| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| మ. |
అమరేంద్రాశకుఁబూర్ణచంద్రుఁడుదితుండైనట్లు నారాయణాం శమునంబుట్టె మదాంధరావణశిరస్సంఘాతసంఛేదన క్రమణోద్దాముఁడు రాముఁ డా గరితకుంగౌసల్యకున్ సన్నుతా సమనైర్మల్యకతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్. |
259 |
| మ. |
సవరక్షార్థము దండ్రి పంపఁజని విశ్వామిత్రుఁడుందోడ రా నవలీలం దునుమాడె రాముఁ డదయుండై బాలుఁడై కుంతల చ్ఛవిసంపజ్జితహాటకం గపటభాషావిస్ఫురన్నాటకన్ జవభిన్నార్యమఘోటకం గరవిరాజత్ఖేటకం దాటకన్. |
260 |
| క. |
గారామునఁ గౌశికమఖ, మా రాముఁడు గాచి దైత్యు నధికు సుబాహున్ ఘోరాజిఁద్రుంచి తోలెను, మారీచు న్నీచుఁగపటమంజులరోచున్. |
261 |
| మ. |
ఒక మున్నూఱు గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షుచాపంబు బా లకరీంద్రంబు సులీలమైఁ జెఱకుఁగోలం ద్రుంచు చందంబునన్ సకలోర్వీశులుఁజూడఁగా విఱిచె దోశ్శక్తిన్ విదేహక్షమా పక గేహంబున సీతకై గుణమణిప్రస్ఫీతకై లీలతోన్. |
262 |
| క. |
భూతలనాథుఁడు రాముఁడు, ప్రీతుండై పెండ్లి యాడెఁ బృథుగుణమణి సం ఘాతన్ భాగ్యోపేతన్, సీతన్ ముఖకాంతివిజిత సితఖద్యోతన్. |
263 |
| క. |
రాముఁడు నిజబాహుబల, స్థేమంబున భంగపఱిచె దీర్ఘకుఠారో ద్దామున్ విదళీకృతనృప, భామున్ రణరంగభీము భార్గవరామున్. |
264 |
| క. |
దశరథుడు మున్ను గైకకు, వశుఁడై తా నిచ్చినట్టి వరము కతన వా గ్దశ చెడక యడవి కనిచెను, దశముఖముఖకమలతుహినధామున్ రామున్. |
265 |
| క. |
జనకుఁడు పనిచిన మేలని, జనకజయును లక్ష్మణుండు సంసేవింపన్ జనపతి రాముఁడు విడిచెను, జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్. |
266 |
| క. |
భరతున్ నిజపదసేవా, నిరతున్ రాజ్యమున నునిచి నృపమణి యెక్కెన్ సురుచిర రుచిపరిభావిత, గురుగోత్రాచలముఁ జిత్రకూటాచలమున్. |
267 |
| ఉ. |
పుణ్యుఁడు రామచంద్రుఁడట వోయి ముదంబునఁగాంచె దండకా రణ్యముఁ దాపసోత్తము శరణ్యము నుద్ధతబర్హిబర్హ లా వణ్యము గౌతమీవిమల వాఃకణపర్యటనప్రభూత సా ద్గుణ్యము నుల్లసత్తరునికుంజవరేణ్యము నగ్రగణ్యమున్. |
268 |
| సీ. |
ఆ వనంబున రాముఁడనుజసమేతుఁడై, సతితోడ నొక పర్ణశాల నుండ రావణు చెల్లెలు రతిఁగోరి వచ్చిన మొగి లక్ష్మణుఁడు దాని ముక్కు గోయ నది విని ఖరదూషణాదులు పదునాల్గు వేవురు రా రామవిభుఁడు కలన బాణానలంబున భస్మంబు గావింప జనకనందన మేని చక్కఁదనము |
|
| తే. |
విని దశగ్రీవుఁ డంగజ వివశుఁడగుచు, నర్థిఁబంచిన బసిఁడిఱ్ఱి యై నటించు నీచు మారీచు రాముఁడు నెఱి వధించె, నంతలో సీతఁగొనిపోయె నసురవిభుఁడు. |
269 |
| ఉ. |
ఆ యసురేశ్వరుండు వడి నంబరవీథి నిలాతనూజ న న్యాయము సేసి నిష్కరుణుఁడై కొనిపోవఁగ నడ్డమైన ఘో రాయతహేతిఁద్రుంచె నసహాయత రామనరేంద్రకార్యద త్తాయువుఁబక్షవేగపరిహాసితవాయువు న జ్జటాయువున్. |
270 |
| వ. | అంత నా రామచంద్రుండు లక్ష్మణసహితుండై, సీత వెదక నరుదెంచి, నిజకార్యనిహతుండైన జటాయువునకుం బరలోక క్రియలు గావించి ఋశ్యమూకంబునకుం జని. | 271 |
| క. |
నిగ్రహము నీకు వల దిఁక, నగ్రజు వాలిన్ వధింతు నని నియమముతో నగ్రేసరుగా నేలెను, సుగ్రీవున్ చరణఘాతచూర్ణగ్రావున్. |
272 |
| క. |
లీలన్ రామవిభుండొక, కోలం గూలంగ నేసె గురు నయశాలిన్ శీలిన్ సేవితశూలిన్, మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మూలిన్. |
273 |
| క. |
ఇలమీఁద సీత వెదకఁగ, నలఘుఁడు రాఘవుఁడు పనిచె హనుమంతు నతి చ్ఛలవంతున్ మతిమంతున్, బలవంతున్ శౌర్యవంతుఁ బ్రాభవవంతున్. |
274 |
| క. |
అలవాటు కలిమి మారుతి, లలితామితలాఘవమున లంఘించెను శై వలినీగణసంబంధిన్, జలపూరితధరణిగగనసంధిన్ గంధిన్. |
275 |
| వ. | ఇట్లు సముద్రంబు దాఁటి సీతంగని, హనుమంతుండు దిరిగి చనుదెంచుచు నక్షకుమారాదుల వధియించి. | 276 |
| క. |
సముదగ్రత ననిలసుతుం, డమరాహితదత్తవాలహస్తాగ్నుల భ స్మము సేసె నిరాతంకన్, సమదాసుర సుభటవిగతశంకన్ లంకన్. |
277 |
| వ. | ఇట్లు లంకాదహనంబు చేసి వచ్చి వాయుజుండు సీతాకథనంబు సెప్పిన విని రామచంద్రుండు వనచరనాథ యూథంబులుం దానును, జని చని. | 278 |
| శా. |
ఆ రాజేంద్రుఁడు గాంచె, భూరివిధరత్నాగారమున్ మీన కుం భీరగ్రాహకఠోరమున్ విపులగంభీరంబు నభ్రభ్రమ ద్ఘోరాన్యోన్య విభిన్న భంగభవ నిర్ఘోషచ్ఛటాంభఃకణ ప్రారుద్ధాంబరపారమున్ లవణపారావారమున్ జేరువన్. |
279 |
| వ. | కని తనకుఁ ద్రోవ యిమ్మని వేఁడిన నదియు మార్గంబు సూపక మిన్నందిన నా రాచపట్టి రెట్టించిన కోపంబున. | 280 |
| క. |
మెల్లని నగవున నయనము, లల్లార్చి శరంబు విల్లు నందినమాత్రన్ గుల్లలు నాఁచులుఁజిప్పలుఁ, బెల్లలునై జలధి పెద్ద బీడై యుండెన్. |
281 |
| వ. | ఇట్లు విపన్నుండగు సముద్రుండు నదులతోఁ గూడి మూర్తి మంతుండయి చనుదెంచి రామచంద్రుని చరణంబులు శరణంబుఁజొచ్చి యిట్లని స్తుతియించె. | 282 |
| శా. |
‘ఓ కాకుత్‌స్థకులేశ! యో గుణనిధీ! యో దీనమందార! నే నీ కోపంబున కెంతవాఁడ? జడధిన్; నీ వేమి భూరాజవే? లోకాధీశుఁడ; వాదినాయకుఁడ; వీ లోకంబు లెల్లప్పుడున్ నీ కుక్షిం బ్రభవించు; నుండు; నడఁగున్ నిక్కంబు సర్వాత్మకా! |
283 |
| క. |
ధాతల రజమున దేవ, వ్రాతము సత్త్వమున భూతరాశిఁదమమునన్ జాతులుఁగా నొనరించు గు, ణాతీతుఁడ వీవు గుణగణాలంకారా! |
284 |
| క. |
కట్టుము సేతువు. లంకంజుట్టుము, నీ బాణవహ్ని సురవైరితలల్ గొట్టుము నేలంబడఁ జే, పట్టుము నీ యబల నధికభాగ్యప్రభలన్. |
285 |
| ఆ. |
హరికి మామ నగుదు; నఁటమీఁద శ్రీదేవి, తండ్రి; నూరకేల? తాగడింపఁ గట్టఁగట్టి దాఁటు కమలాప్తకులనాథ, నీ యశోలతలకు నెలవు గాఁగ. |
286 |
| వ. | అని విన్నవించిన రామచంద్రుండు సముద్రునింబూర్వప్రకారంబున నుండు; పొమ్మని వీడుకొల్పె; నంత. | 287 |
| క. |
ఘనశైలంబులుఁదరువులు, ఘనజవమునఁబెఱికి తెచ్చి కపికులనాథుల్ ఘనవనరాశింగట్టిరి, ఘనవాహప్రముఖ దివిజగణము నుతింపన్. |
288 |
| వ. | ఇట్లు సముద్రంబు దాఁటి రామచంద్రుండు రావణు తమ్ముండైన విభీషణుండు శరణంబు వేఁడిన నభయం బిచ్చి కూడుకొని లంకకుఁజని విడిసి వేడె పెట్టించి లగ్గలు పట్టించిన. | 289 |
| సీ. |
ప్రాకారములు ద్రవ్వి, పరిఖలు పూడిచి కోటకొమ్మలు నేలఁగూలఁద్రోచి వప్రంబు లగలించి వాకిళ్లు పెకలించి తలుపులు విఱచి యంత్రములు సెఱిచి ఘనవిటంకంబులు ఖండించి పడవైచి గోపురంబులు నేలఁగూలఁదన్ని మకరతోరణములు మహిఁగూల్చి కేతనంబులు సించి సోపానములు గదల్చి |
|
| ఆ. |
గృహము లెల్ల వ్రచ్చి గృహరాజముల గ్రొచ్చి, భర్మకుంభచయము పాఱవైచి కరులు కొలను సొచ్చి కలఁచిన కైవడిఁ, గపులు లంకఁ జొచ్చి కలఁచి రపుడు. |
290 |
| వ. | అంత న య్యసురేంద్రుడు పంచిన గుంభ, నికుంభ, ధూమ్రాక్ష, విరూపాక్ష, సురాంతక, నరాంతక, దుర్ముఖ, ప్రహస్త, మహాకాయ ప్రముఖులగు దనుజవీరులు శరశరాసన తోమర గదా ఖడ్గ శూల భిందిపాల పరశు పట్టిస ప్రాస ముసలాది సాధనంబులు ధరియించి మాతంగ తురంగ స్యందన సందోహంబుతో బవరంబు సేయు సుగ్రీవ పవనతనయ పనస గజ గవయ గంధమాదన నీల కుముద జాంబవదాదు లా రక్కసుల నెక్కటి కయ్యంబులందుఁ దరుల, గిరులఁ, గరాఘాతంబుల నుక్కడంచి రంత. | 291 |
| క. |
ఆ యెడ లక్ష్మణుఁ డుజ్జ్వల, సాయకములఁ ద్రుంచె శైలసమకాయు సురా జేయు ననర్గళమాయో, పాయున్ నయగుణవిధేయు న య్యతికాయున్. |
292 |
| ఆ. |
రామచంద్రవిభుఁడు రణమున ఖండించె, మేటికడిమి నీలమేఘవర్ణు బాహుశక్తిపూర్ణుఁ బటుసింహనాద సం, కుచిత దిగిభకర్ణుఁ గుంభకర్ణు. |
293 |
| క. |
అలవున లక్ష్మణుఁ డాజి, స్థలి గూల్చెన్ మేఘనాదుఁ జటులాహ్లాదున్ బలభేది జయవినోదున్, బలజనితసుపర్వసుభటభావవిషాదున్. |
294 |
| వ. | అంత. | 295 |
| క. |
తనవారందఱు మ్రగ్గిన, ననిమిషపతివైరి పుష్పకారూఢుండై యనికి నడచి రామునితో, ఘనరౌద్రముతోడ నంపకయ్యము సేసెన్. |
296 |
| వ. | అ య్యవసరంబున. | 297 |
| క. |
సురపతిపంపున మాతలి, గురుతరమగు దివ్యరథముఁ గొనివచ్చిన, నా ధరణీవల్లభుఁ డెక్కెను, ఖరకరుఁ డుదయాద్రి నెక్కు కైవడి దోఁపన్. |
298 |
| వ. | ఇట్లు దివ్యరథారూఢుండయి రామచంద్రుండు రావణున కిట్లనియె. | 299 |
| మ. |
చపలత్వంబున డాఁగి హేమమృగమున్ సంప్రీతిఁ బుత్తెంచుటో కపటబ్రాహ్మణమూర్తివై యబల నా కాంతారమధ్యంబునం దపలాపించుటయో మదీయశితదివ్యామోఘబాణాగ్ని సం తపనం బేగతి నోర్చువాఁడవు? దురంతం బెంతయున్ రావణా! |
300 |
| క. |
నీ చేసిన పాపములకు, నీచాత్మక! యముఁడు వలదు నేఁ డిట నా నా రాచములఁ ద్రుంచివైచెద, ఖేచర భూచరులుఁ గూడి క్రీడన్ జూడన్. |
301 |
| వ. | అని పలికి. | 302 |
| మ. |
బలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండభీమంబుగాఁ బ్రళయోగ్రానలసన్నిభంబగు మహాబాణంబు సంధించి రా జలలాముండగు రాముఁడేసె ఖరభాషాశ్రావణున్ దేవతా బలవిద్రావణు వైరిదారజనగర్భస్రావణున్ రావణున్. |
303 |
| క. |
దశరథసూనుండేసిన, విశిఖము హృదయంబుఁదూఱ వివశుండగుచున్ దశకంధరుండు గూలెను, దశవదనంబులను రక్తధారలు దొరఁగన్. |
304 |
| వ. | అంత నా రావణుండు దెగుట విని. | 305 |
| సీ. |
కొప్పులు బిగి వీడి కుసుమమాలికలతో నంసభాగంబుల నావరింప సేసముత్యంబులు సెదరఁ గర్ణిక లూడఁ గంఠహారంబులు గ్రందుకొనఁగ వదనపంకజములు వాడి వాతెఱ లెండఁ గన్నీళ్ళవఱద లంగములు దడుప సన్నపు నడుములు జవ్వాడఁ బాలిండ్ల బరువులు నడుములఁబ్రబ్బికొనఁగ |
|
| ఆ. |
నెత్తి మోఁదికొనుచు నెఱిఁ బయ్యెదలు జాఱ, నట్టు నిట్టు తప్పుటడగు లిడుచు నసురసతులు వచ్చి రట భూత బేతాళ, సదనమునకు ఘోరకదనమునకు. |
306 |
| వ. | ఇట్లు వచ్చి తమ తమ నాథులం గని, శోకించి, రందు, మందోదరి రావణుం జూచి యిట్లనియె. | 307 |
| ఉ. |
హా దనుజేంద్ర! హా సురగణాంతక! హా హృదయేశ! నిర్జరేం ద్రాదుల గెల్చి నీవు కుసుమాస్త్రుని కోలల కోర్వలేక సో న్మాదమునన్ రఘుప్రవరు మానిని నేటికిఁదెచ్చి? తప్పు డేఁ గాదని చెప్పినన్ వినక కాలవశంబును బొంది తక్కటా! |
308 |
| ఆ. |
ఎండఁగాయ వెఱచు, నినుఁడు వెన్నెలఁగాయ, వెఱచు, విధుఁడు గాలి వీవ వెఱచు లంకమీఁద; నిట్టి లంకాపురికి మాకు, నధిప! విధవభావ మడరె నేఁడు. |
309 |
| క. |
దురితముఁ దలఁపరు గానరు, జరుగుదు రెటకైన నిమిష సౌఖ్యంబులకై పరవనితాసక్తులకును, బరధనరక్తులకు నిహముఁ బరముం గలదే? |
310 |
| వ. | అని విలపింప నంత విభీషణుండు రామచంద్రుని పంపు వడసి, రావణునకు దహనాది క్రియలు గావించె, నంత రాఘవేంద్రుండు నశోకవనంబున కేఁగి, శింశుపాతరుసమీపంబు నందు. | 311 |
| శా. |
దైతేయప్రమదాపరీత నతిభీతన్ గ్రంథిబంధాలక వ్రాతన్ నిశ్శ్వసనానిలాశ్రుకణజీవం జీవదారామ భూ జాతన్ శుష్కకపోలకీలితకరాబ్జాతం బ్రభూతం గృశీ భూతం బ్రాణసమేత సీతఁ గనియెన్ భూమీశుఁ డా ముందటన్. |
312 |
| వ. | కని రామచంద్రుండును దాపంబు నొంది, భార్యవలన దోషంబు లేకుండుట వహ్నివలనం బ్రకటంబు సేసి, దేవతల పంపున దేవింజేకొని. | 313 |
| ఉ. |
శోషితదానవుండు నృపసోముఁడు రాముఁడు రాక్షసేంద్రతా శేషవిభూతిఁగల్పసమజీవివి గ మ్మని నిల్పె నర్థి సం తోషణుఁబాపశోషణు నదూషణు శశ్వదరోషణున్ మితా భాషణు నార్యపోషణుఁగృపాగుణభూషణు న వ్విభీషణున్. |
314 |
| వ. | ఇట్లు విభీషణ సంస్థాపనుండై రామచంద్రుండు సీతాలక్ష్మణసమేతుండై, సుగ్రీవహనుమదాదులం గూడికొని, పుష్పకారూఢుండై , వేల్పులు గురియు పువ్వుల సోనలం దడియుచుఁ దొల్లి వచ్చిన తెరువు జాడలు సీతకు నెఱింగించుచు, మరలి నందిగ్రామంబునకు వచ్చె; నయ్యవసరంబున. | 315 |
| ఆ. |
రామచంద్రవిభుని రాక వీనుల విని, భరతుఁడుత్సహించి పాదుకలను మోచికొనుచు వచ్చి ముదముతోఁబురజను, లెల్లఁ గొలువ నన్న కెదురు వచ్చె. |
316 |
| వ. | వచ్చి, పాదుకల ముందట నిడికొని, యెడనెడ సాష్టాంగ దండప్రణామంబులు సేయుచు, మెల్లమెల్లన డాసి, రామచంద్రుని పాదంబులు దన నొసలం గదియించి, తచ్చరణ రేణువులు దుడిచి, శిరంబునం జల్లికొని తనివిలేక మఱియు, నప్పదకమలంబు లక్కున మోపికొనుచు, సంతసంపుఁగన్నీటం గడిగి, సేమంబు లరయుచుండె. నంత సీతాలక్ష్మణ సహితుండై విభుండును, దన కెదురు వచ్చిన బ్రాహ్మణ జనంబులకు నమస్కరించి తక్కిన వారలచేత మన్ననలు వొంది వారల మన్నించె, నయ్యవసరంబున. | 317 |
| చ. |
నృపవర! పెక్కునాళ్ల గొలె నిన్ గనకుండిన యట్టి నేఁడు మా తపములు పండె నిందఱము ధన్యుల మైతి మటంచుఁబుట్టముల్ చపలతఁద్రిప్పి పువ్వుల వసంతము లాడుచుఁబాడుచున్ గత త్రపులయి యాడుచుం బ్రజలు దద్దయుఁబండుగ సేసి రెల్లెడన్. |
318 |
| సీ. |
కవ గూడి యిరుదెసఁగపిరాజు రాక్షస రాజు నొక్కెడఁజామరములు వీవ హనుమంతుఁడతి ధవళాతపత్రముఁ బట్టఁ బాదుకల్ భరతుండు భక్తిఁదేర శత్రుఘ్నుఁడమ్ములుఁజాపంబుఁగొనిరాఁగ సౌమిత్రి భృత్యుఁడై చనవుసూప జలపాత్ర చేఁబట్టి జనకజ గూడిరాఁ గాంచనఖడ్గ మంగదుఁడు మోవఁ |
|
| ఆ. |
బసిఁడి కేడె మర్థి భల్లూకపతి మోచి, కొలువఁబుష్పకంబు వెలయ నెక్కి గ్రహము లెల్లఁగొలువఁ గడు నొప్పు సంపూర్ణ, చంద్రుపగిది రామచంద్రుఁడొప్పె. |
319 |
| వ. | ఇట్లు పుష్పకారూఢుండై, కపిబలంబులు చేరి కొలువ, శ్రీరామచంద్రుం డయోధ్యకుం జనియె. నంతకు మున్న య ప్పురంబునందు. | 320 |
| సీ. |
వీథులు సక్కఁగావించి, తోయంబులు సల్లి రంభాస్తంభచయము నిలిపి పట్టుచీరెలు సుట్టి, బహుతోరణంబులు గలువడంబులు మేలుకట్లు గట్టి వేదిక లలికించి, వివిధరత్నంబుల మ్రుగ్గులు పలుచందములుగఁబెట్టి కలయ గోడల రామకథలెల్ల వ్రాయించి, ప్రాసాదముల దేవభవనములను |
|
| తే. |
గోపురంబుల బంగారు కుండలెత్తి యెల్ల వాకిండ్లఁగానుక లేర్పరించి జనులు గైసేసి తూర్యఘోషములతోడ నెదురు నడతెంచి రా రాఘవేంద్రుకడకు. |
321 |
| క. |
సమదగజదానధారల, దుమదుమలై యున్న పెద్ద త్రోవల తోడన్ రమణీయ మయ్యె నప్పురి, రమణుఁడు వచ్చినఁగరంగు రమణియపోలెన్. |
322 |
| ఆ. |
రామభూవరేంద్రు రాకఁదూర్యములతో, రథగజాశ్వసుభటరాజితోడ నమరెఁబురము, చంద్రుఁడరుదేర ఘూర్ణిల్లు, జంతుభంగమిళిత జలధిభంగి. |
323 |
| వ. | ‘ఇట్లొప్పుచున్న య ప్పురంబు ప్రవేశించి, రాజమార్గంబుల రామచంద్రుం డరుగుచున్న సమయంబున. | 324 |
| మ. |
‘ఇతఁడే రామనరేంద్రుఁ డీ యబల కాయింద్రారి ఖండించె న ల్లతఁడే లక్ష్మణుఁ డాతఁడే కపివరుం డా పొంతవాఁడే మరు త్సుతుఁ డాచెంగట నా విభీషణుఁ’ డటంచుం జేతులం జూపుచున్ సతులెల్లన్ బరికించి చూచిరి పురీసౌధాగ్రభాగంబులన్. |
325 |
| వ. | ఇట్లు సమస్త జనులు సూచుచుండ రామచంద్రుండు రాజమార్గంబునం జనిచని. | 326 |
| సీ. |
పటికంపు గోడలు పవడంపు వాకిండ్లు నీలంపు టరుగులు నెఱయఁ గలిగి కమనీయవైడూర్యక స్తంభ చయముల మకరతోరణముల మహిత మగుచుఁ బడగల మాణిక్యబద్ధచేలంబులఁ జిగురుతోరణములఁజెలువు మీఱి పుష్పదామకముల భూరివాసనలను బహుతరధూపదీపముల మెఱసి |
|
| తే. |
మాఱువేల్పుల భంగిని మలయుచున్న, సతులు పురుషులు నెప్పుడు సందడింప గుఱుతు లిడరాని ధనముల కుప్పలున్న, రాజసదనంబునకు వచ్చె రామవిభుఁడు. |
327 |
| వ. | ఇట్లు వచ్చి. | 328 |
| ఉ. |
తల్లుల కెల్ల మ్రొక్కి తమ తల్లికి వందన మాచరించి య ల్లల్ల బుధాలికిన్ వినతుఁడై చెలికాండ్రను దమ్ములం బ్రసం ఫుల్లతఁ గౌఁగిలించుకొని భూవరుఁడోలిఁ గృపారసంబు రం జిల్లఁగఁజాల మన్ననలు సేసె నమాత్యులఁ బూర్వభృత్యులన్. |
329 |
| వ. | తత్సమయంబునఁదల్లులు. | 330 |
| చ. |
కొడుకులుఁ బెద్దకోడలును గొబ్బున మ్రొక్కిన నెత్తి చేతులన్ బుడుకుచు మోములుం దలలు బోరన ముద్దులు గొంచు నవ్వుచున్ దొడలకు వారి రాఁదిగిచి తోఁగఁగఁ జేసిరి నేత్రధారలన్ వెడలిన ప్రాణముల్ దగఁ బ్రవిష్టము లయ్యె నటంచు నుబ్బుచున్. |
331 |
| వ. | అంత వసిష్ఠుండు, శ్రీరామచంద్రుని జటాబంధంబు విడిపించి, కులవృద్ధులుం, దానును సమంత్రకంబుగా దేవేంద్రుని మంగళస్నానంబు సేయించు బృహస్పతి చందంబున, సముద్ర నదీ జలంబుల నభిషేకంబు సేయించె; రఘువరుండును, సీతాసమేతుండై, జలంబు లాడి, మంచిపుట్టంబులు గట్టికొని, కమ్మని పువ్వులు దుఱిమి , సుగంధంబు లలందికొని, తొడవులు దొడిగికొని, తనకు భరతుండు సమర్పించిన రాజసింహాసనంబునం గూర్చుండి, యతని మన్నించి, కౌసల్యకుఁ బ్రియంబు సేయుచు, జగత్పూజ్యంబుగా రాజ్యంబు సేయుచుండె; నప్పుడు. | 332 |
| సీ. |
కలఁగు టెల్లను మానెఁగంధు లేడింటికిఁ; జలనంబు మానె భూచక్రమునకు; జాగరూకత మానె జలజలోచనునకు; దీనభావము మానె దిక్పతులకు; మాసి యుండుట మానె మార్తాండ విధులకుఁ; గావిరి మానె దిక్తటములకును; నుడిగి పోవుట మానె నుర్వీరుహంబుల; కణఁగుట మానెఁద్రేతాగ్నులకును; |
|
| ఆ. |
గడిఁది వ్రేఁగు మానెఁ గరి గిరి కిటి నాగ, కమఠములకుఁ; బ్రజల కలఁక మానె; రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు, ధరణి భరణరేఖఁదాల్చునపుడు. |
333 |
| వ. | మఱియును. | 334 |
| సీ. |
పొలఁతుల వాలుఁజూపులయంద చాంచల్య; మబలల నడుములయంద లేమి; కాంతాలకములంద కౌటిల్యసంచార; మతివల నడపులయంద జడిమ; ముగుదల పరిరంభములయంద పీడన; మంగనాకుచములయందు పోరు; పడఁతుల రతులంద బంధసద్భావంబు;సతులఁ బాయుటయంద సంజ్వరంబు; |
|
| తే. |
ప్రియులు ప్రియురాండ్ర మనముల బెరసి తార్పు, లంద చౌర్యంబు; వల్లభు లాత్మసతుల నాఁగి క్రొమ్ముళ్ళు పట్టులందక్రమంబు; రామచంద్రుండు పాలించు రాజ్యమందు. |
335 |
| క. |
తండ్రిక్రియ రామచంద్రుఁడు,దండ్రుల మఱపించి ప్రజలఁ దా రక్షింపన్ దండ్రుల నందఱు మఱచిరి, తండ్రిగదా రామచంద్రధరణిపుఁడనుచున్. |
336 |
| వ. | మఱియు, నా రామచంద్రుండు రాజర్షి చరితుండును, నిజధర్మనిరతుండును, నేకపత్నీ వ్రతుండును, సర్వలోక సమ్మతుండును నగుచు, ధర్మవిరోధంబు గాకుండఁ గోరిక లనుభవించుచుఁ ద్రేతాయుగంబైనఁ గృతయుగధర్మంబు గావించుచు, బాలమరణంబు మొదలగు నరిష్టంబులు ప్రజలకుఁ గలుగకుండ రాజ్యంబు సేయుచుండె, నయ్యెడ. | 337 |
| ఆ. |
సిగ్గువడుట గల్గి సింగారమును, గల్గి, భక్తి గల్గి చాల భయము గల్గి నయముఁ బ్రియముఁ గల్గి, నరనాథు చిత్తంబు, సీత దనకు వశము చేసికొనియె. |
338 |
| వ. | అనిన విని పరీక్షిన్నరేంద్రుఁ డిట్లనియె. | 339 |
| ఆ. |
భ్రాతృజనుల యందు బంధువులందును, బ్రజలయందు రాజభావ మొంది యెట్లు మెలఁగె? రాముఁడీశ్వరుండగు తన్నుఁ, గూర్చి క్రతువు లెట్లు గోరి చేసె?’ |
340 |
| వ. | అనిన శుకుం డిట్లనియె. | 341 |
| సీ. |
భగవంతుఁడగు రామభద్రుండు ప్రీతితో దేవోత్తముని సర్వదేవమయునిఁ దనుఁదాన కూర్చి యధ్వరములు సేసెను; హోతకుఁదూరుపు; నుత్తరంబు సామగాయకునికి; శమనదిగ్భాగంబు బ్రహ్మకుఁ; గ్రమమునఁబడమ రెల్ల నధ్వర్యునకు; శేష మాచార్యునకు నిచ్చి సొమ్ములు పంచి భూసురుల కొసఁగి |
|
| తే. |
తనదు రెండు పుట్టంబులుఁ దనకు నైన, మెలఁత మంగళసూత్రంబు మినుకుఁ దక్క వినతుఁడై యుండె; నా రాము వితరణంబు, పాండవోత్తమ! యేమని పలుకవచ్చు? |
342 |
| వ. | అంత నా రామచంద్రుని దానశీలత్వంబునకు మెచ్చి విప్రవరులు తమతమ భూములు మరల నిచ్చి యిట్లనిరి. | 343 |
| ఆ. |
ధరణి వలదు మాకుఁదపసుల కేల? నీ, వఖిలలోక గురుఁడవైన హరివి; మా మనంబులందు మలయు చీఁకటిఁ బాపు, భవ దుదారరుచులఁబార్థివేంద్ర! |
344 |
| వ. | అని పలికి బ్రహ్మణ్యదేవుండైన రామచంద్రుని వినయోక్తులం బూజించి మునులు సని రిట్లు పెద్దకాలంబు రాజ్యంబు సేసి, రాఘవేంద్రుం డొక్కదినంబున. | 345 |
| సీ. |
వసుధపైఁబుట్టెడు వార్త లాకర్ణించు కొఱకునై రాముండు గూఢవృత్తి నడురేయిఁదిరుగుచో నాగరజనములో నొక్కఁడు దన సతి యొప్పకున్న నొరునింటఁ గాఁపురం బున్న చంచలురాలిఁ బాయంగ లేక చేపట్ట నేమి తా వెఱ్ఱియగు రామధరణీశ్వరుండనే, బేల! పొమ్మను మాట బిట్టు వలుక |
|
| ఆ. |
నాలకించి మఱియు నా మాట చారుల, వలన జగములోనఁగలుగఁదెలిసి సీత నిద్రవోవఁ జెప్పక వాల్మీకి, పర్ణశాలఁబెట్టఁబనిచె రాత్రి. |
346 |
| వ. | అంత సీతయు గర్భిణి గావునఁ గుశలవు లనియెడి కొడుకులం గనియె. వారికి వాల్మీకి జాతకర్మంబు లొనరించె; లక్ష్మణునకు నంగదుండును, చంద్రకేతుండును; భరతునకుఁ దక్షుండును, బుష్కలుండును; శత్రుఘ్నునకు సుబాహుండును, శ్రుతసేనుండును సంభవించి రయ్యెడ. | 347 |
| క. |
బంధురబలుఁ డగు భరతుఁడు, గంధర్వచయంబుఁ ద్రుంచి కనకాదుల స ద్బంధుఁ డగు నన్న కిచ్చెను, బంధువులును మాతృజనులుఁ బ్రజలున్ మెచ్చన్. |
348 |
| ఆ. |
మధువనంబులోన మధునందనుండగు, లవణుఁజంపి భుజబలంబు మెఱసి మధుపురంబు సేసె మధుభాషి శత్రుఘ్నుఁ, డన్న రామచంద్రుఁడౌ ననంగ. |
349 |
| వ. | అంతఁ గొంతకాలంబునకు రామచంద్రుని కొమారులైన కుశలవు లిద్దఱును వాల్మీకివలన వేదాది విద్యలయందు నేర్పరులై పెక్కు సభలను సతానంబుగా రామకథాశ్లోకంబులు పాడుచు, నొక్కనాఁడు రాఘవేంద్రుని యజ్ఞశాలకుంజని. | 350 |
| మత్త. |
వట్టిమ్రాఁకులు పల్లవింప నవారియై మధుధార దా నుట్టఁబాడిన వారిపాటకు నుర్వరాధిపుఁడున్ బ్రజల్ బిట్టు సంతస మంది రయ్యెడఁ బ్రీతిఁ గన్నుల బాష్పముల్ దొట్ట నౌదల లూఁచి వారలతోడి మక్కువ పుట్టఁగాన్. |
351 |
| వ. | అంత నా రామచంద్రుండు కుమారుల కిట్లనియె. | 352 |
| ఆ. |
చిన్న యన్నలార! శీతాంశుముఖులార!, నళినదళ విశాలనయనులార! మధుర భాషులార! మహి మీఁద నెవ్వరు, తల్లి దండ్రి మీకు ధన్యులార! |
353 |
| వ. | అనిన వార‘లేము వాల్మీకిపౌత్త్రులము; రాఘవేశ్వరుని యాగంబు సూడవచ్చితి’ మనవుడు మెల్లన నగి ‘యెల్లి ప్రొద్దున మీ తండ్రి నెఱింగెద; రుండుండని యొక్క నివాసంబునకు సత్కరించి పనిచె; మఱునాఁడు సీతం దోడ్కొని కుశలవుల ముందట నిడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునింగని యనేకప్రకారంబుల వినుతించి యిట్లనియె. | 354 |
| ఆ. |
‘సీత శుద్ధురాలు, చిత్తవాక్కర్మంబు, లందు సత్యమూర్తి యమలచరిత పుణ్యసాధ్వి విడువఁబోలదు చేకొను, రవికులాబ్ధిచంద్ర! రామచంద్ర! |
355 |
| వ. | అని వాల్మీకి వలుక, రామచంద్రుండు పుత్రార్థియై విచారింపఁ, గుశలవులను వాల్మీకికి నొప్పగించి, రామచంద్ర చరణధ్యానంబు సేయుచు, నిరాశయై సీత భూవివరంబు సొచ్చె. నయ్యెడ. | 356 |
| మ. |
ముదితా! యేటికిఁగ్రుంకి తీవు మనలో మోహంబు చింతింపవే వదనాంభోజము సూపవే మృదువు నీ వాక్యంబు విన్పింపవే తుదిసేయం దగ దంచు నీశ్వరుఁడునై దుఃఖించె భూపాలుఁ డా పద గాదే ప్రియురాలిఁబాసినయెడన్ భావింప నెవ్వారికిన్? |
357 |
| వ. | అని వగచి, రామచంద్రుండు బ్రహ్మచర్యంబు ధరియించి, పదుమూఁడువేల యేం డ్లెడతెగకుండ నగ్ని హోత్రంబులు సెల్లించి, తానీశ్వరుండు గావునఁ దన మొదలి నెలవునకుంజనియె; ని వ్విధంబున. | 358 |
| ఆ. |
ఆదిదేవుఁడైన యా రామచంద్రుని, కబ్ధిఁగట్టు టెంత? యసురకోటిఁ జంపుటెంత? కపుల సాహాయ్య మది యెంత? సురల కొఱకుఁగ్రీడ చూపెఁగాక. |
359 |
| చ. |
వశుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతానివర్తికిన్ దశదిగధీశమౌళిమణిదర్పణమండితదివ్యకీర్తికిన్; దశశతభానుమూర్తికి సుధారుచిభాషికి సాధుపోషికిన్ దశరథరాజుపట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్. |
360 |
| ఉ. |
నల్లనివాఁడు, పద్మనయనంబులవాఁడు, మహాశుగంబులన్ విల్లును దాల్చువాఁడు, గడు విప్పగు వక్షమువాఁడు, మేలు పైఁ జల్లెడువాఁడు, నిక్కిన భుజంబులవాఁడు, యశంబు దిక్కులం జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁడీవుత మా కభీష్టముల్. |
361 |
| ఆ. |
రామచంద్రుఁగూడి రాకల పోకలఁ, గదిసి తిరుగువారుఁగన్నవారు నంటికొన్నవారు నా కోసల ప్రజ, లరిగి రాదియోగు లరుగు గతికి. |
362 |
| క. |
మంతనములు సద్గతులకు, పొంతనములు ఘనములైన పుణ్యముల కిదా నీంతనపూర్వమహాఘ ని, కృంతనములు రామనామకృతిచింతనముల్. |
363 |
| వ. | ఆ రామచంద్రునకుఁ గుశుండును, గుశునకు నతిథి, యతిథికి నిషధుండును, నిషధునకు నభుండును, నభునికిఁ బుండరీకుండును, బుండరీకునకు క్షేమధన్వుండును, క్షేమధన్వునకు దేవానీకుండును, దేవానీకునకు నహీనుండును, నహీనునకుఁ బారియాత్రుండును, బారియాత్రునకు బలుండును, బలునకు జలుండను, జలునకు నర్కసంభవుం డగు వజ్రనాభుండును, వజ్రనాభునకు శంఖణుండును, శంఖణునకు విధృతియును, విధృతికి హిరణ్యనాభుండును జనియించిరి. ఆ హిరణ్యనాభుండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్క్యముని వలన నధ్యాత్మయోగంబు నేర్చి, హృదయ కలుషంబులం బాసి యోగచర్యుండయ్యె; నా హిరణ్యనాభునకుఁ బుష్యుండును, బుష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు నగ్నివర్ణుండును, నగ్నివర్ణునకు శీఘ్రుండును, శీఘ్రునకు మరువను రాజశ్రేష్ఠుండును బుట్టి; రా రాజయోగి సిద్ధుండయి, కలాపగ్రామంబున నున్నవాఁడు; కలియుగాంతంబున నష్టం బయ్యెడు సూర్యవంశంబుఁ గ్రమ్మఱఁ బుట్టింపం గల వాఁ;డా మరువునకుఁ బ్రశుశ్రుకుండును, నాప్రశుశ్రుకునకు సంధియు, నతనికి నమర్షణుండును, నా యమర్షణునికి మహస్వంతుండును, నా మహస్వంతునకు విశ్వసాహ్యుండును, నా విశ్వసాహ్యునకు బృహద్బలుండును జనియించి, రా బృహద్బలుండు భారత యుద్ధంబున మీ తండ్రియగు నభిమన్యునిచేత హతుండయ్యె; వినుము. | 364 |