| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| సీ. |
‘ఆయుధవిద్యలయందు జితశ్రము | లనియును రణశూరు లనియు సంత తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును | భయమందుచుండుదుఁ బాండవులకు; దానిపై నిప్పుడు ధర్మజు యువరాజుఁ | జేసె రా; జే నేమి సేయువాఁడ? నృపనీతి యెయ్యది? నిరతంబుగా మీర | నా కెఱిఁగింపుఁడు నయముతోడ’ |
|
| ఆ. |
ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు, సౌబలు | నాప్తమంత్రి, నీతులందుఁ గరము కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు | నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె. |
101 |
| తరువోజ |
ధరణీశుఁ డుద్యతదండుఁ డై యుచిత | దండవిధానంబుఁ దప్పక ధర్మ చరితులఁగా మహీజనుల రక్షించి | సద్వృత్తుఁ డగునది; సర్వవర్ణములు వరుసన తమతమ వర్ణధర్మముల | వర్తిల్లుదురు గడవక దండభీతి నరిమిత్రవర్జితుఁ డై సమబుద్ధి | యగు మహీవల్లభు ననుశాసనమున. |
102 |
| క. |
గుఱుకొని కార్యాకార్యము | లెఱుఁగక దుశ్చరితుఁ డై యహితుఁ డగు నేనిన్ మఱవక గురు నైనను జను |లెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుద్ధిన్. |
103 |
| క. |
ధీరమతియుతులతోడ | విచారము సేయునది మును, విచారితపూర్వ ప్రారబ్ధమైన కార్యము | పారముఁ బొందును విఘాతపదదూరం బై. |
104 |
| క. |
జనపాలుఁడు మృదుకర్మం | బున నైనను గ్రూరకర్మమున నైనను నే ర్పున నుద్ధరించునది త | న్ననపాయతఁ బొంది చేయునది ధర్మంబుల్. |
105 |
| క. |
అమలినమతి నాత్మచ్ఛి | ద్రము లన్యు లెఱుఁగకుండఁ దా నన్య చ్ఛి ద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే | శముఁ గాలము నెఱిఁగి మిత్రసంపన్నుం డై. |
106 |
| క. |
బలహీను లైనచో శ | త్రులఁ జెఱచుట నీతి, యధిక దోర్వీర్య సుహృ ద్బలు లైన వారిఁ జెఱుపఁగ | నలవియె యక్లేశ సాధ్యు లగుదురె మీఁదన్. |
107 |
| క. |
అలయక పరాత్మ కృత్యం | బులఁ బతి యెఱుఁగునది దూతముఖమునఁ, బరభూ ముల వృత్తాంతము లెఱుఁగఁగఁ | బలుమఱుఁ బుచ్చునది వివిధ పాషండ తతిన్. |
108 |
| క. |
నానావిహార శైలో | ద్యాన సభా తీర్థ దేవతాగృహ మృగయా స్థానముల కరుగునెడ మును | మానుగ శోధింపవలయు మానవపతికిన్. |
109 |
| తే. |
వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁ | దగరు నాకు నా వలవదు; తత్త్వబుద్ధి నెవ్వరిని విశ్వసింపక యెల్ల ప్రొద్దు | నాత్మరక్షాపరుం డగు నది విభుండు. |
110 |
| ఉ. |
ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష య త్నమ్మునఁ జేయఁగావలయుఁ; దత్పరిరక్షణశక్తి నెల్ల కా ర్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము; మంత్రవిభేద మైనఁ గా ర్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికైనను నేరఁబోలునే. |
111 |
| క. |
పలుమఱు శపథంబులు నం | జలియును నభివాదనమును సామప్రియభా షలు మిథ్యావినయంబులుఁ | గలయవి దుష్టస్వభావకాపురుషులకున్. |
112 |
| క. |
తన కిమ్మగు నంతకు దు | ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం దన కిమ్మగుడును గఱచును | ఘనదారుణకర్మగరళ ఘనదంష్ట్రములన్. |
113 |
| క. |
కడునలుకయుఁ గూర్మియు నే | ర్పడ నెఱిఁగించునది వాని ఫలకాలమునన్ బిడుగును గాడ్పును జనులకుఁ | బడుటయు వీచుటయు నెఱుకపడియెడుభంగిన్. |
114 |
| క. |
తఱియగునంతకు రిపుఁ దన | యఱకటఁ బెట్టికొనియుండునది; దఱియగుడుం జెఱచునది ఱాతిమీదను | వఱలఁగ మృద్ఘటము నెత్తి వైచిన భంగిన్. |
115 |
| క. |
తన కపకారము మునుఁ జే | సిన జనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం జన; దొకయించుక ముల్లయి | నను బాదతలమున నున్న నడవఁగ నగునే. |
116 |
| క. |
బాలుఁ డని తలఁచి రిపుతో | నేలిదమునఁ గలిసియునికి యిది కార్యమె? యు త్కీలానలకణ మించుక | చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్. |
117 |
| క. |
మొనసి యపకారిఁ గడ నిడి | కొనియుండెడు కుమతి దీర్ఘకుజశాఖాగ్రం బున నుండి నిద్రవోయెడు | మనుజునకు సమాన మగుఁ బ్రమత్తత్వమునన్. |
118 |
| చ. |
తడయక సామభేదముల దానములన్ దయతోడ నమ్మఁగా నొడివియు సత్యమిచ్చియుఁ జనున్ జననాథ! కృతాపకారులం గడఁగి వధింపఁగాఁ గనుట కావ్యుమతం బిది; గాన యెట్టులుం గడుకొని శత్రులం జెఱుపఁగాంచుట కార్యము రాజనీతిమైన్. |
119 |
| వ. | ‘కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మరక్షాపరుండ వయి దూరంబుసేసి దూషించునది’ యనినఁ గణికుమతంబు విని దుర్యోధనుండు చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున కేకాంతంబున ని ట్లనియె. | 120 |