| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అంత ననంతబలపరాక్రము లగు భీమదుర్యోధను లుద్యద్గదాహస్తు లయి మహామత్సరంబుతో నేక శృంగసముత్తుంగశైలద్వయంబు ననుకరించుచు వశానిమిత్తక్రుద్ధగంధసింధురంబులుంబోలె నొండురులం దాఁకి సవ్యాపసవ్యచిత్రమండలమార్గంబుల గదాకౌశలంబు మెఱయునెడ. | 13 |
| మ. |
అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగ నత్యుగ్రభై రవహుంకార రవంబునన్ వియదగారంబెల్ల భేదిల్లఁ బాం డవకౌరవ్యగదావిఘట్టన మకాండప్రోత్థమై భావిపాం డవకౌరవ్యరణాభిసూచన పటిష్ఠం బయ్యె ఘోరాకృతిన్. |
14 |
| క. |
ఆ రాజసుతులవిద్యా | పారగపటు చేష్టితములఁ బరువడి నగ్గాం ధారీధృతరాష్ట్రుల కతి | ధీరుఁడు విదురుండు సెప్పి తెలుపుచునుండెన్. |
15 |
| వ. | అంత భీమదుర్యోధనుల గదా కౌశలంబు సూచుజనులపక్షపాతజనిత పరస్పర క్రోధ వచనంబులు విని ద్రోణుండు రంగభంగభయంబున నశ్వత్థామంబంచి వారి నిద్దఱ వారించి, వారాశియుంబోలె బోరన మ్రోయుచున్న వాదిత్రశబ్దంబు లుడిపి, ‘నా ప్రియశిష్యుండయిన యర్జును ధనుర్విద్యాకౌశలంబుఁ జూడుం’ డనిన నయ్యాచార్యు వచనానంతరంబున. | 16 |
| ఉ. |
హారివిచిత్రహేమకవచావృతుఁ, డున్నతచాపచారుదీ ర్ఘోరుభుజుండు, భాస్వదసితోత్పలవర్ణుఁడు, సేంద్రచాపశం పారుచిమేఘమో యనఁగ బాండవమధ్యముఁ డొప్పి బద్ధతూ ణీరుఁడు రంగమధ్యమున నిల్చె జనంబులు దన్నుఁ జూడఁగన్. |
17 |
| క. |
నరు నింద్రాత్మజు నింద్రా | వరజసఖున్ వీరుఁ బాండవప్రవరు ధను ర్థరుఁ జూచి, చూపఱెల్లం | బరమాద్భుతచిత్తు లగుచుఁ బలికిరి తమలోన్. |
18 |
| తే. |
వీఁడె కృతహస్తుఁ డఖిలాస్త్రవిద్యలందు | వీఁడె యగ్రగణ్యుఁడు ధర్మవిదులలోన, వీఁడె భరతవంశం బెల్ల వెలుఁగఁ గుంతి | కడుపు చల్లఁగాఁ బుట్టిన ఘనభుజుండు. |
19 |
| క. |
అని పలుకుజనులపలుకులు | విని గొంతి యనంతహర్షవిస్తారితలో చన యై నందను నృపనం | దనసంఘములోనఁ జూచి తద్దయుఁ బొంగెన్. |
20 |
| క. |
చారుమనస్సమ్మదరస | పూరము వెలివేర్చునట్లు పొలఁతికి విగళ ద్భూరిస్తనజనితపయో | ధారలు నానందబాష్పధారలు నొప్పెన్. |
21 |
| వ. | అయ్యర్జునుస్తుతివచనంబు లొక్కట జనసంఘంబువలన నెగసి వియత్తలవిదళనం బయిన నమ్మహాధ్వని విని యదరిపడి ధృతరాష్ట్రుం ‘డిది యేమి రభసం?’ బని విదురు నడిగిన నాతం డి ట్లనియె. | 22 |
| క. |
భూరిభుజుం డర్జునుఁ డతి | శూరుఁడు దనయస్త్రవిద్యఁ జూపఁగ రంగ త్ప్రారంభుఁ డయిన నతని న | వారితముగఁ బొగడుజనరవం బిది యధిపా! |
23 |
| క. |
అనవుడు ధృతరాష్ట్రుఁడు దన | మనమున సంతోషమంది మానుగ వీనుల్ గనిన ఫల మిపుడు గంటిన్ | వినఁ గంటినిఁ బాండుసుతుల విద్యాశక్తుల్. |
24 |
| క. |
భూరినిజద్యుతితోడఁ బృ | థారణిసంభూతపాండవాగ్నిత్రితయం బారఁగ నస్మత్కులదురి | తోరుతరారణ్యదాహ మున్నతిఁ జేయున్. |
25 |