| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఉ. |
ఆతతపక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు, బలవన్నిజదేహసముజ్జ్వల ప్రభా ధూత పతంగతేజుఁ డుదితుం డయి తార్‌క్ష్యుఁడు తల్లికిన్ మనః ప్రీతి యొనర్చుచున్ నెగసె భీమజవంబున నభ్రవీథికిన్. |
37 |
| క. |
దారుణకల్పాంతమరుత్ | ప్రేరిత హవ్యవహశిఖల పెల్లిది యని బృం దారకమునిబృందస్తుతి | బోరనఁ దా నగ్నిసూక్తములతో నెసఁగెన్. |
38 |
| వ. | అంత. | 39 |
| క. |
హరికులిశక్షతి యెఱుఁగని | గురుతరపక్షములతోడి కులగిరివోలెన్ గరుడండు గగనగతి నురు | తరజవమున నరుగుదెంచి తల్లికి మ్రొక్కెన్. |
40 |
| వ. | ఇట్లు నిజజననికి మ్రొక్కి కద్రువపాలికిం బోయి. | 41 |
| చ. |
తడయక మ్రొక్కియున్న వినతాసుతు నప్పుడు సూచి, యాత్మలో నిడుగడఁ జేయుచుం గడు సహింపక కద్రువ వానిఁ బిల్చి ‘నా కొడుకుల నెల్ల నెత్తికొని క్రుమ్మరుచుండుమ, యేమి పంచినన్ మడవక చేయు మీ’ వని సమర్పణ సేసెఁ బ్రభుత్వ మేర్పడన్. |
42 |
| వ. | గరుడండును గద్రువ పంచిన పనులెల్లను వినత యనుమతంబున నతివినయపరుం డై చేయుచు. | 43 |
| క. |
ఆ పన్నగముఖ్యులఁ దన | వీఁపునఁ బెట్టికొని పఱచి, విపినములు, మహా ద్వీపములు, గిరులు, నఖిల ది | శాపాలపురములుఁ జూపెఁ జన వారలకున్. |
44 |
| వ. | ఒక్కనాఁడు సప్తమారుతజవంబున సప్తాశ్వమండలంబుదాఁక నెగసిన, నమ్మార్తాండు చండకిరణంబుల వేఁడిమిఁ దాఁకి, మాఁడి, గరుడని వీఁపున నున్నయురగులు దొరఁగి నేలంబడి మూర్ఛవోయినంజూచి, కద్రువ కడునలిగి, గరుడనిం బదరి, యతిభక్తి నింద్రు నారాధించి. | 45 |
| చ. |
నరసురసిద్ధకింపురుషనాగనభశ్చరముఖ్యు లెల్ల నీ కరుణయ వేచి మండ్రు, త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణన చేసి సుస్థిరతఁ బొందుఁ బురందర! సర్వలోకసుం దర! శరణంబు నా కగుము దానవసూదన! పాకశాసనా! |
46 |
| వ. | అని స్తుతియించి పర్జన్యప్రసాదంబున మహావృష్టి గొడుకులపయిం గురియించి, యయ్యురగుల విగత పరితాపులంజేసి కద్రువ గర్వంబున నుఱక గరుడని వినతనుం బనులుగొనుచున్నంత, నొక్కనాఁడు గరుడండు తల్లి కి ట్లనియె. | 47 |
| ఉ. |
ఆయతపక్షతుండహతి నక్కులశైలము లెల్ల నుగ్గుగాఁ జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గల నాకు నీపనిం బాయక వీఁపునం దవడుఁ బాముల మోవను, వారికిం బనుల్ సేయను నేమి కారణము సెప్పుము దీనిఁ బయోరుహాననా! |
48 |
| వ. | అని యడిగిన వినత తనకుం గద్రువతోడి పన్నిదంబున నైన దాసీత్వంబును, తత్కారణం బైన యనూరుశాపంబును గొడుకున కేర్పడం జెప్పి యి ట్లనియె. | 49 |
| క. |
నీ కతమున నా దాస్యము | ప్రాకటముగఁ బాయు ననిన పలు కెడలోనం జేకొని, యూఱడి నిర్గత | శోకస్థితి నున్నదానఁ జూవె ఖగేంద్రా! |
50 |
| వ. | ‘కొడుకులు సమర్థులైనం దల్లిదండ్రులయిడుమలు వాయుట యెందునుంగలయది, గావున నీయట్టిసత్పుత్త్రుం బడసియు దాసి నై యుండుదాననే’ యనిన విని వైనతేయుండు తద్దయు దుఃఖితుం డై, యొక్కనాఁడు కాద్రవేయుల కి ట్లనియె. | 51 |
| క. |
మా యీ దాస్యము వాయు ను | పాయము సేయుండు, నన్నుఁ బనుపుం డిష్టం బేయది దానిన తెత్తు న | జేయుఁడ నై యమరవరులఁ జేకొని యైనన్. |
52 |
| వ. | అనిన నయ్యురగులు కరుణించి గరుడని కి ట్లనిరి. | 53 |
| చ. |
‘అమితపరాక్రమంబును, రయంబును, లావును గల్గు ఖేచరో త్తముఁడవు నీవు; నీదయినదాస్యముఁ బాచికొనంగ నీకుఁ జి త్తము గలదేని, భూరిభుజదర్పము శక్తియు నేర్పడంగ మా కమృతముఁ దెచ్చియి’ మ్మనిన నవ్విహగేంద్రుఁడు సంతసంబునన్. |
54 |