| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| ఆ. |
‘ఇందు లక్ష్య మెవ్వఁ డేసె నాతని వరి | యింపు నెమ్మితోడ నిందువదన!’ యనిన రాజపుత్త్రు లవ్విల్లు మోపెట్టి | యేయఁ గడఁగి కదలి రెల్లవారు. |
172 |
| సీ. |
అమ్మహోత్సవము నెయ్యమ్మునఁ జూడంగఁ | దివిరి యేతెంచిన దివిజ ఖచర గరుడ గంధర్వ కిన్నరుల విమానముల్ | విలసిల్లె నంబరతలమునందుఁ; బణవవీణావేణురణితానుసార మై | రసగీతరవ మెల్ల దెసల నెసఁగె; బోరన వివిధతూర్యారవంబులు మహా | వననిధిధ్వానంబు ననుకరించె; |
|
| ఆ. |
దివ్యమాల్యములయు దివ్యానులేపన | ములయు సౌరభంబు వెలయఁ దాల్చి రంగమధ్యజనులకుం గడు తనుపుగాఁ | జేరి వీచె దివ్య మారుతంబు. |
173 |
| చ. |
అవిరళభస్మమధ్యమున నగ్నికణంబుల పోలె బ్రాహ్మణ ప్రవరులలోన నేర్పడక పాండవు లేవురు నున్నఁ జూచి యా దవ వృషభుండు కృష్ణుఁడు ముదంబున వారి నెఱింగి, పార్థుఁ డీ యువతిఁ బరిగ్రహించు ననియుం దలఁచెన్ హృదయంబులోపలన్. |
174 |
| వ. | అంత నా రాజనందనులు ద్రుపదరాజనందనం జూచి కందర్పబాణబాధితు లయి తమ్మును దమ సామర్థ్యము నెఱుంగక యర్థిత్వంబున నవ్విల్లు మోపెట్టఁ బోయి. | 175 |
| క. |
వడి నౌడు గఱచి, వలకేల్ | నిడుచన గనయమునఁ బెనఁచి, నీల్గి, బలం బే ర్పడ విల్లు వంపనోపక | యుడిగిరి నృపసుతులు గొంద ఱొయ్యన లజ్జన్. |
176 |
| క. |
బలవంతుల బలమఱఁగా | మలువక మ్రాన్మ్రానిపాట మాయాధను వి మ్ములఁ జేసిన మోపెట్టఁగఁ | గొలఁదియె యని డాయ రైరి కొందఱు దానిన్. |
177 |
| మ. |
‘ఇది యెట్లున్ సమకూర దెవ్వరికి; ము న్నీ విల్లు మోపెట్టఁ బో లదు; మోపెట్టియు నంతరిక్షమున నా లక్ష్యంబు భేదింపఁగా నది బ్రహ్మాదుల కైన నిం దలవిగా’ దంచున్ విచారించి ని ర్ముదు లై కొందఱు రాజు లేఁగిరి నిజక్ష్మామార్గముల్ చూచుచున్. |
178 |