పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము
ధర్మరాజు కుంతిని వనంబునకుఁ బోవలదని ప్రార్థించుట. (సం. 15-22-19)
సీ. ఇది యేమి సేయంగ నెత్తి కొం టిమ్మాట | యాడకు; మేను ని న్నడవి కేఁగఁ
బనుతునే? మముఁ దొల్లి పనిచి పనుల్‌ గొను | భంగిన సామ్రాజ్య భార నిర్వ
హణము తెఱంగులు నప్పటి కప్పటి | కి ట్లని యానతి యిచ్చి నడపఁ
బంపక యున్న నొప్పమి రాదె మాకు? ము | న్నీవును గృష్ణుండు నేవిధమున
 
తే. నడిపితిరి కార్య మెఱుఁగవే యడలు వెల్లి | మమ్ముఁ బాంచాలి నిటు ముంచి యమ్మ! యడవి
నెట్టు లుండెద?’ వనఁగ నయ్యింతి బాష్ప | పూర్ణనయన యై యూరక పోవుచుండె.
158
ఉ. అయ్యమలాత్మతోడఁ బవనాత్మజుఁడి ట్లను ‘ధర్మపుత్త్రు నీ
వెయ్యది యుక్త హేతువుగ నిమ్మెయిఁ బాసెదు? నీదు పన్పునం
గయ్యము సేసి భూపతినికాయములం బరిమార్చెఁ దల్లి! నీ
కియ్యన లక్ష్మి నూఁది చరియింపక యిప్పుడు వాయఁ బాడియే?
159
క. మనమునఁ దోఁచిన దానము | లనుదినమును జేయుచును సమాశ్రిత జనులం
బెనుచుచు బంధులఁ బ్రోచుచు | జననుతచరితమునఁ బరఁగు సౌజన్యనిధీ!
160
క. వనమున మాద్రీపుత్త్రులు | వెనుఁబడుటకుఁ దలరి తట్లు విక్రమమునకున్‌
గొనకొల్పి తిట్లు వీరల | ననూన దుఃఖముల ముంచి యరుగం దగునే?’
161
వ. అనియె, నట్టియెడ. 162
క. ద్రోవదియు సుభద్రయు శో | కావేశం బడర మోము లశ్రులఁ దోఁగం???
గా వెక్కి వెక్కి యేడ్చిరి, భూవర! పాండుక్షితీశ పుత్త్రులు నేడ్వన్‌!
163
క. పరిజనములు కన్నీళ్ళులు | దొరఁగఁగ నడ లొంది వారితోడం జని రి
ప్పరుసునఁ దనదుతనూజులు మరలమికిం బాండురాజమహిషి మఱుఁగుచున్‌.
164
వ. ‘తెగ నాడకున్నఁ బోవ’ రని కన్నీరు దుడిచికొని వారలం గలయం గనుంగొని, వారలు వినుచుండం దత్పరి జనంబుల తోడ. 165
సీ. ‘దుర్ద్యూతమునఁ దారు దూలపోవుటయును | నా సభ యపకీర్తి యగు తెఱంగు
పాటిల్లుటయుఁ, బెక్కుభంగుల నడవుల | నిడుమలఁ బడుటయు నే సహింపఁ
జాలక కార్యంబు చర్చించి సంధిమై | నొవ్వని వా రెల్ల నవ్వఁ దలలు
వంచి కౌరవులలో వర్తింప నే? లని | హరితోడ నాడితి; నవ్విధమున
 
ఆ. మాననీయు ధర్మసూను నాగాయుత | బలుని భీము శత్రుభంజనైక
శీలుఁ బార్థు శౌర్యలోలురఁ గవల దై | న్యంబు నొందఁ జూచు టర్హ మగునె?’
166
వ. అని ధర్మతనయు వదనంబు వీక్షించి, పాంచాలిం జూపి. 167
సీ. ‘గౌరవంబున సుకుమారత్వమున నొప్పు | నిప్పొల్తిఁ దలవట్టి యీడ్చి తెచ్చి
సభలోన నట్లు దుశ్శాసనుం డవమాన | పెట్టంగ నచ్చటి పెద్ద లెల్లఁ
బలుకక యుండ నబ్బన్నంబునకు నోర్వ | వలసె మీ కప్పటి కలఘుతేజ!
నీ తేజ మట్టులు నీ ఱయి పోయినఁ | బాండునికులము చెప్పంగఁ జూప
 
తే. లేకపోదె యబ్భంగిఁ బల్కితి ముకుందు | తోడ నేను మీ రెమ్మెయి రూఢి కెక్కి
వెలుఁగఁ గోరుట కతమునఁ దలఁచి; దాని | ననిలసుతుఁ డెత్తిపెట్టె; నే మనఁగఁ గలదు?’
168
వ. అనిన విని ధర్మసుతుండును భీముండును సిగ్గు వడి; రిట్లు పలికి గొంతి యిమ్మాటకు భీము చిత్తం బె ట్లగునో యనుతలంపున ధర్మసుతున కతనిం జూపి. 169
ఉ. ‘నామది నొండు లేదు; విను నవ్వితి నీతనితోడ; నీదు ల
క్ష్మీమహిమన్‌ మనం బలరఁ జేసితి నుత్తమదానముల్‌; జన
స్తోమ నుతంబుగా నడపఁజూచితి జన్నము గన్నులార; నిం
కేమి కొఱంత నా; కుడుగ; నెట్లును బోదు నరణ్యవృత్తికిన్‌.
170
తే. రాజ్య ఫలము కామింపఁ బుత్త్రా! సమగ్ర | తపమునకు ఫల మైన యుత్తమ గతి ప్ర
సిద్ధి గోరుదు నది గల్గఁ జేఁత కిట్టి | తోడు మఱి నాకుఁ గలుగునే? దురితదూర!
171
క. కురు రాజునకును దేవికిఁ | బరిచర్య లొనర్చుచుం దపంబునఁ గృశతం
బొరయు తనువుతోఁ గడపెదఁ | గరము నియతి నింకఁ గలుగు కాలము వత్సా!
172
వ. మీరు మరలుం’ డనియె; నట్టియెడ నప్పాండురాజమహిషి, తమతోడ వనవాసంబునకై వచ్చుటకుం గడంగు టయు, దాని కొడంబడక పాండవులు దగు పలుకులం బ్రార్థించుటయు నెఱుంగుం గావున ధృతరాష్ట్రుండు ‘ధర్మతనయుం డెట్లు సెప్పెనట్లు సేయు’ మని విదురసంజయులచేత నద్దేవికిఁ జెప్పి పుత్తెంచిన వార లేతెంచి యబ్భంగి చెప్పినను వదలక వారి పలుకు లాయమ వారించి దృఢనిశ్చయంబునఁ గొడుకులఁ గోడండ్రను దక్కటి బంధుజనులకు సర్వభరత భార్యలను బరిజనంబులను గలయం గనుంగొని ‘యి ట్లేల వచ్చెదరు? నిలువుండు; సుఖుల రై యుండుం’ డనుటయు. 173
క. హృదయములు దలర నందఱుఁ | బ్రదక్షిణము గాఁగ నేడ్పుఁ గ్రందుటెలుఁగు లె
ల్ల దెసలఁ జెలఁగఁ దిరిగి త | త్పదంబులకు నెఱఁగి నంతఁ దనువులు దూలన్‌.
174
వ. నిలిచి రందుఁ బాండవు లేవురుం బాండురాజ మహిషి ననుప మఱియుం జని యాయమను ధృతరాష్ట్ర గాంధారులను గలిపి ‘వారల నిరువుర నుద్దేశించి’ మీరు వనంబునకుం బోయి తానును లేకున్న మా కెట్లు కాలంబు గడపవచ్చు ననుతలంపునం దన్ను నెంత ప్రార్ధించినను గొంతి నిలుచుట కొడంబడ దయ్యె; నీ సాధ్వికి బుద్ధి సెప్పికొనుచుం బరిచర్యసేయించు కొం’ డని యప్పగించి, యారాజునకు నద్దేవికిం గుంతికిం బ్రదక్షిణంబు సేసి దండ ప్రణామంబు లాచరించిన, దీవించి వా రామంత్రణంబు సేయ నా ధర్మపుత్త్రాదు లశ్రుప్లావితంబు లగువదనంబులతోడ మరలి వనితాజనంబులం దోడ్కొని. 175
తే. పొగులుచును నల్ల నల్లన పురికి నరిగి | రదియు నుమ్మలికంబు ప్రోవైన యట్లు
చూడఁ గూడక యుండంగఁ జొచ్చి రాత్మ | మందిరము లందఱును బుధమాన్యచరిత!
176
వ. అట్లు పుర ప్రవేశంబు చేసి ధర్మనందనుండును దమ్ములుం దగిన వర్తనంబుల నుండి; రట నక్కురువృద్ధుండు నిశ్చింతుం డై గాంధారియుఁ గుంతియు విదుర సంజయులు నగ్నిహోత్రంబునకు వలయు ఋత్వి గ్జనంబులతోడ నరుగుదేర నలయక భాగీరథీ తీరంబునకుం బోయి, యొక్క యోగ్య ప్రదేశంబున విడిసెఁ; దదనంతరంబ యతండు. 177
క. స్నానాదిక విహితాను | ష్ఠానంబులు నడపి శ్రుతి విశారద భూదే
వానీక ప్రణయనమున | మానిత రుచి వెలుఁగుచున్న మహితాగ్నులకున్‌
178
తే. అర్చ లిచ్చి హోమంబు సమంచితముగఁ | జలిపి యెల్లవారలకు భోజనము సంఘ
టించి యాహారవిధి యాచరించి విదుర | సంజయుల యొనర్చిన దర్భశయ్య నుండె.
179
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )