| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - తృతీయాశ్వాసము |
| ఉ. |
ఆనహుషాత్మజుం డగు యయాతి యధిజ్యధనుస్సహాయుఁ డై యానతశాత్రవుండు మృగయారసలోలనిబద్ధబుద్ధిఁ ద త్కానన మెల్లఁ గ్రుమ్మఱి నికామధృతశ్రముఁ డేగుదెంచె నం దానలినాక్షి యున్న విపినాంతర కూపతటంబునొద్దకున్. |
139 |
| సీ. |
చనుదెంచి, యమ్మహాజనపతి జల మపే | క్షించి, యచ్చో విశ్రమించి, చూచి, తత్కూపమున విలసత్కూలఘనవల్లి | యన్నిష్టసఖి నూఁదియున్న దాని, గురుకుచయుగముపైఁ బరువడిఁ దొరఁగెడు | కన్నీరు పూరించుచున్న దానిఁ, దనసమీపమునకు జనుల యాగమనంబు | పన్నుగాఁ గోరుచునున్న దాని, |
|
| ఆ. |
వరుణదేవుతోడఁ గర మల్గి జలనివా | సంబు విడిచి భూస్థలంబువలని కరుగుదేర నున్న వరుణేంద్రుదేవియ | పోనిదాని దేవయానిఁ గనియె. |
140 |
| వ. | కని ‘నీ వెవ్వరిదాన? వి ట్లేల యేకతంబ యివ్విపినాంతరకూపంబున నున్న దాన?’ వనిన విని దేవయాని యెప్పుడుం దమ విహరించుచున్న యవ్వనంబునకు మృగయావినోదార్థంబు యయాతి వచ్చుటంజేసి తొల్లియుఁజూచినది కావున నాతని నెఱింగి యి ట్లనియె. | 141 |
| తరలము |
అమరసన్నిభ! యేను ఘోరసురాసురాహవభూమి న య్యమరవీరులచేత మర్దితు లైన దానవులన్ గత భ్రములఁగాఁ దన విద్యపెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి య త్యమితశక్తిమెయిన్ వెలింగినయట్టి భార్గవుకూఁతురన్. |
142 |
| వ. | ‘దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతం బడి వెలువడ నేరకున్నదానను; న న్నుద్ధరించి రక్షింపు’ మనిన నవ్విప్రకన్యకయందుఁ దద్దయు దయాళుం డై. | 143 |
| చ. |
జలధివిలోలవీచి విలసత్కలకాంచి సమంచితావనీ తలవహనక్షమం బయిన దక్షిణహస్తమునం దదున్నమ ద్గళదురఘర్మవారికణక్రమకరాబ్జము వట్టి నూతిలో వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్. |
144 |
| వ. | ఇట్లు దేవయాని నుద్ధరించి నిజపురంబున కరిగె; నిట దేవయానియు శర్మిష్ఠసేసిన యెగ్గువలన విముక్తయయి తన్ను రోయుచు వచ్చుదాని ఘూర్ణిక యను పరిచారికం గని ‘యేను వృషపర్వుపురంబు సొర నొల్ల; శర్మిష్ఠ చేత నా పడిన యవమానంబు మదీయ జనకున కెఱింగింపు’ మని పంచిన, నదియును నతిత్వరితగతిం జని తద్వృత్తాంతం బంతయు శుక్రునకుం జెప్పిన, శుక్రుండును నాక్షణంబ వచ్చి కోప ఘూర్ణిత బాష్ప పూరితనయన యై యున్న దేవయానిం గని యి ట్లనియె. | 145 |
| క. |
అనుపమ నియమాన్వితు లై | యనూనదక్షిణలఁ గ్రతుసహస్రంబులు సే సినవారికంటె నక్రో | ధనుఁడ గరం బధికుఁ డండ్రు తత్త్వవిధిజ్ఞుల్. |
146 |
| క. |
అలిగిన నలుగక, యెగ్గులు | పలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్ వలుకక, బన్నము వడి యెడఁ | దలఁపక యు న్నతఁడె చూవె ధర్మజ్ఞుఁ డిలన్. |
147 |
| వ. | ‘కావున బుద్ధి గలవారికిఁ గ్రోధంబు గొనియాడం దగదు; శర్మిష్ఠ రాచకూఁతురు; గొండుక యది; దానితోడి దేమి ర’ మ్మనిన దేవయాని యి ట్లనియె. | 148 |
| క. |
కడు ననురక్తియు నేర్పును | గడఁకయు, గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్ నొడివెడు వివేకశూన్యుల | కడ నుండెడు నంతకంటెఁ గష్టము గలదే. |
149 |
| వ. | ‘ఈవృషపర్వుపురం బేను జొరనొల్ల; నెట యేనియుం బోదు’ ననిన శుక్రుండు ‘నాకు నీవ గతివి. నీతోడ నేనును వత్తు’ ననుచుఁగూఁతుం బట్టువఱుచుచున్నంత, నంతయుఁజారులవలన నెఱింగి వృషపర్వుండు శుక్రునొద్దకు వచ్చి నమస్కరించి యి ట్లనియె. | 150 |
| ఉ. |
దేవతలన్ జయించుచు నతిస్థిరసంపదలం ద్వదీయవి ద్యావిభవంబు పెంపునన దానవు లుద్ధతు లైరి; కానినాఁ డీ వనరాశిలోఁ జొరరె యింతకు నంతకకోపు లైన య ద్దేవపతాకినీపతుల దివ్యనిశాతమహాయుధాహతిన్. |
151 |
| క. |
వారణ ఘోటక భాండా | గారంబులు మొదలుగాఁగఁ గల ధనములతో సూరినుత! యిందఱము నీ | వారకములు గాఁగ మమ్ము వగవుము బుద్ధిన్. |
152 |