| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| మధ్యాక్కర |
ధరణిఁ జరాచరభూతసంఘంబుఁ దమవిషవహ్ని నురగంబు లేర్చుచు నునికి కలిగి, పయోరుహగర్భుఁ డురగవిషాపేతజీవ సంజీవనోపదేశంబు గరుణఁ గశ్యపునకు నిచ్చె నఖిలలోకహితంబు పొంటె. |
183 |
| వ. | అట్టి కశ్యపుం డను బ్రహ్మర్షి ‘శృంగిశాపంబునఁ బరీక్షితుండు తక్షకదష్టుం డగు నేఁడు సప్తమదివసం బటె! యేను వాని నపేతజీవు సంజీవితుం జేసి నావిద్యాబలంబు మెఱయుదు; మఱి యదియునుంగాక.’ | 184 |
| తే. |
ధరణియెల్లను రక్షించు ధర్మచరితు | నా పరీక్షితు రక్షించి, యతనిచేత నపరిమితధనప్రాప్తుండ నగుదుఁ; గీర్తి | యును ధనంబు ధర్మముఁ గొను టుఱదె నాకు. |
185 |
| వ. | అని విచారించి హస్తిపురంబునకుం బోవువానిఁ దక్షకుండు వృద్ధవిప్రుం డయి వనంబులో నెదురంగని ‘మునీంద్రా! యెట వోయె, దేమి కార్యంబున’ కనిన వానికిం గశ్యపుం డి ట్లనియె. | 186 |
| క. |
తక్షకుఁ డను పన్నగుఁడు ప | రీక్షితుఁ గఱచునటె నేఁ; డరిందము నతనిన్ రక్షింపఁగఁ బోయెద శుభ | దక్షిణు నా మంత్ర తంత్ర దాక్షిణ్యమునన్. |
187 |
| క. |
అనిన విని నగుచు వాఁ డి | ట్లనియెను ‘దక్షకుఁడ నేన, యశనినిపాతం బున బ్రదుకఁగ నగు నేనియు | ననఘా! మద్విషనిహతుల కగునే బ్రదుకన్. |
188 |
| వ. | ‘నీమందులు మంత్రంబులు నాయందుం బనిసేయవు క్రమ్మఱి పొమ్ము; కాదేని నీవ చూడ నివ్వట వృక్షంబుఁ గఱచి నావిషానలంబున భస్మంబు సేసెద; నోపుదేని దీనిని సంజీవితంబుఁజేయు’ మని తక్షకుం డా వృక్షంబుఁ గఱచిన. | 189 |
| ఆ. |
అయ్యహీంద్ర విష మహానల దగ్ధ మై | విపుల పత్త్ర దీర్ఘ విటపతతుల గగనమండలంబుఁ గప్పిన యవ్వట | తరువు భస్మ మయ్యెఁ దత్‌క్షణంబ. |
190 |
| వ. | కశ్యపుండును నప్పుడ యాభస్మ చయంబు గూడఁ ద్రోచి, తన మంత్రతంత్రశక్తింజేసి యెప్పటియట్ల వృక్షంబుగాఁ జేసినం జూచి, తక్షకుం డతివిస్మయం బంది ‘మునీంద్రా! నీవిద్యాబలంబున నిది సంజీవితం బయ్యె నేనియు నతికుపిత విప్రశాప వ్యపగతాయుష్యుం డైన పరీక్షితుండు సంజీవితుండు గానోపండు; వాని యిచ్చు ధనంబు కంటె నాయం దధికధనంబు గొనిపొ’ మ్మనినఁ గశ్యపుండును దన దివ్యజ్ఞానంబున నట్లకా నెఱింగి, తక్షకుచేత ననంతం బైన యర్థంబు గొని క్రమ్మఱి చనియె; విజనం బైన విపినాంతరంబున నైన యయ్యిరువుర వృత్తాంతంబు మీ రె ట్లెఱింగితి రంటేని వినుము. | 191 |
| తే. |
ఇప్పురంబున బ్రాహ్మణుం డింధనార్థ | మేఁగి, మున్న యావృక్షంబు నెక్కి, దాని తోన దగ్ధుఁ డై, మఱి దానితోన లబ్ధ | జీవుఁడై వచ్చి జనులకుఁ జెప్పె దీని. |
192 |