| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| క. |
కొడుకుం ద్రిలోక విజయుం | బడయుదు నని ఘోర మగు తపం బొనరింపం దొడఁగె సురరాజు నెడలో | నిడికొని యేకాగ్రబుద్ధి నేకాంతమునన్. |
116 |
| వ. | ఇ ట్లతి నిష్ఠ నేకపాద స్థితుం డయి తపంబు సేయుచుఁ గుంతి నొక్క సంవత్సరంబు వ్రతంబు సేయం బంచియున్న నప్పాండురాజున కింద్రుండు ప్రత్యక్షం బై. | 117 |
| క. |
‘పుత్త్రుఁడు నీ కుదయించు న | మిత్త్రక్షయకరుఁడు బంధుమిత్త్రాంబుజ స న్మిత్త్రుం’ డని వర మిచ్చిన | ధాత్త్రీపతి పొంగి పృథకుఁ దా ని ట్లనియెన్. |
118 |
| క. |
ధనమున విద్యను సంతతిఁ | దనిసిన వా రెందుఁ గలరె? ధవళేక్షణ! కా వున నా కింకను బలువురఁ | దనయులఁ బడయంగ వలయు ధర్మువు పేర్మిన్. |
119 |
| చ. |
అమరగణంబులోనఁ బరమార్థమ యింద్రుఁడు పెద్ద, సర్వలో కములకు వల్లభుం డతఁడ కావున నయ్యమరాధిపప్రసా దమున సుతున్ సురేంద్రసము ధర్మసమన్వితు నస్మదీయవం శము వెలుఁగింపఁగాఁ బడయు సర్వజగత్పరిరక్షణక్షమున్. |
120 |
| వ. | అని నియోగించినఁ గుంతియుఁ దొల్లిటి యట్ల దుర్వాసుం డిచ్చిన మంత్రంబున నింద్రు నారాధించినఁ, దత్ప్రసాదంబునఁ గుంతికి. | 121 |
| క. |
స్థిరపౌరుషుండు లోకో | త్తరుఁ డుత్తరఫల్గునీప్రథమపాదమునన్ సురరాజునంశమున భా | సురతేజుఁడు వంశకరుఁడు సుతుఁ డుదయించెన్. |
122 |
| సీ. |
‘విను కార్తవీర్యుకంటెను వీరుఁ డగుట న | ర్జుననామ మీతండ యొనరఁ దాల్చు; నీతండ యనిఁ బురుహూతాదిసురుల నో | డించి ఖాండవము దహించు బలిమి; నీతండ నిఖిలావనీతలేశుల నోర్చి | రాజసూయము ధర్మరాజు నునుచు; నీతండ వేల్పులచేత దివ్యాస్త్రముల్ | వడసి విరోధుల నొడుచుఁ గడిమి’ |
|
| ఆ. |
ననుచు నవపయోదనినదగంభీర మై | నెగసె దివ్యవాణి గగనవీథిఁ, గురిసెఁ బుష్పవృష్టి, సురదుందుభిధ్వనుల్ | సెలఁగె సకలభువనవలయ మద్రువ. |
124 |
| వ. | మఱియు మరీచ్యాది ప్రజాపతులును, ధాత్రాది ద్వాదశాదిత్యులును, మృగవ్యాధాది రుద్రులును, ధరాది వసువులును, భరద్వాజాది మహర్షులును, భీమసేనాది గంధర్వులును, శేషాది మహానాగముఖ్యులును, వైనతేయాది ఖచరులును, మేనకాద్యప్సరసలును, నాశ్వినులును, విశ్వేదేవతలును, మఱియు స్వర్గంబున నున్నరాజులుం జను దెంచిన. | 125 |
| క. |
శతశృంగనగేంద్రము శత | ధృతి సర్గదినంబపోలెఁ ద్రిభువనభూత ప్రతతిఁ బరిపూర్ణశోభా | ధృతి నింద్రతనూజుజన్మదినమున నొప్పెన్. |
126 |
| మాలిని |
సరససురవధూలాస్యంబులున్ సిద్ధవిద్యా ధరపటుపటహాతోద్యంబులుం గిన్నరీ కిం పురుష లలితగీతంబుల్ మహారమ్య మయ్యెన్ వరముని దివిజాశీర్వాదనాదంబుతోడన్. |
127 |
| వ. | పాండురాజును బరమోత్సవంబునం గుంతివలనఁ బురుషత్రయసమానం బయిన పుత్త్రత్రయంబు వడసి భువనత్రయరాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, కుమారులతోడి వినోదంబులం దగిలి యున్నంత; మాద్రి దనయందుఁ బుత్త్రజన్మంబు వడయు నుపాయంబు లేమికి దుఃఖించి యాత్మగతంబున. | 128 |
| ఉ. |
కోరిన కోర్కికిం దగఁగఁ గుంతి సుతత్రయంబుఁ గాంచె; గాం ధారియు నక్కడన్ సుతశతంబు ముదం బొనరంగఁ గాంచె; నేఁ బోరచి యాఁడుఁబుట్టువునఁ బుట్టి నిరర్థకజీవ నైతి సం సారసుఖావహం బయిన సత్సుతజన్మముఁ గానఁ బోలమిన్. |
129 |