| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| చ. |
మనుమల నెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు ‘వీరిఁ జే కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరశరాసనవిద్యలెల్లఁ; బెం పున జమదగ్నిసూనుఁడును బోలఁడు’ ని న్నని విందు విల్లునే ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమగర్వసంపదన్. |
222 |
| వ. | అని కుమారుల నెల్లం జూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన, ద్రోణుండును వారలం జేకొని యందఱ కి ట్లనియె. | 223 |
| తే. |
‘అస్త్రవిద్యలు గఱచి నా దైన యిష్ట | మొగిన తీర్పంగ నిం దెవ్వఁ డోపు’ ననినఁ బాయ మొగమిడి కౌరవుల్ పలుకకుండి; | ‘రేను దీర్చెద’ నని పూనె నింద్రసుతుఁడు. |
224 |
| వ. | ఇట్లు దన యిష్టంబు దీర్పం బూనిన యర్జును నాచార్యుం డతిస్నేహంబునఁ గౌఁగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారుల కెల్ల విలువిద్యఁ గఱపుచున్న, నానాదేశంబులం గల రాజపుత్త్రులెల్ల వచ్చి వారితోడఁ గలసి కఱచుచుండిరి; మఱియు, సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యాకౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు దుర్యోధనపక్షపాతి యై యుండె; నంత. | 225 |
| క. |
నరుఁ డస్త్రశస్త్రవిద్యా | పరిణతి నధికుఁ డయి వినయపరుఁ డయి శశ్వ ద్గురుపూజాయత్నంబునఁ | బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్. |
226 |
| వ. | అ య్యర్జునుతోడి విద్యామత్సరంబునఁ జీఁకటి నాతం డేయ నేరకుండవలయు నని తలంచి యశ్వత్థామ రహస్యంబున నన్నసాధకుం బిలిచి ‘యెన్నండును నరునకు నంధకారంబునఁ గుడవం బెట్టకుమీ!’ యని పంచిన వాఁడును దద్వచనానురూపంబు సేయుచున్న నొక్కనాఁటి రాత్రియందు. | 227 |
| ఉ. |
వాసవనందనుండు గుడువం గుడువం బటుమారుతాహతిం జేసి చలించి దీపశిఖ చెచ్చెరఁ బాయుడు భోజనక్రియా భ్యాసవశంబునం గుడిచి ‘పన్నుగ నిట్టుల విద్య లెల్ల న భ్యాసవశంబునం బడయ భారము లే దని నిశ్చితాత్ముఁ డై. |
228 |
| క. |
పాయక చీఁకటియందును | నేయంగా నభ్యసించు నిట్టియెడం గౌం తేయు ధనుర్‌జ్యా ధ్వని విని | ధీయుక్తుఁడు ద్రోణుఁ డరుగుదెంచి ముదమునన్. |
229 |
| సీ. |
ఆతని యస్త్రవిద్యాభియోగమునకుఁ | బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి ‘యన్న! ధనుర్ధరు లన్యులు నీకంటె | నధికులు గాకుండునట్లు గాఁగఁ గఱపుదు విలువిద్య ఘనముగా’ నని పల్కి | ద్వంద్వసంకీర్ణయుద్ధముల తెఱఁగు రథమహీవాజివారణములపై నుండి | దృఢచిత్రసౌష్ఠవస్థితుల నేయ |
|
| తే. |
బహువిధవ్యూహభేదనోపాయములను | సంప్రయోగరహస్యాతిశయము గాఁగఁ గఱపె నర్జునుఁ దొంటి భార్గవుఁడు వింట | నిట్టిఁ డే! యని పొగడంగ నెల్ల జనులు. |
230 |