| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ప్రథమాశ్వాసము |
| చ. |
మితహితసత్యవాక్య! జనమేజయ! భూజనవంద్య! యేను సు స్థితి గురుదేవకార్యములు సేయఁగఁబూను టెఱింగి, వంచనో న్నతమతి యై యకారణమ నా కపకారము సేసెఁ దక్షకుం డతికుటిలస్వభావుఁడు పరాత్మవిశేషవివేకశూన్యుఁ డై. |
121 |
| వ. | అదియునుం గాక. | 122 |
| చ. |
అనవరతార్థ దాన యజనాభిరతున్, భరతాన్వయాభివ ర్ధను, సకల ప్రజాహిత విధాను, ధనంజయ సన్నిభున్, భవ జ్జనకుఁ బరీక్షితున్ భుజగజాల్ముఁ డసహ్య విషోగ్రధూమకే తనహతిఁ జేసి చేసె నతిదాంతుఁ గృతాంతనికేతనాతిథిన్. |
123 |
| ఉ. |
కాదన కిట్టిపాటి యపకారముఁ దక్షకుఁ డేకవిప్రసం బోధనఁ జేసి చేసె నృపపుంగవ! నీవు ననేకభూసురా పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా కోదరసంహతిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్. |
124 |
| ఉ. |
ప్రల్లదుఁ డైన యొక్కకులపాంసను చేసినదానఁ దత్కులం బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము? గావునన్ మహీ వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలోఁ ద్రెళ్ళఁగ సర్పయాగ మతిధీయుత! చేయుము విప్రసమ్మతిన్. |
125 |
| వ. | అని యి ట్లయ్యుదంకుండు జనమేజయునకు సర్పయాగంబునందు బుద్ధి పుట్టించె ననిన విని శౌనకాది మహామును లక్కథకున కి ట్లనిరి. | 126 |
| చ. |
అమితజగద్భయంకరవిషాగ్నియు నప్రతిహన్యమాన వీ ర్యముఁ గలయట్టి సర్పముల కా జనమేజయు చేయు సర్పయా గమున నుదగ్రపావకశిఖాతతులం దొరఁగంగఁ గారణం బమలచరిత్ర! యేమి చెపుమయ్య వినం గడు వేడ్క యయ్యెడున్. |
127 |