు మథించు నయ్యెడ. | 260 |
| ఆ. |
ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై యింద్రు విరులతోఁట కేపు దెచ్చి కోరి వచ్చువారి కోర్కుల నీనెడు వేల్పుమ్రాను బాలవెల్లిఁబుట్టె. |
261 |
| వ. | మఱియునుం గొండకవ్వంబునం గడలి మథింప నప్సరోజనంబు జనించె; నంత. | 262 |
| క. |
క్రొక్కారు మెఱుఁగుమేనులు, గ్రిక్కిరిసిన చన్నుగవలుఁగ్రిస్సిన నడుముల్ పిక్కటిలి యున్న తుఱుములుఁజక్కని చూపులును దివిజసతులకు నొప్పెన్. |
263 |
| వ. | మఱియు నా రత్నాకరంబు నందు సుధాకరుం డుద్భవించి, విరించి యనుమతంబునఁదన యథాస్థానంబునం బ్రవర్తించుచుండె; నంత. | 264 |
| క. |
తొలుకారుమెఱుఁగుకైవడిఁదళ తళ మని మేను మెఱయ ధగ ధగ మనుచున్ గలుముల నీనెడు చూపులఁజెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టె నృపా! |
265 |
| సీ. |
పాలమున్నీటి లోపలి మీఁది మీఁగడ, మిసిమి జిడ్డునఁజేసి మేను వడసి క్రొక్కారు మెఱుఁగుల కొనల తళుక్కుల మేనిచే గలనిగ్గు మెఱుఁగు సేసి నాడుఁనాఁటికిఁబ్రోది నవకంపుఁదీవల నునుబోద నెయ్యంబు నూలుకొలిపి క్రొవ్వారు కెందమ్మి కొలఁకులఁబ్రొద్దునఁబొలసిన వలపులఁబ్రోది వెట్టి |
|
| తే. |
పసిఁడి చంపక దామంబు బాగుఁగూర్చి, వాలు క్రొన్నెల చెలువున వాఁడి దీర్చి జాణతనమునఁజేతుల జడ్డు విడిచి, నలువ యీ కొమ్మ నొగిఁజేసినాఁడు నేఁడు. |
266 |
| క. |
కెంపారెడు నధరంబును, జంపారెడి నడుము సతికి శంపారుచులన్ సొంపారు మోముఁగన్నులుఁబెంపారుచు నొప్పుగొప్పుఁబిఱుఁదును గుచముల్. |
267 |
| వ. | అని జనులు పొగడు చుండ. | 268 |
| సీ. |
తరుణికి మంగళస్నానంబు సేయింత మని పెట్టె నింద్రుఁడనర్ఘమైన మణిమయపీఠంబు; మంగళవతులైన వేలుపుగరితలు విమలతోయ పూర్ణంబులై యున్న పుణ్యాహకలశంబు లిడిరి వల్లవముల నిచ్చె భూమి; గడిమి గోవులు పంచగవ్యంబులను నిచ్చె మలసి వసంతుఁడు మధు వొసంగె; |
|
| తే. |
మునులు కల్పంబుఁజెప్పిరి మొగిలుగములు, పణవగోముఖకాహళపటహమురజ శంఖవల్లకీవేణునిస్వనము లిచ్చెఁ, బాడి రాడిరి గంధర్వపతులు సతులు. |
269 |
| క. |
పండితసూక్తుల తోడుతఁదుండంబులు సాఁచి తీర్థతోయములెల్లం గుండముల ముంచి దిగ్వేదండంబులు జలక మార్చెఁదరుణీమణికిన్. |
270 |
| సీ. |
కట్టంగఁబచ్చని పట్టుఁబుట్టముదోయి ముదితకుఁదెచ్చి సముద్రుఁడిచ్చె మత్తాళినికరంబు మధువాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ గాంచనకేయూరకంకణకింకిణీకటకాదులను విశ్వకర్మ యిచ్చె భారతి యొక మంచి తారహారము నిచ్చెఁబాణిపద్మము నిచ్చెఁపద్మభవుఁడు |
|
| తే. |
కుండలివ్రజంబు గుండలముల నిచ్చె, శ్రుతులు భద్రమైన నుతులు సేసె నెల్ల లోకములకు నేలిక సానివై, బ్రదికె దనుచు దిశలు పలికె నధిప! |
271 |
| వ. | మఱియును. | 272 |
| సీ. |
పలుకుల నమృతంబు చిలుక నెవ్వానితో భాషించె వాఁడెపో బ్రహ్మయనఁగ నెలయించి కెంగేల నెవ్వని వరియించె వాఁడె లోకములకు వల్లభుండు మెయిదీఁగ నెవ్వని మేనితోఁగదియించె వాఁడెపో పరమసర్వజ్ఞమూర్తి నెలఁతుక యెప్పుడు నివసించు నేయింట నాయిల్లు పరమగు నమృతపదము |
|
| ఆ. |
నింతి చూపు వాఱె నెచ్చోటి కచ్చోటు, జిష్ణుధనదధర్మజీవితంబు గొమ్మ పిన్ననగవు గురుతరదుఃఖ ని, వారణంబు సృష్టికారణంబు. |
273 |
| వ. | మఱియు నక్కొమ్మ నెమ్మనంబున. | 274 |
| సీ. |
భావించి యొకమాటు బ్రహ్మాండ మంతయు నాటల బొమ్మరిల్లని తలంచుఁ బోలించి యొకమాటు భువనంబు లన్నియుఁ దన యింటిలో దొంతులని తలంచు బాటించి యొకమాటు బ్రహ్మాది సురులను దన యింటిలో బొమ్మలని తలంచుఁ గొనకొని యొకమాటు కుంభినీచక్రంబు నలవడ బొమ్మపీఁటని తలంచు. |
|
| ఆ. |
సొలసి యొక్కమాటు సూర్యేందురోచుల, నచటి దీపకళిక లని తలంచు భామ యొక్కమాటు భారతీదుర్గల, నాత్మసఖు లటంచు నాదరించు. |
275 |
| వ. | తదనంతరంబ. | 276 |
| ఆ. |
చంచరీకనికరఝంకారనినదంబు, దనరు నుత్పలముల దండఁబట్టి మేఘకోటి నడిమి మెఱుఁగుఁబుత్తడిమాడ్కి, సురల నడుమ నిలిచె సుందరాంగి. |
277 |
| క. |
ఆ కన్నులు నా చన్నులు, నా కురు లా పిఱుఁదు నడుము నాముఖ మా న వ్యాకారముఁగని వేల్పులు, చీకాకునఁబడిరి కలఁగి శ్రీహరి దక్కన్. |
278 |
| వ. | అట్లు నిలిచి దశ దిశలం బరివేష్టించియున్న యక్ష రక్షస్సిద్ధసాధ్య దివిజ గరుడ గంధర్వ చారణ ప్రముఖ నిఖిల యూథంబులం గనుంగొని య ప్పురాణ ప్రౌఢకన్యకారత్నంబు దనమనంబున నిట్లని వితర్కించె. | 279 |
| సీ. |
ఐదువనై యుండ నలవడ దొక చోట నొకచోట సవతితో నోర్వరాదు తగ నొకచోట సంతత వైభవంబు గా దొకచోట వేఁడిమి నుండఁబోల దొకచోటఁగరుణ లే దొక్కింత వెదకిన నొకచోట డగ్గఱియుండ బెట్ట నెఱయంగ నొకచోట నిలుకడ చాలదు చర్చింప నొకచోట జడత గలదు. |
|
| ఆ. |
కొన్ని చోట్లు కామగుణగరిష్ఠంబులు, క్రోధసంయుతములు గొన్ని యెడలు గొన్ని మోహలోభకుంఠితంబులు గొన్ని, ప్రమదమత్సరానుభావకములు. |
280 |
| వ. | అని సకలసత్పురుషజననవర్తనంబు మానసించి పరిహరించి. | 281 |
| సీ. |
అమర ముత్తైదువనై యుండ వచ్చును వరుసకు సవతు లెవ్వరును లేరు వెలయంగ నశ్రాంతవిభవ మీతని యిల్లు శృంగారచందనశీతలుండు గలఁగఁడెన్నఁడు శుద్ధకారుణ్యమయమూర్తి విమలుండు గదిసి సేవింపవచ్చు నెఱి నాడి తిరుగఁడు నిలుకడ గలవాఁడు సకలకార్యములందు జడత లేదు; |
|
| ఆ. |
సాధురక్షకుండు షడ్వర్గరహితుండు, నాథుఁడయ్యె నేని నడప నోపు నితఁడె భర్త యనుచు నింతి సరోజాక్షుఁ, బుష్పదామకమునఁబూజసేసె. |
282 |
| క. |
ఇందీవరదామమున ముకుందునిఁబూజించి తనకుఁగూడి వసింపన్ మందిరముగఁదద్వక్షము నంద సలజ్జాసుదృష్టి నాలోకించెన్. |
283 |
| ఆ. |
మోహరుచులవలన ముద్దియ తలయెత్తు సిగ్గువలన బాల శిరము వంచు నింతి వెఱఁగువలన నెత్తదు వంపదు తనదు ముఖము ప్రాణదయితుఁజూచి. |
284 |
| క. |
హరి సూచిన సిరి సూడదు సిరి సూచిన హరియుఁజూడ సిగ్గును బొందున్ హరియును సిరియును దమలో సరిచూపులఁజూడ మరుఁడు సందడివెట్టెన్. |
285 |
| చ. |
జగముల తండ్రియై తనరు శౌరి జగంబుల తల్లి నిందిరం దగ నురమందుఁదాల్చె నటఁ; దత్కరుణారసదృష్టిచేఁబ్రజల్ మగుడఁగఁదొంటి భంగి నతిమంగళసాధిపతిత్వసంపదన్ నెగడిన లోకముల్ గని; రనేకశుభంబులఁబొంది రత్తఱిన్. |
286 |
| వ. | అట మున్న యబ్ధిరాజు దనయందు నున్న యమూల్యం బయిన కౌస్తుభంబు పేరిట యనర్ఘ మణి రాజంబు న య్యంబుజాక్షునకు సమర్పించిన దానిం దన వక్షస్స్థలంబున ధరియించె; నప్పు డయ్యాదిలక్ష్మియు శ్రీవత్సకౌస్తుభ వైజయంతీ వనమాలికా తారహారాద్యలంకృతంబైన పుండరీకాక్షు వక్షస్స్థలంబున వసియించె; నయ్యవసరంబున. | 287 |
| శా. |
మ్రోసెన్ శంఖమృదంగవేణురవముల్ మున్నాడి; పెంజీఁకటుల్ వాసెన్, నర్తనగానలీలల సురల్ భాసిల్లి; రార్యుల్ జగ ద్వాసుల్ విష్ణుని బ్రహ్మదేవముఖరుల్ దల్లింగమంత్రంబులం బ్రాసక్తిన్ వినుతించి రుల్లసితపుష్ప శ్రేణి వర్షించుచున్. |
288 |
| క. |
ఆ పాలవెల్లి కూఁతురు, దీపుల చూపులను దోఁగి తిలకింపఁబ్రజల్ చేపట్టిరి సంపదలను, బ్రాపించెను మేలు; జగము బ్రదికె నరేంద్రా! |
289 |
| క. |
పాలేటిరాచకన్నియ మేలారెడు చూపులేక మిడు మిడు కంచుం జాలిం బురపురఁబొక్కుచుఁదూలిరి రక్కసులు కీడు దోఁచిన నధిపా! |
290 |
| క. |
వారిధిఁదరువఁగ నంతట, వారుణి యన నొక్క కన్య వచ్చిన నసురుల్ వారిజలోచను సమ్మతి, వారై కైకొనిరి దాని వారిజనేత్రన్. |
291 |
| వ. | మఱియుందరువందరువ నప్పయోరాశియందు. | 292 |
| సీ. |
తరుణుండు దీర్ఘదోర్దండుండు గంబుకంధరుఁడు పీతాంబరధారి స్రగ్వి లాలితభూషణాలంకృతుం డరుణాక్షుఁడున్నతోరస్కుఁడత్యుత్తముండు నీలకుంచితకేశనివహుండు జలధరశ్యాముండు మృగరాజసత్త్వశాలి మణికుండలుఁడు రత్నమంజీరుఁడచ్యుతు నంశాంశసంభవుండమలమూర్తి |
|
| ఆ. |
భూరియాగభాగభోక్త ధన్వంతరి, యనఁగ నమృతకలశహస్తుఁడగుచు నిఖిలవైద్యశాస్త్రనిపుణుఁడాయుర్వేది, వేల్పువెజ్జు కడలి వెడలి వచ్చె. |
293 |
| వ. | తదనంతరంబ. | 294 |
| ఆ. |
అతనిచేత నున్న యమృతకుంభము సూచి కెరలు వొడిచి సురలఁగికురువెట్టి పుచ్చికొనిరి యసురపుంగవు లెల్లను మాఱులేని బలిమి మానవేంద్ర! |
295 |
| వ. | వెండియు. | 296 |
| ఆ. |
చావులేని మందు చక్కఁగ మన కబ్బె, ననుచుఁగడవ నసురు లాఁచికొనిన వెఱచి సురలు హరికి మొఱలు వెట్టిరి సుధా, పూర్ణఘటము వోయెఁబోయె ననుచు. |
297 |