| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| వ. | పదుమూఁడగు మాసంబున మణిపూరపురంబునకుంజని, యందున్న రాజుఁ జిత్రవాహనుం గని, వానిచేతం బూజితుం డయి, తత్పుత్త్రిఁ జిత్రాంగద యనుదాని వివాహంబుగా నపేక్షించిన, నయ్యర్జునునభిప్రాయం బాప్తులవలన నెఱింగి చిత్రవాహనుం డర్జునున కి ట్లనియె. | 140 |
| క. |
ధన్యుండ నైతి నీ కీ | కన్యక నీఁ గాంచి; యైనఁగలతెఱఁగు జగ న్మాన్య! యెఱిఁగింపవలయు; న | నన్యమనస్కుండ వయి దయన్ విను మనఘా! |
141 |
| క. |
మా కులమునందుఁ దొల్లి ప్ర | భాకరుఁ డను రాజవరుఁ డపత్యము దనకున్ లేకున్న నుమేశ్వరునకుఁ | బ్రాకటముగ భక్తితోఁ దపం బొనరించెన్. |
142 |
| వ. | పరమేశ్వరుండును వానికిం గరుణించి నీకు నొక్కపుత్త్రుం డుద్భవించు; నీకులంబున వారికెల్ల సంతానం బిట్ల యగు నని వరం బిచ్చిన; నది మొదలుగా మావంశంబునవారికెల్ల నొక్కొక్కపుత్త్రుండ కా జన్మించుచు వచ్చిన నిప్పుడు నాకు నిక్కన్యక పుట్టె; నేను దీనిం బుత్త్రీకరణంబునం బెనిచితి. | 143 |
| తే. |
ఇందుఁ బుట్టినసుతుఁడు మా కిందువంశ్య! | వంశవిస్తారకుండు గావలయు; నిదియ యీలతాంగికి నుంకు; వి ట్లీఁగనోపు | దేని పెండిలియగుమ యీయింతిఁ బ్రీతి. |
144 |
| వ. | అనిన నర్జునుండు చిత్రవాహనువచనంబున కొడంబడి చిత్రాంగద వివాహం బై. | 145 |
| ఉ. |
అంగజరాజ్యలక్ష్మి పొడవైనదియొక్కొ యనంగ నొప్పు చి త్రాంగదయందుఁ బార్థుఁడు మహాప్రణయప్రవణాంతరంగుఁ డై యంగజభోగసంగమున నమ్మణిపూరపురిన్ సమస్తలో కాంగణరంగసంగతవిహారయశోంగదుఁ డుండె లీలతోన్. |
146 |