| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - తృతీయాశ్వాసము |
| చ. |
నిరుపమధర్మమార్గపరినిష్ఠితు లై మహి యెల్లఁ గాచుచుం బరఁగిన తొంటి పూరు కురు పాండు మహీశుల పేర్మిఁ జేసి భూ భరవహనక్షమం బగుచుఁ బౌరవ కౌరవ పాండవాన్వయం బురుగుణసంపదం బెరిఁగి యొప్పె సమస్త జగత్ప్రసిద్ధ మై. |
88 |
| వ. | అది యెట్లనినం: దొల్లి దాక్షాయణి యైన యదితికిఁ గశ్యపునకుం బుట్టిన వివస్వంతునకు వైవస్వతుం డను మనువును యముండును శనైశ్చరుండును యమునయుఁ దపతియు ననం బుట్టి; రందు వైవస్వతుం డను మనువు వలన బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రాదు లైన మానవులు పుట్టిరి; మఱియు వానికి వేనప్రముఖు లైన రాజు లేఁబండ్రు పుట్టి వంశకరు లై తమలోన యుద్ధంబు సేసి మడిసిరి; మఱియు నమ్మనుపుత్త్రి యైన యిల యనుదానికి సోమపుత్త్రుం డైన బుధునకుఁ బురూరవుండు పుట్టి చక్రవర్తి యై. | 89 |
| క. |
ఇమ్మహిఁ ద్రయోదశ ద్వీ | పమ్ములు దన శౌర్యశక్తిఁ బాలించి మదాం ధ్యమ్మున విప్రోత్తమ వి | త్తమ్ములు దా నపహరించె ధనలోభమునన్. |
90 |
| క. |
విని దాని నుడుపఁగా బ్ర | హ్మనియుక్తుం డై సనత్కుమారుఁడు మహికిం జనుదెంచె బ్రహ్మలోకం | బుననుండి యనేక దివ్యమునిసంఘముతోన్. |
91 |
| వ. | పురూరవుండును రాజ్యగర్వంబున నమ్మునులకు దర్శనం బీనొల్లక పరిహసించిన నలిగి వారలు వాని నున్మత్తుంగా శపియించిన, వాఁడు గంధర్వలోకంబున నూర్వశీ సహితుం డై యుండె; నట్టి పురూరవునకు నూర్వశికి నాయువు ధీమంతుండు నమావసువు దృఢాయువు వనాయువు శతాయువు నను నార్వురు గొడుకులు పుట్టి; రం దాయువునకు స్వర్భానవి యను దానికి నహుష వృద్ధశర్మ రజి గయానేనసు లనంగా నేవురు పుట్టిరి; వారి యందు నహుషుండు రాజ్యాభిషిక్తుం డై. | 92 |
| మ. |
చతురంభోధిపరీతభూవలయమున్ సద్వీప సారణ్యస క్షితిభృత్కం బగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచుం గ్రతువుల్ నూ ఱొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా హితుఁ డై యా నహుషుండు దాఁ బడసె దేవేంద్రత్వముం బేర్మితోన్. |
93 |
| వ. | అట్టి నహుషునకుఁ బ్రియంవద యనుదానికి యతి యయాతి సంయా త్యాయా త్యయతి ధ్రువు లనంగా నార్వురు పుట్టి; రందు యయాతి రా జై యనేకయాగంబులు సేసి శుక్రపుత్త్రి యయిన దేవయానియందు యదుతుర్వసులును వృషపర్వపుత్త్రి యయిన శర్మిష్ఠయందు ద్రుహ్య్వనుపూరులు ననంగా నేవురు కొడుకులం బడసి రాజ్యంబు సేయుచు శుక్రశాపంబున జరాభారపీడితుం డై కొడుకుల నందఱం బిలిచి యి ట్లనియె. | 94 |
| సీ. |
‘విషయోపభోగాభిలషణ మింకను నాకు | వదలక పెరుఁగుచున్నదియుఁ గాన నందనులార! మీయం దొక్కరుండు నా | దగు జరాభారంబు దగిలి తాల్చి తనజవ్వనంబు నా కొనరంగ నెవ్వఁ డీ | నోపు నాతండ సద్వీపసకల ధారుణీసామ్రాజ్యభారయోగ్యుం డగు’ | నని యడిగిన నగ్రతనయుఁ డయిన |
|
| ఆ. |
యదువుఁ దొట్టి సుతులు ముదిమికి నోపక | తలలు వాంచి యున్న వెలయఁ దండ్రి పనుపుఁ జేసి ముదిమి గొని జవ్వనం బిచ్చెఁ | బూరుఁ డనుసుతుండు భూరికీర్తి. |
95 |
| వ. | అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. | 96 |