| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| మ. |
యతిసంఘంబుల సంగతిన్ దురితకర్మాపేతుఁడై యేఁగి సం తతసిద్ధామరయక్ష సేవితసముద్యచ్ఛృంగ మై యున్న యా శతశృంగం బను పర్వతంబున శుభాచారుండు నిత్యవ్రతో ద్యతుఁ డై ఘోరతపంబు సేసె మునిబృందం బద్భుతం బందఁగన్. |
64 |
| వ. | ఇట్లు శతశృంగంబున నుత్తరభాగంబునందుఁ దపంబు సేయుచు బ్రహ్మఋషి సమానుండై, దివ్యవిమానంబు లెక్కివచ్చుచుం బోవుచున్న దేవగణంబులచేత సంకీర్ణం బైన స్వర్గమార్గంబున నుత్తరాభిముఖు లై యూర్థ్వలోకంబున కనాయాసంబున నరిగెడు మునిసహస్రంబుం జూచి, ‘మీర లెందులకుఁ బోయెద’రని యడిగిన నప్పాండురాజునకు వార లి ట్లనిరి. | 65 |
| క. |
అమవస గావున నేఁ డ | క్కమలజుఁ గొలువఁగ మహర్షిగణములు పితృసం ఘములును బోదురు బ్రహ్మాం | డమునం గలవార లం దొడంగూడంగన్. |
66 |
| వ. | ‘అది కారణంబుగా నేమును బ్రహ్మలోకంబునకుం బోయెద’ మనిన నమ్మునుల పిఱుంద భార్యాద్వయసహితుండై సమవిషమప్రదేశంబులం జనుచున్న య ప్పాండురాజుం జూచి ఋషు లి ట్లనిరి. | 67 |
| క. |
వీర లతిలలిత మృదులా | కారలు, గిరివిషమగహనగహ్వరముల రా నేరరు గావున నిట చను | దేరక మీ రుండుఁ డివియు దేవపథంబుల్. |
68 |
| క. |
అనిన విని నరుల కక్కడఁ | జనఁబోలమి యెఱిఁగి పాండుజనపాలకుఁ డి ట్లనియెను ‘స్వర్గద్వారం | బనపత్యులు గాన నోపరటె మును లయ్యున్.’ |
69 |
| వ. | ‘అపుత్త్రస్య గతి ర్నాస్తి’ యను వేదవచనంబుం గలదు గావున నే నపుత్త్రకుండ నేమి సేయుదు? ననిన మునులును గరుణించి యోగదృష్టి ననాగతం బెఱింగి. ‘నీ వపుత్త్రకుండవు గావు; దైవాధిష్ఠితం బైన సంతానంబు నీకు ధర్మానిలశక్రాశ్వినులవరంబున నగు; నక్షయలోకంబులుం బడయుదువు గావున సంతానార్థంబు యత్నంబుఁ సేయు’ మనిన విని పాండురా జాత్మగతంబునఁ ‘బురుషుండు పుట్టుచుండి దేవఋషి పితృమనుష్యులఋణంబులు నాలుగింటితోడం బుట్టి యథాకాలవిధుల వానివలన విముక్తుండు గావలయు; నట్లుగాని వానికిఁ బుణ్యలోకంబులు లేవు; యజ్ఞంబులంజేసి దేవతలఋణంబును, దపస్స్వాధ్యాయ బ్రహ్మచర్యవ్రతంబులంజేసి ఋషుల ఋణంబును, శ్రాద్ధపుత్త్రలాభంబులం జేసి పితరుల ఋణంబును, నానృశంస్యంబునం జేసి మనుష్యుల ఋణంబునుం బాపవలయు; నందుఁ బితరుల ఋణంబు దక్కఁ దక్కిన మూఁడుఋణంబులవలన విముక్తుండ నయితి. | 70 |
| తే. |
దేహనాశంబుతోడన తీఱు నెల్ల | ఋణములును మఱి పితరులఋణము దేహ నాశ మయినను దీఱదు నాకు నదియ | తక్కియున్నది యే నెట్లు దానిఁ బాతు. |
71 |
| వ. | అని దుఃఖించి మృగశాపంబు దలంచి, తనవలన సంతానం బయ్యెడి విధంబు లేమి యెఱింగి యొక్కనాఁ డేకాంతంబ గొంతి కి ట్లనియె. | 72 |
| ఉ. |
దానములం దపంబుల సదక్షిణ యజ్ఞములన్ విహీన సం తానుల కూర్ధ్వలోక సుపథంబు లవశ్యము గావు; లబ్ధ సం తానుల యెందుఁ బుణ్యు; లిది తథ్యము గావున నొండు దక్కి సం తానము నాకు నయ్యెడువిధం బొనరింపుము ధర్మసంస్థితిన్. |
73 |
| క. |
అనపత్యుఁడ నై జీవిం | చిన, మృతిఁ బొందినను నిర్విశేషంబ; యిహం బును బరమును నఫలమ; గా | వున సంతతి వడయు ధర్మువున ధర్మసతీ! |
74 |
| వ. | ‘ఔరస క్షేత్రజ దత్తక కృత్రిమ గూఢోత్ప న్నాపవిద్ధు లను నార్వురుపుత్త్రులు బంధువులు దాయాదులు నగుదురు, కానీన సహోఢక్రీత పౌనర్భవ స్వయందత్త జ్ఞాతు లను నార్వురుపుత్త్రులు బంధువు లగుదురు గాని దాయాదులు గా; రట్టి పుత్త్రులలో నౌరసున కించుకయ తక్కువగాని తక్కటి పుత్త్రులకంటె క్షేత్రజుం డుత్కృష్టుం; డందును దేవరన్యాయ జాతుం డుత్తముం డండ్రు గావున నస్మన్నియోగంబునంజేసి ధర్మమార్గంబున క్షేత్రజులం బడసిన నేనును బుత్త్రవంతుల పుణ్యలోకంబులు వడయనేర్తు; నె ట్లనినఁ; దొల్లి గేకయరా జైన శారదండాయని పుత్త్రోత్పాదనంబునం దశక్తుం డయి తనధర్మపత్ని నీచెలియలి శ్రుతసేనం బుత్రార్థంబు నియోగించిన నది బ్రాహ్మణవచనంబునం బుణ్యస్నాతయై పుంసవనహోమంబు సేయించి ఋత్విజులవలన దుర్జయాదు లయిన కొడుకుల మువ్వురం బడసెఁ; బుత్త్రలాభంబున ననంతపుణ్యఫలం బగుట నది ధర్మ్యం బయిన యాచారం’ బనిన విని కుంతి యి ట్లనియె. | 75 |
| క. |
భరతకులశ్రేష్ఠుఁడ వయి | పరఁగిన నీ కేము ధర్మపత్నుల మయి యిం కొరుల మనుష్యుల నంతః | కరణంబులఁ దలఁపఁ బొందఁగా నోపుదుమే? |
76 |
| వ. | ‘భవత్ప్రసాదంబున మాయందుఁ బుత్త్రోత్పత్తి యగు నె ట్లనిన; దీని కనుగుణం బయినది యొక్క పుణ్యకథఁ దొల్లి పౌరాణికులవలన నా వినిన దానిం జెప్పెదఁ జిత్తగించి విను’ మని పాండురాజునకుఁ గుంతి యి ట్లనియె. | 77 |