| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| లయగ్రాహి |
కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసఁగెం; జూ తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముద మ్మొనర వాచా లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధుర మ్మగుచు విన్చె; ననిశమ్ము సుమనోభా రమ్ముల నశోకనికరమ్ములును జంపకచయమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్. |
138 |
| లయగ్రాహి |
చందన తమాలతరులందు నగరుద్రుమములందుఁ గదళీవనములందు లవలీ మా కంద తరుషండములయందు ననిమీలదరవిందసరసీవనములందు వనరాజీ కందళిత పుష్పమకరందరసముం దగులుచుం దనుపు సౌరభము నొంది జనచిత్తా నందముగఁ బ్రోషితులడెందము లలందురఁగ మందమలయానిల మమందగతి వీచెన్. |
139 |