| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | ఇట్లు ద్రుపదుండు ద్రోణుచేత విముక్తుం డయ్యుఁ గోపపాశబద్ధుం డయి యప్పరిభవంబునకుం బ్రతీకారంబు సేయ సమకట్టి బ్రాహ్మణోపాస్తి సేయుచుండె; నంత నిట ధృతరాష్ట్రుండు యుధిష్ఠిరు రాజ్యభారధురంధరుంగా నెఱింగి భీష్మవిదురులతో విచారించి యౌవరాజ్యాభిషిక్తుం జేసిన. | 92 |
| చ. |
నలువురు దమ్ములున్ బలిమి నాలుగుదిక్కులు నోర్చి సర్వభూ తలమున రాజనందనులదర్ప మడంచుచు భూరివస్తురా సులు గొనివచ్చి యీఁగొని విశుద్ధయశోనిధి యొప్పె ధర్మజుం డలఘుఁడు యౌవరాజ్యయుతుఁ డయ్యును బెంపున సార్వభౌముఁ డై. |
93 |
| వ. | మఱియును. | 94 |
| క. |
బద్ధపరంపర నొప్పె మ | దోద్ధతగజరథతురంగయుద్ధముల గదా యుద్ధములఁ జూడ నెందుఁ బ్ర | సిద్ధుఁడు మధ్యముఁడ యను విశిష్టస్తవముల్. |
95 |
| చ. |
అనుపమకార్ముకాదివివిధాయుధవిద్యలయందుఁ గోవిదుం డనఁగ నజయ్యుఁ డై పరఁగు నర్జునుఁ బోలఁగ నన్యు లెందు లే రను జనఘోష ముచ్చరిత మయ్యె మరుచ్చలితోచ్చవీచి ని స్వనముఖరాబ్ధివేష్టిత విశాలమహీవలయాంతరంబునన్. |
96 |
| క. |
యము లమితశౌర్యు లరినృప | యము లమలచరిత్రనిరతు లనఁగా నత్యు త్తమభక్తి నన్నలకు విన | యము మెఱయుచు నుండి రధికు లై బహుకళలన్. |
97 |