| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| వ. | ఇట్లు వాసుదేవుండు వసుదేవాక్రూరసారణసాంబసాత్యకిసహితంబుగా నంతర్ద్వీపంబుననుండి వచ్చిన యనంతరంబ యమరావతినుండి యమరసిద్ధసాధ్యమునిగణపరివృతుం డై యమరేంద్రుండు వచ్చె; నంత బృహస్పతి యిచ్చిన యుత్తమలగ్నంబున నగ్నియమనిరృతివరుణవాయుధనదేశానాదిసురవరులు, నత్రిభృగు నారద వసిష్ఠవామ దేవప్రభృతి మహామునులును సదస్యులుగాఁ, గశ్యపప్రజాపతి హోమకర్తగా, నరుంధతియు శచియు సత్యభామయు రుక్మిణియు నప్సరోగణంబులతోడం బురంధ్రీకార్యంబులు నిర్వహింప సుభద్రార్జునుల వివాహమహోత్సవం బతిరమ్యం బయ్యె నంత. | 194 |
| తరువోజ |
అనిమిషప్రభుఁడు నిజాత్మజు ననఘు | నర్జునుఁ బ్రీతితో నభిషిక్తుఁ జేసి మనుజేంద్రుఁ గాంచనమణిమయోత్తుంగ | మకుటవిభూషణమస్తకుఁ జేసి యనుపమకేయూరహారాదిభూష | ణాభిశోభితుఁ జేసి యప్పు డానంద జనితాంబుకణికార్ద్రచక్షుస్సహస్ర | జలరుహంబులు దాల్చె సమ్మదం బెసఁగ. |
195 |
| మాలిని |
నరునకు దయ ని ట్లానంద మొందించి యింద్రుం డరిగె దివికి దివ్యానంతరత్నాంశుజాల స్ఫురితసురవిమానంబుల్ నభోభాగ మెల్ల న్మెరసి వెలుఁగుచుండన్ నిర్జరశ్రేణితోడన్. |
196 |
| వ. | ఇట్లు నారాయణుండు నిజారంభంబు సఫలం బగుటకు సంతసిల్లి, సంప్రాప్తమనోరథుం డయిన యప్పార్థుం గౌఁగిలించుకొని, ‘యక్షయబాణతూణీరబాణాసనసనాథం బయి పవనజవనహయంబులం బూన్చిన యక్కాంచనరథం బెక్కి సుభద్రం దోడ్కొని యింద్రప్రస్థపురంబున కరుగు’ మని పంచి, యనంతరం బంతర్ద్వీపంబున కరిగిన. | 197 |
| క. |
హరి పంచిన మార్గంబునఁ | గురువిభుఁడు సుభద్రఁ దోడుకొని చనునెడఁ ద త్పురపరిరక్షకు లతిభీ | కరులు పృథుశ్రవసుఁ డాదిగాఁ గల వీరుల్. |
198 |
| ఉ. |
‘వీరుఁడు వీఁడు పాండవుఁడు వృష్ణికులోత్తము లైన సీరిదై త్యారు లెఱుంగకుండఁగ మహారథుఁ డై తరుణిన్ సుభద్ర నం భోరుహనేత్రఁ దోడ్కొనుచుఁ బోయెడి; నీతనిఁ బోవనిచ్చినన్ ధీరుఁడు మాధవుండు బలదేవుఁడు నల్గుదు’ రంచు నడ్డ మై. |
199 |
| క. |
వీఁకఁ బఱతెంచి నలుగడఁ | దాఁకినఁ గడు నలిగి ఘోరతరశరహతి న మ్మూఁకలు విరియఁగ నర్జునుఁ | డాఁకరమున నేసె నుగ్రుఁ డయి రణభూమిన్. |
200 |
| చ. |
హరితనయుండు పార్థుఁడు రయంబున నందఱ నాహవక్రియా విరతులఁ జేసి యప్పురమువీథుల వేదుల రమ్యహర్మ్య గో పురములఁ దద్గిరీంద్రమణిభూముల భూరితటాకపంకజా కరనవనందనావళులఁ గాండమయంబులఁ జేసె నీసునన్. |
201 |
| క. |
అమరేంద్రసుతుఁడు దనకుం | గమలాక్షి సుభద్ర రథముఁ గడపఁగ ననిలో నమిత యదుసైన్యముల న | శ్రమమున నోడించి లబ్ధ జయుఁ డయి యరిగెన్. |
202 |
| వ. | అంత సభాపాలుండు ప్రబల జలధార ధ్వాన గంభీరభేరీధ్వనిచే నర్జునుపరాక్రమం బెఱింగించిన దాని విని యంతర్ద్వీపంబున నున్న బలదేవాదియాదవులందఱు నాక్షణంబ పురంబునకు వచ్చి సభాసీను లయి. | 203 |
| క. |
యాదవుల నాదరింపక | యాదవిఁ దోడ్కొని కిరీటి యరిగెను గంభీ రోదధిఁ గరముల నీఁదం | గా దనక కడంగె నధికగర్వోద్ధతుఁ డై. |
204 |
| మత్తకోకిల |
ఏల పార్థుపరాక్రమంబు సహింప? నాతని నాహవ వ్యాలు నిప్పుడ పట్టి తెత్తము; వాతధూతదవానల జ్వాలకున్ వనరాశివేల కసంఖ్యయాదవసేనకున్ దేలిపోవక చక్కనయ్యెడు ధీరు లెవ్వరు పోరిలోన్. |
205 |
| వ. | అని విజృంభించి విలయసమయ సముద్ధూత వారాశియుంబోలె ఘూర్ణిల్లుచున్న యాదవవీరుల వారించి వాసుదేవుం జూచి, బలదేవుం డి ట్లనియె. | 206 |
| క. |
‘నీ వెఱుఁగకుండ గర్వము | తో విజయుఁడు దా సుభద్ర దోడ్కొని బలిమిం బోవఁగ నంతసమర్థుఁడె’ | నావుడుఁ గృష్ణుండు రామునకు ని ట్లనియెన్. |
207 |
| సీ. |
భరతకులాగ్రణి పాండవసింహంబు | సర్వధర్మజ్ఞుఁ డాసవ్యసాచి దనమేనమఱఁదలి ధవళాక్షిఁ దోడ్కొని | చనియె; నాతని కది చనదె చెపుఁడ! యప్పార్థుపిఱుఁద మీ రరుగంగ వాఁ డంత | యశ్రమసాధ్యుఁడె యాహవమున? నఖిలాస్త్రవిదుఁడు ద్రోణాచార్యశిష్యుండు | జితకాశి యని వానిఁ జెప్ప వినరె? |
|
| ఆ. |
వలవ దుడుగుఁ’ డనిన వామను పలు కను | వేలఁ గడవదయ్యె వృష్ణిభోజ యాదవాంబురాశి యట ధనంజయుఁ డవి | జేయుఁ డభిమతార్థసిద్ధిఁ బొంది. |
208 |