| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | అష్టమస్కంధము |
| ఆ. |
గ్రహమునీంద్రసిద్ధగంధర్వకిన్నర, యక్షపక్షిదేవతాహిపతులు వొగడి రతని పెంపుఁ; బుష్పవర్షంబులు, గురిసె దేవతూర్యకోటి మొరసె. |
620 |
| వ. | ఇట్లు ధారాపరిగ్రహంబు సేసి. | 621 |
| శా. |
ఇంతింతై, వటుఁడింతయై, మఱియుఁ దా నింతై, నభోవీథిపై నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై నంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై నంతై, మహర్వాటిపై నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై. |
622 |
| మ. |
రవిబింబం బుపమింపఁబాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్. |
623 |
| వ. | ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరియించి భువియును, నభంబును, దివంబును, దిశలును, దిశాఛిద్రంబులును, సముద్రంబులును, జల దచల దఖిల భూతనివహంబులుం దానయై యేకీభవించి, క్రమ క్రమంబున భూలోకంబునకుం బొడువై, భువర్లోకంబు నతిక్రమించి, సువర్లోకంబును దల కడచి, మహర్లోకంబు దాఁటి జనోలోకంబునకు మీఁదై, తపోలోకంబునకు నుచ్ఛ్రితుండై, సత్యలోకంబుకంటె నౌన్నత్యంబు వహించి, యెడ లిఱుములు సందులు రంధ్రంబులు లేకుండ నిండి, మహాదేవమహితుండై చరణతలంబున రసాతలంబును, బాదంబుల మహియును, జంఘల మహీధ్రంబులును, జానువులఁ బతత్త్రిసముదయంబులును, నూరువుల నింద్రసేన మరుద్గణంబులును, వాసస్స్థలంబున సంధ్యయు, గుహ్యంబునఁ బ్రజాపతులును, జఘనంబున దనుజులును, నాభిని నభంబును, నుదరంబున నుదధిసప్తకంబును, నురంబునఁ దారకానికరంబును, హృదయంబున ధర్మంబును నురోజంబుల ఋతసత్యంబులును, మనంబునఁ జంద్రుండును, వక్షంబునఁ గమలహస్త యగు లక్ష్మియుఁ, గంఠంబున సామాది సమస్త వేదంబులును, భుజంబులం బురందరాది దేవతలును, గర్ణంబుల దిశలును, శిరంబున నాకాశంబును, శిరోజంబుల మేఘంబులును, నాసాపుటంబున వాయువును, నయనంబుల సూర్యుండును, వదనంబున వహ్నియు, వాణినఖిలచ్ఛంద స్సముదయంబును, రసనను జలేశుండును, భ్రూయుగళంబున విధినిషేధంబులును, ఱెప్పల నహోరాత్రంబులును, లలాటంబునఁ గోపంబును, నధరంబున లోభంబును,స్పర్శంబునఁ గామంబును, రేతంబున జలంబును, బృష్ఠంబున నధర్మంబును, గ్రమణంబుల యజ్ఞంబులును, ఛాయల మృత్యువును, నగవున ననేక మాయావిశేషంబులును, రోమంబుల నోషధులును, నాడీప్రదేశంబుల నదులును, నఖంబుల శిలలును, బుద్ధి నజుండును, బ్రాణంబుల దేవర్షిగణంబులును, గాత్రంబున జంగమస్థావర జంతుసంఘంబులును గలవాఁడై, జలధరనినద శంఖ శార్‌ఙ్గ సుదర్శన గదాదండ ఖడ్గాక్షయ బాణతూణీర విభ్రాజితుండును, మకరకుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికా విరాజితుండును, సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుండును, నమేయ తేజోవిరాజితుండునునై బ్రహ్మాండంబు దన మేనికప్పు తెఱంగున నుండ విజృంభించి. | 624 |
| మ. |
ఒకపాదంబున భూమిఁగప్పి, దివి వేఱొంటన్ నిరోధించి, యొం డొకటన్ మీఁది జగంబులెల్లఁదొడి, యొండొంటిన్ విలంఘించి, ప ట్టక బ్రహ్మాండకటాహముం బగిలి వేండ్రంబై పరుల్ గానరా కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరివిభుం డొప్పారె విశ్వాకృతిన్. |
625 |
| ఆ. |
ఒక పదంబు క్రింద నుర్వి పద్మము నంటి, కొన్న పంకలవము కొమరుఁదాల్చె; నొకటి మీఁదఁదమ్మి కొదిఁగిన తేఁటినా, వెలసె మిన్ను నృప! త్రివిక్రమమున. |
626 |
| వ. | తత్సమయంబున. | 627 |
| ఆ. |
జగములెల్ల దాఁటి చనిన త్రివిక్రము, చరణనఖరచంద్రచంద్రికలను బొనుఁగుపడియె సత్యమున బ్రహ్మతేజంబు, దివసకరుని రుచుల దివియవోలె. |
628 |
| సీ. |
భవబంధములఁబాసి బ్రహ్మలోకంబునఁ గాఁపురంబులు సేయు ఘనులు రాజు లా మరీచ్యాదులు నా సనందాదులు నా దివ్యయోగీంద్రు లచట నెపుడు మూర్తిమంతంబులై మ్రోయు పురాణ తర్కామ్నాయ నియమేతిహాస ధర్మ సంహితాదులు గురుజ్ఞానాగ్ని నిర్దగ్ధ కర్ములై మఱియును గలుగునట్టి |
|
| ఆ. |
వార లెల్లఁజొచ్చి వచ్చి సర్వాధిపు, నంఘ్రిఁజూచి మ్రొక్కి రధికభక్తి దమ మనంబులందుఁ దలఁచు నిధానంబుఁ, గంటి మనుచు నేఁడు మంటి మనుచు. |
629 |
| మ. |
తన పుట్టిల్లిదె పొమ్మటంచు నజుఁడుం దన్నాభిపంకేరుహం బు నిరీక్షించి, నటించి యున్నతపదంబుంజూచి తత్పాద సే చనముంజేసెఁగమండలూదకములంజల్లించి; తత్తోయముల్ వినువీథింబ్రవహించె దేవనదినా విశ్వాత్ముకీర్తిప్రభన్. |
630 |
| వ. | తత్సమయంబున. | 631 |
| సీ. |
యోగమార్గంబున నూహించి బహువిధపుష్పదామంబులఁబూజసేసి దివ్యగంధంబులు తెచ్చి సమర్పించి ధూపదీపములఁదోడ్తోడ నిచ్చి భూరిలాజాక్షతంబులు సల్లి ఫలములు గానిక లిచ్చి రాగములఁబొగడి శంఖాదిరవముల జయఘోషములు సేసి ‘కరుణాంబునిధి! త్రివిక్రమ’ యటంచు |
|
| ఆ. |
బ్రహ్మమొదలు లోకపాలురు గొనియాడి; రెల్ల దిశల వనచరేశ్వరుండు జాంబవంతుఁడరిగి చాటె భేరీధ్వని, వెలయఁజేసి విష్ణువిజయ మనుచు. |
632 |
| క. |
అన్ని జగంబులఁదానై, యున్న జగన్నాథుఁజూడ నొగి భావింపం గన్నందక మన మందక, సన్నుతులంజేసి రపుడు సభ్యులు బలియున్. |
633 |
| వ. | అంత నొయ్యనఁ బూర్వప్రకారంబున వామనాకారంబు వహించి యున్న వామనునిం గని ‘పదత్రయ వ్యాజంబున నితండు సకలమహీమండలంబు నాక్రమించెఁ గపటవటురూప తిరోహితుండగు విష్ణుం డని యెఱుంగక మన దానవేంద్రుండు సత్యసంధుండు గావున మాట దిరుగక యిచ్చె; నతనివలన నేరంబులే; దీ కుబ్జుం డప్రతిహత తేజః ప్రభావంబున సజ్జకంబుగా నిజ్జగంబులం బరిగ్రహించి, పర్జన్యాదులకు విసర్జనంబు సేయందలంచి యున్నవాఁ, డీ పాఱునిం దూఱి పాఱనీక నిర్జించుట కర్జం’ బని తర్జనంబులును గర్జనంబులును జేయుచు, వజ్రాయుధాది మరుజ్జేతలగు రాహు హేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులయిన రక్కసులు పెక్కం డ్రుక్కుమిగిలి యుద్ధంబునకు సన్నద్ధులై పరశు పట్టిస భల్లాది సాధనంబులు ధరియించి, కసిమసంగి ముసరికొని దశదిశలం బ్రసరించినం చూచి హరి పరిచరులు సునంద నంద జయ జయంత విజయ ప్రబలోద్బల కుముద కుముదాక్ష తార్‌క్ష్య పుష్పదంత విష్వక్సేన శ్రుతదేవ సాత్వత ప్రముఖులగు దండనాథు లయుత వేదండ సముద్దండబలులు దమతమ యూథంబుల నాయుధంబులతోడం గూర్చుకొని దానవానీకంబులఁ బరలోకంబున కనుపువారలై వారల నెదుర్కొని కదనంబునకుం బరవసంబు సేయుచున్నం గనుంగొని శుక్రుశాపంబుఁదలంచి దనుజవల్లభుండిట్లనియె. | 634 |
| సీ. |
రాక్షసోత్తములార! రండు పోరాడక; కాలంబు గాదిది కలహమునకు సర్వభూతములకు సంపదాపదలకుఁ బ్రభువైన దైవంబుఁబరిభవింప మన మోపుదుమె? తొల్లి మనకు రాజ్యంబును సురలకు నాశంబు సొరిది నిచ్చి విపరీతముగఁజేయు వేల్పు నే మందుము! మనపాలిభాగ్యంబు మహిమ గాక |
|
| తే. |
వెఱచి పలుమాఱుఁబాఱెడి విష్ణుభటులు, మిమ్ము నెగచుట దైవంబు మేర గాదె? మనకు నెప్పుడు దైవంబు మంచిదగును, నాఁడు గెలుతము పగవారి; నేఁడు వలదు. |
635 |
| వ. | అదియునుంగాక. | 636 |
| క. |
బలు దుర్గంబులు సచివులు, బలములు మంత్రౌషధములు బహుశేముషియుం గలిగియు సామోపాయం, బులఁ గాల మెఱింగి నృపుఁడు పోరుట యొప్పున్. |
637 |
| వ. | అట్లు గావున రణంబున కిప్పుడు శత్రులకెదురు మోహరించుట కార్యంబు గాదు; మనకుం దగు కాలంబున జయింతము; నలంగక తలంగుఁ డనినఁ దలంగి భాగవత భట భీతులై చిక్కి రక్కసులు రసాతలంబునకుం జని; రంత హరి హృదయం బెఱింగి తార్‌క్ష్యనందనుండు యాగసుత్యాహంబున వారుణ పాశంబుల నసురవల్లభుని బంధించె; నంత. | 638 |
| క. |
బాహులుఁబదములుఁగట్టిన, ‘శ్రీహరికృప గాక యేమి సేయుదు?’ నని సం దేహింపక బలి నిలిచెను, హాహారవ మెసఁగె దశ దిగంతములందున్. |
639 |
| క. |
సంపద సెడియును దైన్యముఁ, గంపంబును లేక తొంటికంటెను బెంపుం దెంపును నెఱుకయు ధైర్యము, వంపని సురవైరిఁజూచి వటుఁడిట్లనియెన్. |
640 |
| సీ. |
దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు రంతభూమియు నొక్క యడుగయ్యె నాకును;, స్వర్లోకమును నొక్క చరణమయ్యె; నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు; గడమ పాదమునకుఁగలదె భూమి? యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు నిరయంబుఁబొందుట నిజము గాదె? |
|
| తే. |
కాన దుర్గతికిని గొంతకాల మరుగు, కాక యిచ్చెదవేని వేగంబు నాకు నిపుడు మూఁడవ పదమున కిమ్ము చూపు, బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె? |
641 |
| వ. | అని యిట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్యనికృత్త హృదయుండయ్యును విషణ్ణుండు గాక వైరోచని ప్రసన్నవదనంబుతోడఁజిన్నిప్రోడ వడుగున కి ట్లనియె. | 642 |
| ఆ. |
సూనృతంబ గాని సుడియదు నా జిహ్వ, బొంకఁజాల; నాకు బొంకు లేదు; నీ తృతీయపదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ! |
643 |
| ఆ. |
నిరయమునకుఁ బ్రాప్తనిగ్రహంబునకును, బదవిహీనతకును బంధనమున కర్థభంగమునకు నఖిలదుఃఖమునకు, వెఱవ దేవ! బొంక వెఱచినట్లు. |
644 |
| వ. | అదియునుంగాక. | 645 |
| సీ. |
తల్లిదండ్రులు, నన్నదమ్ములుఁ, జెలికాండ్రు, గురువులు శిక్షింపఁగొఱఁతవడునె? పిదప మేలగుఁగాక! పృథుమదాంధులకును దానవులకు మాకుఁదఱియెఱింగి విభ్రంశచక్షువు వెలయ నిచ్చుటఁజేసి గురువులలో నాదిగురువ వీవ; నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో నష్టియో బాధయో తలంప |
|
| తే. |
నిన్ను నెదిరించి పోరాడి నిర్జరారు, లాది యోగీంద్రు లందెడునట్టి టెంకి నందరే తొల్లి పెక్కండ్రు? హర్షమూర్తి!, యీశ! నీయెడ దుర్లభమేమి గలదు? |
646 |
| మ. |
చెలియే మృత్యువు? చుట్టమే యముఁడు? సంసేవార్థులే కింకరుల్? శిలలంజేసెనె బ్రహ్మ దన్ను? దృఢమే జీవంబు? నో చెల్లరే! చలితంబౌట యెఱుంగ కీ కపట సంసారంబు నిక్కంబుగాఁ దలఁచున్ మూఢుఁడు సత్యదానకరుణాధర్మాదినిర్ముక్తుఁడై. |
647 |
| సీ. |
చుట్టాలు దొంగలు; సుతులు ఋణస్థులు; కాంతలు సంసారకారణములు; ధనము లస్థిరములు; దను వతి చంచల; కార్యార్థు లన్యులు గడచుఁగాల మాయువు సత్వర మైశ్వర్య మతిశీఘ్రమని కాదె తమ తండ్రి నతకరించి మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు నీ పాదకమలంబు నియతిఁ జేసె |
|
| తే. |
భద్రుఁ డతనికి మృతిలేని బ్రదుకు గలిగె, వైరులై కాని తొల్లి మావారు గాన రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్లఁ, బద్మలోచన! మా పుణ్యఫలము గాదె? |
648 |
| వ. | అని యిట్లు పలుకుచున్న యవసరంబున. | 649 |
| శా. |
ఆ దైత్యేంద్రుఁడు పీనవక్షు, నవపద్మాక్షుం, బిశంగాంబరా చ్ఛాదున్, నిర్మలసాధువాదు, ఘనసంసారాదివిచ్ఛేదు, సం శ్రీదున్, భక్తిలతాతిరోహిత హరి శ్రీపాదు నిఃఖేదుఁ బ్ర హ్లాదున్ బోధకళావినోదుఁగనియెన్ హర్షంబుతో ముందటన్. |
650 |
| వ. | ఇట్లు సమాగతుండైన తమ తాతం గనుంగొని విరోచన నందనుండు వారుణపాశబద్ధుండు గావునఁ దనకుం దగిన నమస్కారంబు సేయరామింజేసి సంకులాశ్రువిలోల లోచనుండై సిగ్గుపడి నతశిరస్కుండై నమ్రభావంబున మ్రొక్కు సెల్లించె; నంతఁ బ్రహ్లాదుండు ముఖమండపంబున సనందాది పరిచర సమేతుండై కూర్చున్న వామనదేవునిం గని యానందబాష్పంబులుఁ బులకాంకురంబులున్ నెఱయ దండప్రణామం బాచరించి యిట్లని విన్నవించె. | 651 |
| సీ. |
ఇతనికి మున్ను నీ వింద్రపదం బిచ్చి నేఁడు త్రిప్పుటయును నెఱయ మేలు మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమసవికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటగాక బంధించుటే? తత్త్వజ్ఞునకు మహేంద్రత్వమేల? నీ పాదకమలంబు నియతిఁ గొల్చిన దానిఁ, బోలునే సురరాజ్యభోగపరత? |
|
| తే. |
గర్వమేపారఁ గన్నులు గానరావు;, చెవులు వినరావు; చిత్తంబు సిక్కుపడును; మఱచు నీ సేవలన్నియు మహిమ మాన్పి, మేలు సేసితి నీ మేటి మేర సూపి. |
652 |
| వ. | అని పలికి జగదీశ్వరుండు నిఖిలలోక సాక్షియు నగు నారాయణదేవునకు నమస్కరించి ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున. | 653 |
| మ. |
తతమత్తద్విపయానయై కుచనిరుంధచ్చోళసంవ్యానయై ధృతబాష్పాంబువితానయై కరయుగాధీనాలికస్థానయై ‘పతిభిక్షాం మమ దేహి కోమలమతే! పద్మాపతే!’ యంచుఁ ద త్సతి వింధ్యావలి సేరవచ్చెఁద్రిజగద్రక్షామనున్ వామనున్. |
654 |
| వ. | వచ్చి యచ్చేడియ తచ్చరణ సమీపంబునం బ్రణతయై నిలువంబడి యిట్లనియె. | 655 |
| క. |
నీకుంగ్రీడార్థములగు, లోకంబుల జూచి పరులు లోకులు కుమతుల్ లోకాధీశుల మందురు, లోకములకు రాజ వీవ లోకస్తుత్యా! |
656 |
| క. |
కా దనఁడు పొమ్ము లే దీ, రాదనఁడు జగత్త్రయైకరాజ్యము నిచ్చెన్ నా దయితుఁగట్ట నేటికి?, శ్రీదయితాచిత్తచోర! శ్రితమందారా! |
657 |
| వ. | అని యిట్లు వింధ్యావళియుం బ్రహ్లాదుండును విన్నవించు నవసరంబున హిరణ్యగర్భుండు సనుదెంచి యిట్లనియె. | 658 |
| సీ. |
భూతలోకేశ్వర! భూతభావన! దేవదేవ! జగన్నాథ! దేవవంద్య! తనసొమ్ము సకలంబుఁ దప్పక నీ కిచ్చె దండయోగ్యుఁడు గాఁడు దానపరుఁడు; గరుణింప నర్హుండు గమలలోచన! నీకు; విడిపింపు మీతని వెఱపు దీర్చి; తోయపూరము సల్లి దూర్వాంకురంబులఁ జేరి నీ పదము లర్చించునట్టి |
|
| తే. |
భక్తియుక్తుఁడు; లోకేశపదము నందు, నీవు ప్రత్యక్షముగ వచ్చి నేఁడు వేఁడ నెఱిఁగి తన రాజ్య మంతయు నిచ్చినట్టి, బలికిఁదగునయ్య దృఢపాశబంధనంబు? |
659 |
| వ. | అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుం డిట్లనియె. | 660 |
| సీ. |
‘ఎవ్వనిఁగరుణింప నిచ్ఛయించితి వాని యఖిలవిత్తంబు నే నపహరింతు సంసారగురుమదస్తబ్ధుఁడై యెవ్వఁడు, దెగడి లోకము నన్ను ధిక్కరించు నతఁడెల్లకాలంబు నఖిలయోనులయందుఁ బుట్టుచు దుర్గతిఁ బొందుఁ బిదప విత్తవయోరూపవిద్యాబలైశ్వర్య కర్మజన్మంబుల గర్వ ముడిగి |
|
| తే. |
యేకవిధమున విమలుఁడై యెవ్వఁ డుండు, వాఁడు నా కూర్చి రక్షింపవలయువాఁడు; స్తంభలోభాభిమానసంసారవిభవ, మత్తుఁడై చెడ నొల్లఁడు మత్పరుండు. |
661 |
| శా. |
బద్ధుండై గురుశాపతప్తుఁడయి తా బంధువ్రజత్యక్తుఁడై సిద్ధైశ్వర్యముఁగోలుపోయి విభవక్షీణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యముంగరుణయున్ సొంపేమియుందప్పఁ డు ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుం డితం డల్పుఁడే? |
662 |
| ఆ. |
అసురనాథుఁడనుచు ననఘుని మర్యాద, యేను జూత మనుచు నింత వలుక నిజము వలికె నితఁడు నిర్మలాచారుండు, మేలు మేలు నాకు మెచ్చువచ్చు. |
663 |
| క. |
సావర్ణిమనువు వేళను, దేవేంద్రుండగు నితండు దేవతలకు; దు ర్భావిత మగు నా చోటికి, రావించెద; నంతమీఁద రక్షింతు దయన్. |
664 |
| క. |
వ్యాధులు దప్పులు నొప్పులు, బాధలు చెడి విశ్వకర్మభావిత దనుజా రాధితసుతలాలయమున, నేధిత విభవమున నుండు నితఁ డందాఁకన్’. |
665 |
| వ. | అని పలికి బలిం జూచి భగవంతుం డిట్లనియె. | 666 |
| సీ. |
సేమంబు నీ కింద్రసేనమహారాజ! వెఱవకు! మేలు నీ వితరణంబు వేలుపు లందుండి వేడుక పడుదురు; దుఃఖంబు లిడుమలు దుర్మరణము లాతురతలు నొప్పు లందుండువారికి నొందవు; సుతలమందుండు నీవు నీ పంపు సేయని నిర్జరారాతుల నా చక్ర మేతెంచి నఱకుచుండు |
|
| ఆ. |
లోకపాలకులకు లోనుగా వక్కడ, నన్యు లెంతవార లచట?నిన్ను నెల్ల ప్రొద్దు వచ్చి యేను రక్షించెదఁ, గరుణతోడ నీకుఁ గానవత్తు. |
667 |
| క. |
దానవదైత్యుల సంగతిఁ, బూనిన నీ యసురభావమును దోడ్తో మ ద్ధ్యానమునఁదొలఁగి పోవును, మానుగ సుతలమున నుండుమా మా యాజ్ఞన్. |
668 |
| వ. | అని యిట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుకవేల్పు తియ్యని నెయ్యంపుఁ బలుకుఁ జెఱకు రసంపుసోనలు వీనుల తెరువులం జొచ్చి లోను బయలు నిండి ఱెప్పల కప్పు దప్పం ద్రోచికొని కనుఁగవ కొలంకుల నలుఁగులు వెడలిన చందంబున సంతసంబునం గన్నీరు మున్నీరై పఱవ, నురః ఫలకంబునం బులకంబులు కులకంబులయి తిలకంబు లొత్తఁ, గేలు మొగిడ్చి నెక్కొన్న వేడుకం ద్రొక్కుడువడుచుఁ జిక్కని చిత్తంబునఁజక్కని మాటల రక్కసులఱేఁడిట్లనియె. | 669 |
| ఉ. |
ఎన్నడు లోకపాలకుల నీ కృపఁజూడని నీవు నేఁడు న న్నున్నతుఁజేసి నా బ్రదుకు నోజయు నానతి యిచ్చి కాచి; తీ మన్నన లీ దయారసము మాటల పెద్దఱికంబుఁ జాలదే? పన్నగతల్ప! నిన్నెఱిఁగి పట్టిన నాపద గల్గనేర్చునే? |
670 |
| వ. | అని పలికి హరికి నమస్కరించి, బ్రహ్మకుం బ్రణామంబు సేసి, యిందుధరునకు వందనం బాచరించి, బంధవిముక్తుండై తన వారలతోఁ జేరికొని బలి సుతలంబునకుఁ జనియె; నంత హరి కృపావశంబునం గృతార్థుండై కులోద్ధారకుండయిన మనుమనిం గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతున కిట్లనియె. | 671 |
| సీ. |
చతురాననుఁడు నీ ప్రసాదంబు గానఁడు; శర్వుఁడీ లక్ష్ముల జాడఁబొందఁ, డన్యుల కెక్కడి? దసురులకును మాకు బ్రహ్మాదిపూజితపదుఁడ వయిన దుర్లభుండవు నీవు దుర్గపాలుఁడ వైతి; పద్మజాదులు భవత్పాదపద్మ మకరంద సేవనమహిమ నైశ్వర్యంబు లందిరి కాక మే మల్పమతుల |
|
| తే. |
మధిక దుర్యోనులము కుత్సితాత్మకులము, నీ కృపాదృష్టిమార్గంబు నెలవు సేర నేమి తప మాచరించితి మెన్నఁగలమె?, మమ్ముఁగాచుట చిత్రంబు మంగళాత్మ! |
672 |
| వ. | అదియునుంగాక. | 673 |
| ఆ. |
సర్వగతుఁడ వయ్యు సమదర్శనుఁడ వయ్యు, నొకట విషమవృత్తి నుండు దరయ నిచ్చ లేనివారి కీవు భక్తులు గోరు, తలఁపు లిత్తు కల్పతరువుమాడ్కి. |
674 |
| వ. | అని విన్నవించుచున్న ప్రహ్లాదుంజూచి, పరమపురుషుం డిట్లనియె. | 675 |
| తే. |
వత్స! ప్రహ్లాద! మేలు నీ వారి నీవు, సొరిది మనుమనిఁదోడ్కొని సుతలమునకుఁ బయనమై పొమ్ము నే గదాపాణి నగుచుఁ, జేరి రక్షింతు దురితంబు సెంద దచట. |
676 |
| వ. | అని యిట్లు నియమించినఁ బరమేశ్వరునకు నమస్కరించి వలగొని కరకమల పుటఘటిత నిటల తటుండై, వీడ్కొని బలిం దోడ్కొని సకల సురయూథంబునుం దానునొక్క మహాబిలద్వారంబు సొచ్చి ప్రహ్లాదుఁడు సుతలలోకంబునకుం జనియె; నంత బ్రహ్మవాదులయిన యాజకుల సభామధ్యంబునం గూర్చున్న శుక్రునింజూచి నారాయణుం డిట్లనియె. | 677 |
| ఆ. |
‘ఏమి గొఱఁత వడియె నీ బలి జన్నంబు, విస్తరింపు కడమ విప్రవర్య! విషమ మయిన కర్మ విసరంబు బ్రాహ్మణ, జనులు సూచినంత సమతఁ బొందు’ |
678 |
| వ. | అనిన శుక్రుం డిట్లనియె. | 679 |
| సీ. |
అఖిలకర్మంబుల కధినాథుఁడవు నీవ; యజ్ఞేశుఁడవు నీవు యజ్ఞపురుష! ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందినఁ గడ మేల కల్గునేకర్మములకు? ధనదేశకాలార్హతంత్రమంత్రంబులఁ గొఱఁతలు నిన్నుఁ బేర్కొనిన మాను; నయినఁగావింతు నీ యానతి; భవదాజ్ఞ మెలఁగుట జనులకు మేలు గాదె? |
|
| తే. |
యింతకంటెను శుభము నా కెచటఁ గలుగు, ననుచు హరిపంపు శిరమున నావహించి కావ్యుఁడసురేంద్రుజన్నంబు కడమఁదీర్చె, మునులు విప్రులు సాహాయ్యమునఁజరింప. |
680 |
| వ. | ఇ వ్విధంబున వామనుండయి హరి బలినడిగి, మహిం బరిగ్రహించి, తనకు నగ్రజుండగు నమరేంద్రునకుం ద్రిదివంబు సదయుండయి యొసంగె; నత్తఱి దక్షభృగుప్రముఖ ప్రజాపతులును, భవుండును, గుమారుండును, దేవర్షి పితృగణంబులును, రాజులును, దానును గూడికొని చతురాననుండు గశ్యపునకు నదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలురకు ‘వామనుండు వల్లభుం’డని నియమించి యంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు స్వర్గాపవర్గంబులకు ‘నుపేంద్రుండు ప్రధానుం’ డని సంకల్పించె; నా సమయంబున. | 681 |
| క. |
కమలజుఁడు లోకపాలురు, నమరేంద్రునిఁగూడి దేవయానంబున న య్యమరావతికిని వామను, నమరంగొనిపోయి రంత నటమీఁద నృపా! |
682 |
| ఆ. |
బల్లిదంపుఁదోడు ప్రాపున నింద్రుని, కింద్రపదము సేరు టిట్లు గలిగెఁ; దనకు నాఢ్యుఁడైన తమ్ముఁడు గలిగినఁ, గోర్కు లన్న కేల కొఱఁత నొందు? |
683 |
| క. |
పాలడుగఁడు మేలడుగం, డేలఁడు భిక్షించి యన్న కిచ్చెఁద్రిజగముల్ వేలుపులతల్లి కడపటి, చూలుం బోలంగఁ గలరె సొలయని తమ్ముల్. |
684 |
| ఆ. |
కడుపు బదరగాఁగఁ గొడుకులఁగనుకంటెఁ, దల్లికొకఁడె చాలు బల్లిదుండు; ద్రిదశగణముఁగన్న యదితి కానుపు దీర్చి, జిన్ని మేటివడుగుఁగన్న యట్లు. |
685 |
| వ. | ఇట్లు దేవేంద్రుండు వామన భుజపాలితం బగు త్రిభువన సామ్రాజ్య విభవంబు మరల నంగీకరించె; నప్పుడు బ్రహ్మయు, శర్వుండును, గుమారుండును, భృగుప్రముఖులయిన మునులును, బితృదేవతలును, దక్షాదిప్రజాపతులును, సిద్ధులును, వైమానికులును మఱియుం దక్కినవారలును, బరమాద్భుతంబైన విష్ణుని సుమహాకర్మంబులకు నాశ్చర్యంబు నొందుచుఁ, ప్రశంసించుచు, నాడుచుం, బాడుచుం, దమతమ నివాసంబులకుం జని; రని చెప్పి శుకుం డిట్లనియె. | 686 |
| తే. |
మనుజనాథ! త్రివిక్రము మహిమ కొలఁది, యెఱుఁగఁదర్కింప లెక్కింప నెవ్వఁడోపుఁ? గుంభినీరేణుకణములు గుఱుతుపెట్టు, వాఁడు నేరఁడు దక్కినవారి వశమె? |
687 |
| క. |
అద్భుతవర్తనుఁడగు హరి, సద్భావితమైన విమలచరితము విను వాఁ డుద్భటవిక్రముఁడై తుది, నుద్భాసితలీలఁబొందు నుత్తమగతులన్. |
688 |
| తే. |
తగిలి మానుష పైతృక దైవకర్మ, వేళలందుఁ ద్రివిక్రమవిక్రమంబు లెక్క డెక్కడఁ గీర్తింతు రెవ్వరేనిఁ, బొందుదురు నిత్యసౌఖ్యంబు భూవరేంద్ర! |
689 |