| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | ‘కావున నీవు కృతదారపరిగ్రహుండ వై సంతానంబు వడసి, మమ్ము నూర్ధ్వలోకగతులం జేయు’ మనిన, జరత్కారుం ‘డట్లేని నాకు సనామ్ని యయినదాని వివాహంబు గావలయు’ నని వారికి నమస్కరించి వీడ్కొని, సనామ కన్యాన్వేషణపరుం డై భూవలయం బెల్లఁ గలయం గ్రుమ్మరి. | 149 |
| తరువోజ |
అనవరతవ్రతాయాసఖేదమున నతికృశం బగుచున్న యంగంబునందుఁ దనరి యేర్పడ సిరల్, దద్దయు ముదిమిఁ దల వడంకుచునుండఁ, దన పితృవరుల ఘనముగా నూర్ధ్వాభిగమనులఁ జేయఁగడఁగి వివాహంబుగా జరత్కారుఁ డనఘుండు దనకోర్కి కనురూప యైనయట్టి కన్యకఁ గానఁ డయ్యె మర్త్యమున. |
150 |
| వ. | ఇట్లు జరత్కారుండు వివాహాపేక్షం బ్రతీక్షించుచున్న వాసుకియుం దనచారులవలన నంతయు నెఱింగి, నిజసహోదరి యైన జరత్కారుం దోడ్కొని జరత్కారుమహామునిపాలికిం బోయి యి ట్లనియె. | 151 |
| శా. |
ధన్యం బయ్యె భవత్కులం, బతి కృతార్థం బయ్యె నస్మత్కులం, బన్యోన్యానుగుణాభిధానములఁ జిత్తానంద మొందెన్ వివే కన్యాయాన్విత భూసురోత్తమ! జరత్కారూ! జగన్మాన్య! యి క్కన్యాభిక్షఁ బరిగ్రహింపుము జరత్కారున్ మదీయానుజన్. |
152 |
| వ. | అనిన నొడంబడి, జరత్కారుండు సనామ యగుటంజేసి యక్కన్యకను వివాహం బై, ప్రథమసమాగమంబునం దన ధర్మపత్నికి సమయంబు సేసె; ‘నాకు నీ వెన్నండేని యవమానంబు దలంచితి, నాఁడ నిన్నుం బాసి పోవుదు’ ననిన నాఁటంగోలె. | 153 |
| క. |
వాలుపయి నడచున ట్ల | బ్బాలిక నడునడ నడుంగి భయమున నియమా భీలుఁ డగు పతికిఁ బవళుల్ | రేలును నేమఱక పరిచరించుచు నుండెన్. |
154 |
| క. |
అనవరతభక్తిఁ బాయక | తనపతికిం బ్రియము సేసి, తద్దయు గర్భం బనురక్తిఁ దాల్చి యొప్పెను | దినకరగర్భ యగు పూర్వదిక్సతివోలెన్. |
155 |
| వ. | అక్కోమలి యొక్కనాఁడు దనకుఱువు దలయంపిగాఁ గృష్ణాజినాస్తరణంబున నిజనాథుండు నిద్రితుండై యున్న యవసరంబున నాదిత్యుం డస్తగిరిశిఖరాసన్నుం డగుటయు, సంధ్యాసమయోచితక్రియలు నిర్వర్తింపఁ దదాశ్రమవాసు లైన మునులు గడంగుటం జూచి యాత్మగతంబున. | 156 |
| సీ. |
‘సంధ్యలం దొనరించు సద్విధుల్ గడచిన | ధర్మలోపం బగుఁ దడయ కేల బోధింప వై తని భూసురప్రవరుండు | పదరునో, బోధింపఁబడి యవజ్ఞ దగునె నా కిట్లు నిద్రాభంగ మొనరింప | నని యల్గునో, దీని కల్గెనేని యలుకయ పడుదుఁ గా, కగునె ధర్మక్రియా | లోపంబు, హృదయంబులో సహింప’ |
|
| ఆ. |
నని వినిశ్చితాత్మ యై నిజపతిఁ బ్రబో | ధించె; మునియు నిద్ర దేఱి యలిగి ‘యేల నిద్రఁ జెఱిచి తీవు’ నావుడు జర | త్కారు విట్టు లనియెఁ గరము వెఱచి. |
157 |
| క. |
‘ఇనుఁ డస్తమింపఁ బోయిన | ననఘా! బోధింపవలసె’ ననవుడు, ‘నామే ల్కను నంతకు నుండక యినుఁ | డొనరఁగ నస్తాద్రి కేఁగ నోడఁడె చెపుమా!’ |
158 |
| వ. | ‘నీవు నా కవమానంబు దలంచితివి; నీయొద్దనుండ నొల్లఁ; దొల్లి నీకు నాచేసిన సమయంబు నిట్టిద; నీగర్భంబున నున్నవాఁడు సూర్యానలసమప్రభుం డైన పుత్త్రుం; డుభయకులదుఃఖోద్ధరణ సమర్థుండు సుమ్ము; నీవు వగవక నీయగ్రజునొద్ద నుండు’ మని జరత్కారువు నూరార్చి జరత్కారుండు తపోవనంబునకుం జనియె; నిట జరత్కారువును తనయగ్రజుం డైన వాసుకి యొద్దకు వచ్చి తద్వృత్తాంతంబంతయు నెఱింగించి యుండునంత. | 159 |
| క. |
ఆపూర్ణతేజుఁ డపగత | పాపుఁ డపాకృతభవానుబంధుఁడు, నిజమా తాపితృపక్షప్రబల భ | యాపహుఁ డాస్తీకుఁ డుదితుఁ డై పెరిఁగెఁ బ్రభన్. |
160 |
| తే. |
చ్యవనసుతుఁ డైన ప్రమతితోఁ జదివె సకల | వేదవేదాంగములు, నిజవిమలబుద్ధి నెఱిఁగె సకలశాస్త్రంబుల, నెల్లయందు | నధికసాత్త్వికుఁ డాస్తీకుఁ డనఁగ జనులు. |
161 |
| వ. | అటజనమేజయుండు దక్షకవిషానలంబునం దన జనకు పంచత్వం బుదంకువలన నెఱింగి, మంత్రులం జూచి, ‘యిది యేమినిమిత్తంబు? దీని సవిస్తరంబుగాఁ జెప్పుం’ డనిన మంత్రు లి ట్లనిరి. | 162 |