| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| వ. | ‘ఇ వ్వేళయందుఁ గ్రుమ్మరియెడువారి నెంత బలవంతుల నైనను రాజుల నయినను నిగ్రహింతుము; నన్ను డాయకుం; డెడగలిగి పొం; డే నంగారపర్ణుం డను గంధర్వుండఁ, గుబేరుసఖుండ; నెప్పుడు నిందు విహరించుచుండుదు; న న్నె ఱుంగరె! యి వ్వనంబును గంగాతీరంబును నంగారపర్ణంబులు నా జగద్విదితంబులు; దీని మానవులు సొర నోడుదు’ రనిన వాని కర్జునుం డి ట్లనియె. | 39 |
| క. |
నడురేయి సంధ్యలందును | నడవఁగ నోడుదు రశక్తనరు లొరులు; భయం పడుదుమె యే మెయ్యెడ నె | ప్పుడు నడతుమ యధికశక్తి పురుషుల మగుటన్. |
40 |
| క. |
అడవులు నేఱులు నివి నీ | పడసిన యవి యట్టె; పుణ్య భాగీరథి యి ప్పుడమిఁ గల జనుల కెల్లను | నెడపక సేవ్యంబ కాక యిది నీయదియే? |
41 |
| సీ. |
హైమవతోత్తుంగ హేమశృంగంబున | నుండి భూమికి వచ్చి యుదధిఁ గూడె గంగనా; మూఁడు దెఱంగుల నదియు; మం | దాకిని నా సత్పథంబునందు సురసిద్ధముని వియచ్చర సేవ్య యయ్యె; న | య్యధమలోకంబునయందు భోగ వతి యన నొప్పె నున్నతి; నిట్లు త్రిభువన | పావని యైన యిప్పరమమూర్తిఁ |
|
| ఆ. |
బార్వతీశమకుటబంధబంధురతరా | వాస గంగ నాడ వచ్చి నీవు వలవ దనిన నుడుగువారము గాము; నీ | విఘ్నవచనములకు వెఱతు మెట్లు? |
42 |
| వ. | అనుచు నిజ జననీ భ్రాతృ సహితుం డయి గంగాభిషేకార్థంబు చనుదెంచు న య్యర్జునునిపయి నంగారపర్ణుం డతినిశిత సాయకంబు లేసిన, నర్జునుం డలిగి తనచేతికొఱవి విదిర్చి యయ్యమ్ములు దన్నుం దాఁకకుండం గాచి కొని వాని కి ట్లనియె. | 43 |
| ఆ. |
వెడఁగ! యిట్టి పాటి వెఱపించుటలును మా | యలును నేమి సేయు నస్త్రవిదులఁ; బెక్కులయ్యు నీ బిభీషికల్ నుఱువులు | విరియునట్టు లిందు విరియుఁ జూవె. |
44 |
| సీ. |
అగ్నిదేవుండు బృహస్పతి కిచ్చె ము, | న్నతఁడు భరద్వాజుఁ డనఁగఁ బరఁగు ముని కిచ్చె, నమ్మహాముని భార్గవున కిచ్చె | భార్గవుండును గుంభభవున కిచ్చె నమ్మహాత్ముండు నా కతిదయ నిచ్చె ని | య్యనలాస్త్ర మని దాని నమ్మహోగ్ర గంధర్వుపై వైచె ఘనుఁ డింద్రసుతుఁ డంతఁ | దద్రథం బప్పుడ దగ్ధ మయిన, |
|
| ఆ. |
నగ్నిదాహభీతి నంగారపర్ణుండు | బమ్మరిల్లి నేలఁబడిన, వానిఁ గొప్పు వట్టి యీడ్చికొని వచ్చె ధర్మజు | కడకు నింద్రసుతుఁడు కడిమి మెఱసి. |
45 |
| క. |
వాని మనోవల్లభ కుం | భీనసి యనునది గరంబు భీతి ‘నశేషో ర్వీనాథులార! దయఁ బతి | దానము నా కిండు మీకు ధర్మువు పెరుఁగున్’. |
46 |
| క. |
అని యఱచుచున్నదానికి | ననఘుఁడు గరుణించి పాండవాగ్రజుఁ డయ్య ర్జునుఁ జూచి ‘వీని విడువుమ | యని నోడినవాని హీను నపగతశౌర్యున్’. |
47 |
| ఆ. |
అనిన నరుఁడు వల్లె యని వాని కనియె ‘గం | ధర్వ! నిన్నుఁ గరుణ ధర్మరాజు కురుకులేశ్వరుం డశరణశరణ్యుండు | విడువఁ బనిచె నింక వెఱవకుండు’. |
48 |
| వ. | అని వాని నాశ్వాసించి విడిచిన నట్లు నిర్జితుండై యర్జునున కంగారుపర్ణుం డి ట్లనియె. | 49 |