| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అని విచారించుచున్న యవసరంబున దాని పుణ్యస్వరూపంబు సన్నిహితం బైన య ట్లొక్కనాఁడు యయాతి యశోకవని కాలోకనతత్పరుండైవచ్చువాఁ డేకతంబ యున్న శర్మిష్ఠం గనిన, నదియును సంభ్రమ వినయావనత యై తనవలన నమ్మహీపతి ప్రసన్నచిత్తుం డగుట యెఱింగి కరకమలంబులు మొగిచి యి ట్లనియె. | 173 |
| ఉ. |
నీలగళోపమాన! కమనీయగుణోన్నతిఁ జెప్పఁ జాలు న న్నేలిన దేవయానికి నరేశ్వర! భర్తవు గాన నాకునుం బోలఁగ భర్త వీవ; యిది భూనుత! ధర్మపథంబు; నిక్కువం; బాలును దాసియున్ సుతుఁడు నన్నవి వాయనిధర్మముల్ మహిన్. |
174 |
| వ. | ‘అద్దేవయానిం బరిగ్రహించినప్పుడ తద్ధనం బగుట నేనును భవత్పరిగ్రహంబ కావున నన్నుం గరుణించి నాకు ఋతుకాలోచితంబుఁ బ్రసాదింపవలయు’ ననిన నయ్యయాతి యి ట్లనియె. | 175 |
| క. |
లలితాంగి! శయన మొక్కఁడు | వెలిగా రుచిరాన్నపాన వివిధాభరణా దుల శర్మిష్ఠకు నిష్టము | సొలయక చేయు మని నన్ను శుక్రుఁడు పంచెన్. |
176 |
| వ. | ‘ఏ నమ్మహామునివచనంబున కప్పు డొడంబడితి; నెట్లు బొంకనేర్తు’ ననిన శర్మిష్ఠ యి ట్లనియె. | 177 |
| క. |
చను బొంకఁగఁ బ్రాణాత్యయ | మున, సర్వధనాపహరణమున, వధ గావ చ్చిన విప్రార్థమున, వధూ | జన సంగమమున, వివాహసమయములందున్. |
178 |
| వ. | ‘ఈ యేనింటియందు నసత్యదోషంబు లేదని మునివచనప్రమాణంబు గలదు; నీవు వివాహసమయంబున నొడంబడితివి కావున నసత్య దోషంబునం బొంద’ వనిన నయ్యయాతి యొడంబడి శర్మిష్ఠకు నభిమతం బొనరించె; నదియుఁ దత్సమాగ మంబున గర్భిణి యై కొడుకుం గనిన విస్మయపడి దేవయాని దానికడకు వచ్చి యి ట్లనియె. | 179 |
| తే. |
బాల వయ్యు నత్యుత్తమశీలవినయ | గౌరవాన్విత వై నిర్వికారవృత్తి నున్న నీ కున్నయునికిన సన్నుతాంగి! | సుతుఁడు పుట్టుట యిది గడుఁజోద్య మయ్యె. |
180 |
| వ. | అది యె ట్లని యడిగిన శర్మిష్ఠ లజ్జావనతవదన యయి యి ట్లను; ‘నెందేనినుండి యొక్కమహాముని నిఖిల వేదవేదాంగపారగుండు వచ్చి ఋతుమతినై యున్న నన్నుం జూచి నాకుఁ బుత్త్రోత్పత్తిఁ బ్రసాదించె’ ననిన విని దేవయాని నిజనివాసంబునకుం జనియె; శర్మిష్ఠయు నయ్యయాతివలనఁ గ్రమంబున ద్రుహ్వ్యను పూరు లనంగా మువ్వురు గొడుకులం బడసి యున్నంత, నొక్కనాఁడు. | 181 |
| సీ. |
కరువలిచేఁ దూలుకపిల జటాలియ | కరమొప్పు శిఖలుగాఁ గనకరత్న మయజాల భూషణామలదేహదీప్తుల | తేజంబుగాఁ బ్రవిదీప్యమాన యాగశతంబుల నర్చితం బైన మూఁ | డగ్నులు ప్రత్యక్ష మైన యట్లు దనమ్రోల శర్మిష్ఠతనయులు గ్రీడించు | చుండంగ నున్న యయ్యుర్విఱేని |
|
| ఆ. |
కడకు నేఁగుదెంచెఁ గన్యలు దనుజాధి | రాజసుతయుఁ దోడరాఁగ నొప్పి దేవి దేవయాని దేవేంద్రుదేవియ | పోలె నెంతయును విభూతి మెఱసి. |
182 |
| వ. | ఇ ట్లరుగుదెంచి యధికతేజస్వులయి యయాతి ప్రతిబింబంబులుం బోని యబ్బాలకులం జూచి’ యిక్కుమారు లెక్కడి వా? రెవ్వరికొడుకు? లని యయాతి నడిగి యలబ్ధప్రతివచనయై ‘మీ తల్లిదండ్రులెవ్వ’ రని యక్కుమారుల నడిగిన. | 183 |
| క. |
తరుణప్రదేశినులు మా | సరముగ వారలు యయాతి శర్మిష్ఠలఁ జూ పిరి తండ్రియుఁ దల్లియు నని | కర మనురాగిల్లెఁ గన్యకానివహంబున్. |
184 |
| వ. | ఇట్లు ద న్నెఱుంగకుండ యయాతి శర్మిష్ఠవలన లబ్ధసంతానుం డగుట యప్పు డెఱింగి. | 185 |
| చ. |
పతివిహితానురాగమున భార్గవుపుత్త్రి యయాతిచేత వం చిత యయి, వాఁడు దానవికిఁ జేసిన నెయ్య మెఱింగి, కోపదుః ఖిత యయి, తండ్రిపాలి కతిఖేదమునం జని, దీర్ఘనేత్రని ర్గతజలధారలం గడిగెఁ గాంత తదీయ పదాబ్జయుగ్మమున్. |
186 |