| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
‘తల్లియు నాసహోదరులును మూర్ఖు లై | ధర్మువు నుచితంబుఁ దప్పి వినత కావైనతేయున కపకారములు సేసి, | రెప్పుడు వారు సహింప కెగ్గు సేయుదు, రేను రోసితి, వారితోడిపొ | త్తొల్లఁ, దపంబు సేయుచు శరీర భారంబు విడిచెదఁ బరమేష్ఠి!’ యనవుడు | నాతని సమబుద్ధి కజుఁడు మెచ్చి |
|
| ఆ. |
నిత్యసత్యధర్మనిరతుండ వఖిలంబు | దాల్పనోపు నట్టి ధైర్యయుతుఁడ, విది యనన్యవిషయ; మిమ్మహీభారంబు | నీవ తాల్పవలయు నిష్ఠతోడ. |
124 |
| చ. |
వినతకు నాత్మజుం డయిన వీరుఁడు, కశ్యపవాలఖిల్యస న్మునులవరంబు గన్న ఖగముఖ్యుఁడు, వాసవు నోర్చియున్న స ద్వినుతబలుండు కావున వివేకమునన్ వినతాతనూజుతో ఘనముగఁ జెల్మి సేయు; మిది కార్యము నీకు భుజంగమేశ్వరా! |
125 |
| వ. | అని బ్రహ్మ నియోగించిన శేషుం డశేషమహీభారంబు దాల్చి గరుడనితో బద్ధసఖ్యుం డై యుండె; నిట వాసుకియుం దల్లిశాపంబున జనమేజయు చేయు సర్పయాగంబునం దయ్యెడుసర్పకులప్రళయంబునకు వెఱచి, తనబాంధవుల నైరావతాది సహోదరుల రావించి విషణ్ణహృదయుం డై యి ట్లనియె. | 126 |