| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| ఉ. |
శాత్త్రవజైత్రతేజమున సర్వదిశల్ వెలుఁగంగ నైంద్ర న క్షత్త్రయుతుండుగా శశి ప్రకాశజయోన్నత మైన యష్టమిన్ మిత్త్రముఖగ్రహప్రతతి మేలుగ నాభిజితోదయంబునం బుత్త్రుఁడు ధర్మునంశమునఁ బుట్టె నతిస్థిరధర్మమూర్తి యై. |
94 |
| క. |
ధరణీసురు లాదిగ ను | ర్వరలోఁ గల సర్వభూత వర్గం బెల్లం బరమోత్సవ మొందెను గుణ | శరణ్యుఁ డగు ధర్మజన్ము జన్మదినమునన్. |
95 |
| క. |
శతశృంగ నిలయు లగు సం | శ్రితవ్రతులు విప్రవరులు సేసిరి ధర్మ స్థితి జాతకర్మ మత్యు | న్నతిఁ బాండుప్రథమపుత్త్రునకు హర్షముతోన్. |
96 |
| క. |
కురుకుల విభుఁ డగు ధర్మ | స్థిరమతి యగు నీతఁ డనుచు ధృతిఁ జేసి యుధి ష్ఠిరుఁ డను నామముఁ దా ను | చ్చరించె నాకాశవాణి జనవినుతముగన్. |
97 |