| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| ఆ. |
ఏల యెఱుక లేని యితరుల యట్ల నీ | వెఱుఁగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి; యేన కాని దీని నెఱుఁగ రిం దొరు లని | తప్పఁబలుక నగునె ధార్మికులకు! |
79 |
| చ. |
విమలయశోనిధీ! పురుషవృత్త మెఱుంగుచునుండుఁ జూవె వే దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్ యముఁడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు న న్మహాపదా ర్థము లివి యుండఁగా నరుఁడు దక్కొననేర్చునె తన్ను మ్రుచ్చిలన్. |
80 |
| క. |
నా యెఱిఁగినట్ల యిన్నియు | నీ యిచ్చిన వరము ధారుణీవర! యెఱుఁగున్ నాయందుఁ దొంటియట్టుల | చేయు మనుగ్రహ; మవజ్ఞ సేయం దగునే! |
81 |
| క. |
సతియును గుణవతియుఁ బ్రజా | వతియు ననువ్రతయు నైన వనిత నవజ్ఞా న్వితదృష్టిఁ జూచు నతి దు | ర్మతి కిహముం బరముఁ గలదె మతిఁ బరికింపన్. |
82 |
| క. |
సంతతగృహమేధి ఫలం | బంతయుఁ బడయంగ నోపు ననుగుణభార్యా వంతుం డగువాఁడు క్రియా | వంతుఁడు దాంతుండుఁ బుత్త్రవంతుండు నగున్. |
83 |
| వ. | మఱియును. | 84 |
| సీ. |
ధర్మార్థకామసాధన కుపకరణంబు | గృహనీతివిద్యకు గృహము, విమల చారిత్రశిక్ష కాచార్యకం, బన్వయ | స్థితికి మూలంబు, సద్గతికి నూఁత, గౌరవంబున కేకకారణం, బున్నత | స్థిరగుణమణుల కాకరము, హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ | చూవె భర్తకు, నొండ్లు గావు ప్రియము, |
|
| ఆ. |
లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను | నెట్టితీఱములను ముట్టఁబడిన వంతలెల్లఁ బాయు నింతులఁ బ్రజలను | నొనరఁ జూడఁగనిన జనుల కెందు. |
85 |
| వ. | మఱియు భార్య పురుషునం దర్ధం బగుటంజేసి పురుషునకు మున్న పరేత యైన పతివ్రత పరలోకంబునం దనపురుషుం గూడఁ దదాగమనంబు ప్రతీక్షించుచుండుం; బురుషుండు మున్న పరేతుం డైనఁ బదంపడి తానును బరేత యై తనపురుషుం గూడ నరుగునట్టి భార్య నవమానించుట ధర్మవిరోధంబు; మఱియునుం బురుషుండు భార్యయందుఁ బ్రవేశించి గర్భంబునఁ బుత్త్రుండై తాన యుద్భవిల్లు గావున ‘నఙ్గా దఙ్గా త్సమ్భవసి’ యనునది యాదిగాఁగల వేదవచనంబులయందును జనకుండునుఁ బుత్త్రుండును ననుభేదంబు లేదు. | 86 |
| క. |
విను గార్హపత్య మను న | య్యనలము విహరింపఁబడి తదాహవనీయం బున వెలుఁగునట్ల వెలుఁగును | జనకుఁడు దాఁ బుత్త్రుఁడై నిజద్యుతితోడన్. |
87 |
| క. |
తాన తననీడ నీళ్ళు ల | లో నేర్పడఁ జూచునట్లు లోకస్తుత! త త్సూను జనకుండు సూచి మ | హానందముఁ బొందు నతిశయప్రీతిమెయిన్. |
88 |
| వ. | ‘పున్నామ్నో నరకాత్త్రాయత ఇతి పుత్త్ర’ యను వేదవచనంబు గలదు గావునఁ బుణ్యాచారుం డయిన పుత్త్రుం డుభయపక్షంబులవారి నుద్ధరించుఁ; గావున. | 89 |
| క. |
నీ పుణ్యతనువు వలనన | యీపుత్త్రకుఁ డుద్భవిల్లి యెంతయు నొప్పున్ దీపంబువలన నొండొక | దీపము ప్రభవించినట్లు తేజం బెసఁగన్. |
90 |
| మ. |
విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్త్రగా త్రపరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్రగా త్రపరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే. |
91 |
| క. |
అనఘుఁడు వంశకరుండై | పెనుపున నీసుతుఁడు వాజపేయంబులు నూ ఱొనరించు నని సరస్వతి | వినిచె మునులు వినఁగ నాకు వినువీథిదెసన్. |
92 |
| క. |
భూరిగుణు నిట్టి కులవి | స్తారకు దారకు నుదారధర్మప్రియ! ని ష్కారణమ తప్పఁజూడఁగ | సారమతీ! చనునె నాఁటి సత్యము గలుగన్. |
93 |
| చ. |
నుతజలపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్కస త్క్రతువది మేలు; తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు; త త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్. |
94 |
| క. |
వెలయంగ నశ్వమేధం | బులు వేయును నొక్కసత్యమును నిరుగడలం దుల నిడి తూఁపఁగ సత్యము | వలనన ములుసూపు గౌరవంబున పేర్మిన్. |
95 |
| తే. |
సర్వతీర్థాభిగమనంబు సర్వవేద | సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు ఎఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద | యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన మునులు. |
96 |
| క. |
కావున సత్యము మిక్కిలి | గా విమలప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమ సం భావిత సమయస్థితి దయఁ | గావింపుము; గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్. |
97 |
| క. |
క్షత్త్రవరుఁ డైన విశ్వా | మిత్త్రునకుఁ బవిత్ర యైన మేనకకున్ స త్పుత్త్రి నయి బొంకు వలుకఁగ | ధాత్రీతలనాథ! యంత ధర్మేతరనే? |
98 |
| వ. | అనిన శకుంతల పలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డి ట్లనియె. | 99 |
| క. |
ఏ నెట? నీ వెట? సుతుఁ డెట? | యే నెన్నఁడు తొల్లి చూచి యెఱుఁగను నిన్నున్; మానిను లసత్యవచనలు | నా నిట్టు లసత్యభాషణం బుచితంబే? |
100 |
| క. |
పొడవునఁ బ్రాయంబునఁ గడుఁ | గడిఁది బలంబునను జూడఁగా నసదృశు నీ కొడు కని యీతని నెంతయు | నెడమడుగుగఁ జూపఁ దెత్తె యిందఱు నగఁగన్. |
101 |
| వ. | ‘ఇట్టి లోకవిరుద్ధంబుల కే మోడుదు; మయుక్తంబు లయిన పలుకులు పలుకక నీయాశ్రమంబునకుం బొ’ మ్మనిన శకుంతల యత్యంతసంతాపితాంతఃకరణ యై. | 102 |
| మధ్యాక్కర |
‘తడయక పుట్టిననాఁడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ బడితి; నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ! నుడువులు వేయు నిం కేల? యిప్పాటినోములు తొల్లి కడఁగి నోఁచితిని గా కేమి’ యనుచును గందె డెందమున. |
103 |
| వ. | ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁదొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు ‘నింక దైవంబ కాని యొండు శరణంబు లేదని యప్పరమ పతివ్రత తనయుందోడ్కొనిక్రమ్మఱిపోవ నున్న యవసరంబున. | 104 |