| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అట పాండవులును భాగీరథి లంఘించి దక్షిణాభిముఖు లయి మారుతమార్తాండమరీచిగోచరంబు గాని గహనంబున నరుగుచు నధికక్షుత్పిపాసాపరవశు లయి నడవనోపకయున్న నెప్పటియట్ల యందఱ నెత్తికొని వాయుతనయుండు వాయువేగంబునఁ జని సాయాహ్నంబున నొక్కవటమహీజాతశీతల శిలాతలంబున నునిచి దాని యగ్రవిటపం బెక్కి నీ రారయుచున్నంత ననతిదూరంబున. | 172 |
| మ. |
ప్రమదాపాదిపయఃప్రపూర్ణ మిది యౌఁ బద్మాకరం బంచుఁ ద త్కమలామోదసుగంధ మారుతము వీఁకన్ ము న్నెఱింగించినన్ రమణం బిల్చె సరోవరం బనిలజున్ రాజీవరాజీ వస త్సముదాళివ్రజచక్రవాక బక హంస క్రౌంచ నాదంబులన్. |
173 |
| వ. | ఆ దిక్కున కా క్షణంబ యరిగి య క్కొలను గని యందుఁ గృతావగాహుం డై కడుపునిండ నీళ్ళు ద్రావి యచ్ఛిద్ర కమల పత్త్ర పుటికల నీళ్ళు గొని భీముండు గ్రమ్మఱి వచ్చునంత. | 174 |
| క. |
ధరణీ దిశాప్రసారిత | గురుకరనికరంబు లుడిచికొని దీర్ఘనిరం తరగతి ఖిన్నుఁడపోలెను | హరిదశ్వుఁడు విశ్రమించె నస్తాద్రిదరిన్. |
175 |
| ఉ. |
అంబురుహాప్తుఁ డస్తశిఖరాంతరితుం డగుడున్ సమస్త జీ వంబులు నెల్లచో నిజ నివాసముఁ బొందునెడం దమిస్రపుం జంబులపోలె వెల్వడియె శైలవిశాలగుహాలినుండి నా గంబులయూధముల్ సరసఘాసపరిగ్రహణోత్సుకంబు లై. |
176 |